Nani: 'ఆ దేశాల్లో మనకంటే క్రైమ్ రేట్ తక్కువే' - అది ఓ స్టుపిడ్ కాన్సెప్ట్ అంటున్న నేచురల్ స్టార్ నాని
HIT 3 Trailer Launch Event: 'హిట్ 3' మూవీ క్రైమ్ థ్రిల్లర్ అని.. ఇది పిల్లలకు చూపించొద్దు అని చెప్పడం ఓ బాధ్యత అని నేచురల్ స్టార్ నాని అన్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Nani About HIT 3 Trailer Violence: 'హిట్ 3' (HIT 3) సినిమాతో పోలిస్తే 10 రెట్లు వయలెన్స్ ఎక్కువగా ఉండే సినిమాలు తెరకెక్కించే దేశాల్లో మన కంటే క్రైమ్ రేట్ తక్కువగా ఉందని నేచురల్ స్టార్ నాని (Nani) అన్నారు. సోమవారం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
నా కుమారుడికి ఈ సినిమా చూపించను
'హిట్ 3' ఓ క్రైమ్ థ్రిల్లర్ అని.. పిల్లలకు చూపించొద్దు అని చెప్పడం తన బాధ్యత అని నాని అన్నారు. అన్ని సినిమాలు అందరి కోసం తీయడం మొదలుపెడితే.. అప్పుడు నిజంగానే కలెక్షన్లపై ఎఫెక్ట్ పడుతుందని తెలిపారు. 'ఈ సినిమాకు నా కుమారుణ్ని కూడా నేను తీసుకెళ్లను. ఈ మూవీ కారణంగా ఓ వర్గం ప్రేక్షకులు తగ్గితే మరో వర్గం ప్రేక్షకులు పెరుగుతారు. క్రిమినల్ మైండ్ ఉన్న వాడే నేరం చేస్తాడు. సినిమాను ఓ కారణంగా చెబుతాడు. 'దసరా' సినిమాలోనూ వయలెన్స్ ఉంది. కానీ సూపర్ హిట్ అయ్యింది. హిట్ 3లో వయలెన్స్, ప్యారడైజ్ సినిమాలు చూసి నాని ఇంతకు ముందులా కాకుండా కొత్తగా చేశాడని ప్రేక్షకులు అనుకుంటారని భావిస్తున్నా.' అని నాని చెప్పారు.
చాగంటి ప్రవచనం వెనుక..
'హిట్ 3' ట్రైలర్‌లో చాగంటి ప్రవచనం స్టోరీ డిమాండ్ మేరకు పెట్టామని నాని తెలిపారు. అవి ట్రైలర్ కోసమే పెట్టిన డైలాగ్స్ కావని.. ఆయన ప్రత్యేకంగా సినిమా కోసం చెప్పిన మాటలని అన్నారు. 'థ్రిల్లర్స్ ఎంజాయ్ చేసే వారికైతే హిట్ 3 మూవీ కొత్త అనుభూతిని పంచుతుంది. ఒకవేళ సినిమా చూసి నేను చెప్పింది కరెక్ట్ కాదని అనిపిస్తే.. ఇకపై నన్ను నమ్మకండి. ట్రైలర్ చూస్తే సినిమాలో ఎక్కువ వయలెన్స్ ఉందని అనిపించొచ్చు. కానీ సినిమా చూసేటప్పుడు ఇంత వయలెన్స్ ఏంటనే ఆలోచన రాదు. స్టోరీలో లీనమవుతారు. నాకు నేచురల్ స్టార్, నేషనల్ స్టార్ ఏ పేరు పెట్టినా నా సినిమాలు నేను చేసుకుంటూ వెళ్లిపోతాను.' అని అన్నారు.
అది ఓ స్టుపిడ్ కాన్సెప్ట్
'మీరు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన హీరో. 'టైర్ 1' జాబితాలో చేరినట్లేనా?' అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నగా నాని స్పందించారు. అది మనం క్రియేట్ చేసుకున్న పదమే అని.. నటుడికి తగ్గట్లు సినిమాలు తెరకెక్కుతాయని అన్నారు. 'నటులను ఆ పేర్లతో ఎందుకు సెపరేట్ చేస్తున్నారో నాకు అర్థం కాదు. అది స్టుపిడ్ కాన్సెప్ట్. ఎవరు మొదలుపెట్టారో కానీ మనం ఎంకరేజ్ చేస్తున్నాం. దాన్ని ఆపితే చిత్ర పరిశ్రమ బాగుంటుంది. అది బాగుంటే అందరం హ్యాపీగా ఉంటాం.' అని అన్నారు.
మే 1న ప్రేక్షకుల ముందుకు
నాని 'హిట్ 3' ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. నాని యాక్షన్, మాస్ ఎలివేషన్స్, వయలెన్స్ వేరే లెవల్‌లో ఉన్నాయి. మే 1న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన కనిపించనున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో.. నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. నాని సరసన 'కేజీఎఫ్' ఫేం శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. మూవీలో రావు రమేష్, కోమలీ ప్రసాద్, సూర్య శ్రీనివాస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.





















