KCR వ్యూహాలు: BRS పునరుత్తేజానికి కీలక సమావేశం! కాంగ్రెస్ పై పోరాటానికి సిద్ధం, తానే రంగంలోకి దిగుతారా?
KCR: గులాబీ దళంలో జోష్ నింపేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. ఈ నెల 19న బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

KCR: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. బీఆర్‌ఎస్ పార్టీ కూడా మంచి పోటీ ఇచ్చింది. గ్రామాల్లో పట్టు కోల్పోలేదని రుజువైంది. బీజేపీ ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేసింది. ఇప్పుడు ఇదే జోష్‌ను జెడ్పీటీసీ ఎంపీటీసీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల వరకు తీసుకెళ్లేందుకు వ్యూహాలు రచించే పనిలో ఉన్నారు గులాబీ అధినేత. అందుకే పార్టీ ఎల్పీతోపాటు పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ 19న తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం భేటీ జరగనుంది. ఇందులో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
2023 నుంచి పడిపోతున్న పార్టీ గ్రాఫ్
2023 ఎన్నికల్లో పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తుందని గులాబీ దళం చాలా గట్టిగా ఆశలు పెట్టుకుంది. కానీ ప్రజలకు మాత్రం కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపారు. దీంతో బీఆర్‌ఎస్ వర్గాలు ఒక్కసారిగా ఢీలాపడిపోయాయి. దీనికి తోడు అప్పటి నుంచి కేసీఆర్ ఒకట్రెండు పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క భారీ రాజకీయ నిర్ణయాలు తీసుకోలేదు. అప్పుడప్పుడు నిరసనలకు పిలుపునిచ్చినా అవి అంతగా ప్రభావం చూపలేదు. కవిత తిరుగుబాటుతో పార్టీ మరింత పలుచనైంది. కేటీఆర్, హరీష్ ఇద్దరే పార్టీ కొందరు సీనియర్స్‌తో కలిసి వచ్చిన ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. పంచాయితీ ఎన్నికలు మినహా ఏ ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్ తమ స్థాయిలో రాణించలేకపోయింది.
పంచాయతీ ఎన్నికలతో కొత్త జోష్
బీఆర్‌ఎస్ పరిస్థితి చూసిన వారంతా బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని చూశారు. కానీ ఆ పార్టీ కూడా అంతర్గత కుమ్ములాటలతో రెండు అడుగులు ముందుగు ఆరు అడుగులు వెనక్కి వెళ్తోంది. దీంతో ప్రజల మనసు మారినట్టు కనిపిస్తోంది. అందుకే పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ తర్వాత స్థానం బీఆర్‌ఎస్‌కు కట్టబెట్టారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుస దెబ్బలతో చతికిలబడిన పార్టీకి ఈ ఫలితాలు కాస్త ఊరట ఇచ్చాయి. దీన్ని మరింత దూకుడుగా తీసుకెళ్లాలని పార్టీ అధినాయకత్వం వ్యూహాలు రచిస్తోంది.
మళ్లీ పోరాటాల బాట పట్టనున్న గులాబీ దళం
బీఆర్‌ఎస్ అంటే దూకుడు, పోరాట స్వభావం ఉన్న పార్టీ. అలాంటి పార్టీ ఇప్పుడు ఉన్న స్థితిని ఆ పార్టీ నాయకులు ఎవరూ జీర్ణించులేకపోతున్నారు. అందుకే దీన్ని మార్చాలని కేసీఆర్ యోచిస్తున్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 19 కీలక సమావేశం పెడుతున్నారు. ఇందులో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులను ఆహ్వనిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు నమ్మకం ఉంచి గెలిపించారని దాన్ని ముందుకు కొనసాగించాలని సూచించనున్నారు.
కొత్త జోష్ నింపేలా వ్యాహాలు
తెలంగాణ భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. ఇందులో భవిష్యత్‌లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలతోపాటు పోరాటాలపై కూడా ఫోకస్ చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించనున్నారు. ముఖ్యంగా తెలంగాణకు అన్యాయం చేసేలా పొరుగు రాష్ట్రాలు నీటిని తరలించుకుపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. ఇదే అంశంపై పోరాటాలు చేసేందుకు సిద్ధమవుతోంది. నీటి విషయంలో జరుగుతున్న అన్యాయం సహా కాంగ్రెస్ హామీలు ఇచ్చి ఎగ్గొట్టిన వాటిపై ఎక్కువ దృష్టి పెట్టనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికలతోపాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని ఆ ఎన్నికలకు కూడా సిద్ధపడాలని దిశానిర్దేశం చేయనున్నారు.
గులాబీ నేతలకు దిశానిర్దేశం చేయడమే కాకుండా తాను కూడా కొన్ని పోరాటాల్లో పాల్గొంటానని నేతలకు కేసీఆర్ చెప్పనున్నారు. ఇన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వానికి టైం ఇచ్చామని ఇప్పుడు తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చిందని అందుకే తానే క్షేత్రస్థాయిలోకి దిగబోతున్నట్టు కేసీఆర్ చెప్పనున్నారని తెలుస్తోంది.





















