Telangana Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఆధిపత్యం.. 27 జిల్లాల్లో హస్తం, 3 జిల్లాల్లో BRS హవా
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండో దశలోనూ అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. రెండో విడతలోనూ కాంగ్రెస్ మద్దుతుదారుల అధిక స్థానాల్లో విజయం సాధించారు.

Telangana Panchayat Elections 2025 | హైదరాబాద్: తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగుతోంది. తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులే అత్యధిక స్థానాలు కైవసం చేసుకోగా, రెండో విడతలోనూ అదే సీన్ రిపీట్ అయింది. రెండో విడతలో మొత్తం 4,333 సర్పంచ్ స్థానాలలో కొన్ని ఏకగ్రీవం కాగా 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఆదివారం పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి విజేతల్ని ప్రకటిస్తూ వస్తున్నారు.
కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం
ఆదివారం అర్ధరాత్రి 12:30 గంటల వరకు వెలువడిన ఫలితాల చూస్తే, కాంగ్రెస్ బలపరిచిన సర్పంచి అభ్యర్థులు 2,297 (ఏకగ్రీవాలతో కలిపి) స్థానాల్లో విజయం సాధించారు. బీఆర్‌ఎస్ మద్దతుతో 1191 సర్పంచ్ స్థానాలు, బీజేపీ మద్దతుతో 257 స్థానాలు, ఇతరులు 578 స్థానాల్లో గెలుపొందారు. సీపీఐ మద్దతుదారులు 28 చోట్ల, సీపీఎం మద్దతుతో 33 మంది గెలుపొందారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశలో మొత్తం 4,333 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్ధానాలు, 38,350 వార్డు సభ్యుల పదవులకు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే, ఇందులో 415 గ్రామ సర్పంచ్, 8,307 వార్డు సభ్యుల పదవులు ఏకగ్రీవం అయ్యాయి. మరో ఐదు గ్రామాలు, 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు, ఇంకో 2 గ్రామాలు, 18 వార్డుల్లో ఎన్నికలను నిలిపివేశారు. మిగిలిన 3,911 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరిగింది. రెండో విడతలో 85.86 శాతం ఓటింగ్ నమోదైంది. తొలి విడత 84.28 శాతం కంటే 1.58 శాతం ఎక్కువ పోలింగ్ నమోదైంది. మొత్తం 57,22,465 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రక్రియలో 4,593 మంది రిటర్నింగ్ అధికారులు, 30,661 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు.
27 జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం..
నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్, హనుమకొండ, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, గద్వాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు.
3 జిల్లాల్లో బీఆర్ఎస్, ఒక జిల్లాలో బీజేపీ..
కుమురంభీం, సిద్దిపేట, జనగామలలో బీఆర్ఎస్ మద్దతుదారులు అధిక స్థానాల్లో గెలుపొందారు. బీజేపీ మద్దతుదారులు నిర్మల్ జిల్లాలో మెజారిటీ స్థానాలు సాధించారు. ఆదిలాబాద్‌లోనూ రెండో స్థానంలో నిలిచారు.
ఈ దశలో పలువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వనపర్తి మండలం మెంటెపల్లిలో 104 ఏళ్ల మాణిక్యమ్మ వీల్ చైర్‌లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిర్మల్ జిల్లాలో ఓచోట రష్యా నుంచి వచ్చి యువతి ఓటు వేశారు. సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లికి చెందిన మైసాని నర్సింలు తనకు చూపు లేకపోవడంతో భార్య సాయంతో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. భర్త కోసం ఓటు వేసిన మల్లవ్వ రెండో చేతి వేలికి సైతం అధికారులు సిరా వేశారు.
తొలి విడత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా..
తెలంగాణలో డిసెంబర్ 11న జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులు 2,425 మంది గెలుపొందగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ మద్దతుదారులు 1,68 మంది, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 189 మంది సర్పంచులుగా గెలుపొందారు. ఇతరులు 448 మంది సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించడం తెలిసిందే.






















