Mani Sharma: సురేష్ కొండేటి సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ రీ రికార్డింగ్
Suresh Kondeti New Movie: జర్నలిస్ట్, మ్యాగజైన్ అధినేత నుంచి నిర్మాతగా, నటుడిగా, ఇప్పుడు హీరోగా మారిన వ్యక్తి సురేష్ కొండేటి. ఆయన కొత్త సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ రీ రికార్డింగ్ చేస్తున్నారు.
తెలుగు చిత్రసీమలో జర్నలిస్టుగా మొదలైన సురేష్ కొండేటి (Suresh Kondeti) జర్నీ, ఆ తర్వాత మ్యాగజైన్ అధినేతగా, నిర్మాతగా కొత్త మలుపు తీసుకుంది. ఆపై నటుడిగా మారారు. ఇప్పుడు హీరోగా సినిమా చేస్తన్నారు. ఆయన ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా 'అభిమాని' (Abhimani Movie). ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ (ఓ అభిమాని కోరిక)... అనేది ఉప శీర్షిక. భూలోకం, యమలోకం నేపథ్యంలో దర్శకుడు రాంబాబు దోమకొండ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎస్.కె రహ్మాన్, కంద సాంబశివ రావు నిర్మాతలు.
'అభిమాని' చిత్రానికి మణిశర్మ రీ రికార్డింగ్!
'అభిమాని'కి డ్రమ్స్ రాము పాటలు అందిస్తుండగా... మెలోడీ బ్రహ్మ మణిశర్మ (Mani Sharma) నేపథ్య సంగీతం అందిస్తుండటం విశేషం. ఇటీవల సినిమా రీ రికార్డింగ్ పనులు పూర్తి అయ్యాయని మకర సంక్రాంతి సందర్భంగా సురేష్ కొండేటి తెలిపారు. మణిశర్మతో కలిసి దిగిన ఫోటోలను ఆయన షేర్ చేశారు.
ఫిబ్రవరిలో 'అభిమాని' థియేట్రికల్ రిలీజ్!
Abhimani movie release date: ఫిబ్రవరిలో 'అభిమాని'ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు. నేపథ్య సంగీతం అందిస్తున్న సందర్భంగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ మాట్లాడుతూ... ''మంచి కంటెంట్, సోషల్ మెసేజ్ ఉన్న సినిమా 'అభిమాని'. కథలో అంశం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. దర్శకుడు దోమకొండ రాంబాబు తాను అనుకున్న కథను చక్కగా తెరకెక్కించారు. జర్నలిస్టుగా ఉన్నప్పటి నుంచి సురేష్ కొండేటి నాకు పరిచయం. ఈ సినిమాతో నటుడిగా పేరు తెచ్చుకుంటాడు. అందరూ ఈ సినిమాను హిట్ చేస్తారని ఆశిస్తున్నా'' అని చెప్పారు.
సురేష్ కొండేటి మాట్లాడుతూ... ''నాకు ఈ సంక్రాంతి ఎంతో ప్రత్యేకంగా. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు నేను ప్రధాన పాత్ర పోషించిన 'అభిమాని'కి నేపథ్య సంగీతం అందించారు. అందుకే పండక్కి మా సొంతూరు వెళ్లకుండా హైదరాబాద్ సిటీలో ఉన్నాను. మణిశర్మ గారి పేరే ఓ బ్రాండ్. ఆయన నేపథ్య సంగీతంతో హిట్ అయినవి ఎన్నో ఉన్నాయి. 'ఇంద్ర, చూడాలని వుంది', 'సమరసింహా రెడ్డి', 'నరసింహ నాయుడు', 'ఖుషి' సినిమాల్లో ఆయన నేపథ్య సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. అటువంటి మెలోడీ బ్రహ్మ నా సినిమాకు నేపథ్య సంగీతాన్ని ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన నేపథ్య సంగీతంతో సినిమా మంచి విజయాన్ని పొందుతుందని, నటుడిగా నేను నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లడానికి ఆ విజయం దోహదపడుతుందని భావిస్తున్నాను'' అని చెప్పారు.
''మా 'అభిమాని'కి ప్రాణం అయిన చివరి 20 నిమిషాలకు మణిశర్మ గారు తన నేపథ్య సంగీతంతో ప్రాణం పోశారు. ప్రధాన పాత్రలో సురేష్ కొండేటి, యముడిగా అజయ్ ఘోష్, నానమ్మగా అన్నపూర్ణమ్మ, చిత్రగుప్తునిగా ఎస్.కె రెహమాన్ నటించారు. జై క్రిష్, అక్సా ఖాన్ జంటగా కనిపించనున్నారు'' అని దర్శకుడు రాంబాబు చెప్పారు.