BRS Party Key Meeting: ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
BRS Meeting Postponed | ఈ నెల 19న తెలంగాణ భవన్‌లో జరగాల్సిన తెలంగాణ సీఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని డిసెంబర్ 21వ తేదీకి వాయిదా వేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

BRS Chief KCR | హైదరాబాద్: డిసెంబర్ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, బీఆర్‌ఎస్ ఎల్పీ (శాసనసభాపక్ష) సమావేశాలు వాయిదా పడ్డాయి. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 21వ తేదీకి పార్టీ కీలక సమావేశాలను వాయిదా వేసినట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సమావేశాలు వాయిదా వేసినట్లు తెలిపారు. ఈ నెల 19వ తేదీతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. ఈ కారణంగా, కీలక సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు కూడా పాల్గొనేందుకు వీలుగా ఈ సమావేశాన్ని కేసీఆర్ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షనేత కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 21వ తేదీన తెలంగాణ భవన్ వేదికగా నిర్వహించే బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు పాల్గొననున్నారు.
జల వివాదాలు, ప్రజా ఉద్యమాలపై బీఆర్‌ఎస్ సమావేశం
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం తెలంగాణ భవన్‌లో ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుండి జరగనుంది. ఈ సమావేశం సందర్భంగా ప్రధానంగా కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి, గత పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిపై చర్చించనున్నారు. దానితోపాటు, ఆంధ్రప్రదేశ్ గోదావరి, కృష్ణా జలాలను కొల్లగొడుతున్నా, దానిని అడ్డుకునే విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే అంశంపై చర్చిస్తారు. తెలంగాణ ప్రజల, రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని పార్టీ భాస్తోంది. తదుపరి నిర్వహించబోయే తెలంగాణ ప్రజా ఉద్యమాలకు సంబంధించి ఈ విస్తృతస్థాయి సమావేశంలో చర్చించనున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేవలం 45 టీఎంసీలు ఇస్తే చాలని కేంద్రానికి చెప్పడం బాధాకరమని బీఆర్‌ఎస్ విమర్శిస్తోంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి 45 టీఎంసీలకు అంగీకరిస్తూ కేంద్రం వద్ద మోకరిల్లడం రాష్ట్ర రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేయడమేనని ఆరోపించింది. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ ప్రజలు, రైతాంగ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని విమర్శించారు. తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా ఒక్కరు కూడా దీనిపై మాట్లాడకపోవడం బాధాకరం అని, బీజేపీ పార్టీయే తెలంగాణ ప్రయోజనాలకు, రైతాంగ ప్రయోజనాలకు గండి కొడుతున్నదని బీఆర్‌ఎస్ పేర్కొంది.
ప్రత్యక్ష పోరాటాలకే కేసీఆర్ ప్రాధాన్యత
తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి విషయంలో కేంద్ర బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని గానీ, కావేరి తదితర నదుల అనుసంధానం పేరుతో ఆంధ్ర రాష్ట్ర జలదోపిడీకి సహకరిస్తున్న కేంద్ర బీజేపీ విధానాన్ని గానీ ఎదుర్కోవాలంటే, తెలంగాణ సమాజం మరొకసారి ప్రత్యక్ష పోరాటాలే మార్గమని కేసీఆర్ భావిస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వమే గనుక తిరిగి వచ్చి ఉంటే ఈపాటికి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నీళ్లు అందేవని, ఆ ప్రాంత ప్రజలు, రైతాంగ ప్రయోజనాలు కాపాడబడేవని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, పాలమూరు రంగారెడ్డి, నల్గొండ ప్రజల ప్రయోజనాల పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం వల్ల పూచిక పొల్లంత పని కూడా చేయలేకపోవడం వల్ల ఆ ప్రాంతం ప్రజలు, రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉద్యమానికి ప్లాన్ చేస్తున్న గులాబీ దళం
రెండేళ్లు గడిచినా తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంకా తెలంగాణ సమాజం మౌనం వహించదని బీఆర్‌ఎస్ పేర్కొంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు, కృష్ణా జలాలలో కేవలం 45 టీఎంసీలు ఒప్పుకోవడం అనేది ఘోరం, దుర్మార్గం అన్నారు. సాగునీరు, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడే విషయంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నటికీ రాజీ పడబోదని స్పష్టం చేసింది. ఈ సమయంలో పలు అంశాలను ఈ 21న నిర్వహించబోయే సంయుక్త సమావేశంలో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ నేతలు చర్చించనున్నారు. అందుకు అనుగుణంగా చేపట్టబోయే పోరాటం, నిరసన కార్యాచరణపై కీలక నిర్ణయాలు ఉంటాయి.






















