Srikakulam News: విద్యుత్ షాక్‌తో ప్రాణం పోయిందా? రియల్ ఎస్టేట్ మింగేసిందా? పలాసలో వ్యక్తి హత్యపై అనేక అనుమానాలు
Srikakulam Murder Case: పలాసలో ఓ వ్యక్తి హత్య కేసులో పోలీసులు ఇంత వరకు పురోగతి సాధించలేదు. ఇది అధికారి పార్టీకి చెందిన వ్యక్తిపై అనుమానాలు బలపడుతున్నాయి.

Srikakulam Crime News: అది ప్రమాదవశాత్తు జరిగిందని కొందరు అనుమానిస్తుంటే, పథకం ప్రకారమే హత్య చేసి దానిని ప్రమాదంగా చిత్రీకరించారని మృతుడి కుటుంబ సభ్యులతోపాటు ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. భూవివాదాలతో హత్య జరిగిందని, తరువాత విద్యుత్ హైటెన్షన్ వైర్లవద్ద మృతదేహాన్ని పడేసి ఉంటారని చెబుతున్నారు. ఇంతకీ అక్కడేం జరిగింది.
శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలోని చిన్ననీలావతి గ్రామంలో విద్యుత్ హైటెన్షన్ వైర్లు తగిలి కౌలు రైతు సంఘం నాయకుడు తెప్పల ఢిల్లీరావు సోమవారం రాత్రి మృత్యువాత పడ్డారు. మంగళవారం ఉదయం అతడి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సమయంలోనే ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తన భర్తను పథకం ప్రకారం హత్యచేశారని ఢిల్లీరావు భార్య కమల ఆరోపించారు. ఆమెకు మద్దతుగా ప్రజాసంఘాలు ఆందోళన చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
పూర్తిస్థాయిలో విచారణ జరిపి, వాస్తవాలు వెలికి తీస్తామని హామీ ఇచ్చారు పోలీసులు. ఢిల్లీరావుది అనుమానాదాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పంట పొలాల్లో అడవి పందుల కోసం విద్యుత్ హైటెన్షన్ వైర్లను పెడుతుంటారు. అయితే ఇప్పుడు పంటల సీజన్ కాదు. అయినా విద్యుత్ వైర్లు ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టారన్నది అర్థం కావడం లేదు. తన భర్తను హత్యచేసి విద్యుత్ వైర్ల దగ్గర పడేసి షాక్‌తో మృతి చెందినట్లు చిత్రీకరిస్తున్నారని కమల చెబుతున్నారు.
అన్ని వేళ్లూ ఆ వైద్యుడివైపే..
ఢిల్లీరావు మృతి వ్యవహారంలో అన్ని వేళ్లూ పట్టణానికి చెందిన ఓ వైద్యుడి వైపే చూపిస్తున్నాయి. ఆయన టీడీపీకి బలమైన మద్దతుదారుడు కావడంతో పోలీసులు కూడా గోప్యంగా విచారణ చేస్తున్నారు. సదరు వైద్యుడిని స్టేషన్‌కు పిలిచి మంగళవారం రాత్రి పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం టీడీపీ కీలక నాయకుడు రంగంలోకి దిగి స్టేషన్‌కు వెళ్లి ఆ వైద్యుడిని తన వెంట తీసుకువెళ్లిపోయారట.
ఆ వైద్యుడితో ఢిల్లీరావుకు భూ వివాదం నడుస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. మండలంలోని రామకృష్ణాపురం పరిధిలో కొంత భూమి ఉంది. అది తనకు సంబంధించినదని వైద్యుడు, తమదని స్థానికంగా ఉన్న కొందరు రైతులు కొన్నేళ్లుగా గొడవ పడుతున్నారు. ఆ భూమిని ఇటీవల రైతులు వేరే వ్యక్తులకు విక్రయించేందుకు ప్రయత్నించారు. ఇందులో ఢిల్లీరావు మధ్యవర్తిగా ఉన్నారు. పలుమార్లు మీటింగ్‌లు జరిగాయని అంటున్నారు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వివాదం కొనసాగుతోంది. ఇంతలో ఢిల్లీరావు మృతితో ఆ వైద్యుడిపై మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
గతంలోనూ బ్రాహ్మణతర్లలో చెరువు గట్టును ఈ వైద్యుడు కబ్జా చేశారు. గ్రామస్తులు ఆందోళన చేయడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. రామకృష్ణాపురంలో ఓ భూమి విషయంలో వైద్యుడు తప్పుడు పత్రాలు సృష్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనపై అనుమానాలు బలపడుతున్నాయి.
రియల్ మాఫియాకు అడ్డా..
నియోజకవర్గం రియల్ ఎస్టేట్ మాఫియాకు అడ్డాగా మారిపోయిందన్న విమర్శలున్నాయి. రియల్ ఎస్టేట్ తగాదాతోనే ఇటీవల టీడీపీ నాయకుడిని హత్య చేసేందుకు బిహార్‌కు చెందిన సుపారీ గ్యాంగ్ రంగంలోకి దిగింది. పోలీసుల అప్రమత్తతతో ఈ గ్యాంగ్ వారికి చిక్కింది. దీని వెనుక కూడా రియల్ ఎస్టేట్ తగాదాలే ఉన్నాయి. ఢిల్లీరావు హత్య వెనుక ఆ కోణమే ఉందన్న ప్రచారం సాగుతోంది.
దోషులను కఠినంగా శిక్షించాలని బుధవారం ప్రజాసంఘాలు పట్టణంలో ఆందోళనకు పిలుపునిచ్చాయి. పోలీసుల అనుమతి లేకపోవడం, టీడీపీ కీలక నాయకులు తెర వెనుక మంత్రాంగం నడపడంతో ఆందోళన తాత్కాలికంగా వాయిదా పడింది. మొత్తానికి రియల్ ఎస్టేట్ మాఫియా జడలు విప్పుతుండడంతో నియోజకవర్గంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
Also Read: శ్రీకాకుళంలో క్రైమ్‌థ్రిల్లర్- తాళం వేసిన ఇంట్లో మహిళను హత్య చేసిందెవరు? పోలీసుల సీక్రెట్ విచారణ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

