Telangana Panchayat Elections: ముగిసిన రెండో విడత పంచాయతీ ఎన్నికలు.. పలుచోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ
తెలంగాణలో ఆదివారం ఉదయం ప్రారంభమైన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారికి అధికారులు ఓటు అవకాశం కల్పించారు.

హైదరాబాద్: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. ఆ సమయంలోపు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారికి ఓటు హక్కు అవకాశం కల్పించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండో దశలో 193 మండలాల పరిధిలోని 3,911 గ్రామ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు పోలింగ్ జరిగింది.
ఈ దశలో మొత్తం 57,22,465 మంది ఓటర్ల కోసం 38,337 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సర్పంచ్ పదవుల కోసం 12,782 మంది అభ్యర్థులు, వార్డు సభ్యుల స్థానాల కోసం 71,071 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. ఓట్ల లెక్కింపు పూర్తయితే సర్పంచులు, వార్డ్ మెంబర్స్ ఫలితాలను ఎన్నికల అధకారులు ప్రకటించనున్నారు.

ఓటు వేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు..
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల మండలం గొల్లపల్లిలో కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మంజుల దంపతులు దుబ్బాక మండలం పోతారంలో ఓటు వేశారు. అక్బర్‌పేట బొంపల్లి మండలం బొప్పాపూర్‌లో బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొత్తగూడెం- విద్యానగర్ పోలింగ్ బూత్‌లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, దమ్మపేట మండలం గండుగులపల్లిలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, నాగర్‌కర్నూల్ జిల్లా తూడుకుర్తి గ్రామంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే Dr. కూచుకుళ్ల, రాజేష్ రెడ్డి, సరిత దంపతులు, నల్లబెల్లి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
♦ రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది
— AIR News Hyderabad (@airnews_hyd) December 14, 2025
♦ ఇప్పటికే క్యూలైన్లలో ఉన్నవారు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు
♦ రెండో విడతలో 3,906 సర్పంచ్, 29,903 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి.#TelanganaPanchayatElections pic.twitter.com/X8elacb4QB
11 గంటల వరకు 56.71 శాతం ఓటింగ్
తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఉదయం 9 గంటల వరకు 22.54శాతం పోలింగ్ నమోదు కాగా, ఉదయం 11 గంటల వరకు 56.71 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాల వారీగా పోలింగ్ శాతాలను పరిశీలిస్తే.. ఆ సమయానికి ఖమ్మం జిల్లాలో 64.2 శాతం, సూర్యాపేటలో 60.07 శాతం, వరంగల్‌లో 59.31, మెదక్ జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 58.43 శాతం, సంగారెడ్డి జిల్లాలో 58.43 శాతం, భద్రాద్రి కొత్తగూడెంలో 57.57, యాదాద్రి భువనగిరిలో 56.51, రంగారెడ్డి జిల్లాలో 54.33 శాతం, హనుమకొండలో 54.11, వికారాబాద్ జిల్లాలో 52.35 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
సెల్ టవర్ ఎక్కిన సర్పంచి అభ్యర్థి భర్త
మెదక్ జిల్లా నార్సింగిలో సర్పంచ్ అభ్యర్థి భర్త సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశారు. నర్సంపల్లి పెద్దతండా పంచాయతీ సర్పంచ్ పదవికి శంకర్ నాయక్ భార్య పోటీ చేస్తున్నారు. అయితే ప్రత్యర్థులు ఓటుకు రూ.2 వేలు ఇచ్చి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు. గతంలో తాను సర్పంచ్ పదవికి పోటి చేసి ఓడిపోయానని, డబ్బులు పంచి ప్రత్యర్థులు ఎన్నికల్లో నెగ్గుతున్నారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలపడంతో కాసేపు గందరగోళం నెలకొంది.
నాగర్‌కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ బలపరిచిన సర్పంచి అభ్యర్థులు చంద్రకళ, సౌమ్య వర్గీయుల మధ్య వాగ్వవాదం జరిగి, ఘర్షణకు దారితీసింది. పరస్పరం దాడి చేసుకోవడంతో సర్పంచ్ అభ్యర్థులు ఇద్దరికి గాయాలుకాగా, వారిని జడ్చర్ల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని సమాచారం. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలకు సైతం స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు సర్దిచెప్పకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని తెలుస్తోంది.
ఖమ్మం జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి మృతి
పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సర్పంచ్ అభ్యర్థి మృతిచెందడంతో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో విషాదం నెలకొంది. అనాసాగర్‌లో సర్పంచ్ పదవికి దామాల నాగరాజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నాగరాజు ఒత్తిడికి లోనవడంతో శనివారం అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ నాగరాజు ఆదివారం ఉదయం మృతిచెందారని సమాచారం.
మెదక్ జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ..
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కోనాయిపల్లెలో పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ, కాంగ్రెస్ వర్గాలు వాగ్వాదానికి దిగగా.. ఇది ఘర్షణకు దారితీసింది. పోలీసులు వారిని చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది.
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లోనూ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇతర గ్రామాల వారు వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం తెలపడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది.






















