Republic Day 2025 : ఈ ఏడాది 76వ రిపబ్లిక్ డేనా? లేక 77వ సెలబ్రేషనా? అసలు గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు చేసుకుంటామో తెలుసా?
Republic Day History : 2025లో మనం ఎన్నో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము? అసలు ఎందుకు రిపబ్లిక్ డే చేసుకుంటాము? దాని ప్రాముఖ్యత ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవే.

India Republic Day 2025 76th ot 77th : భారతదేశంలో 2025 సంవత్సరంలో గణతంత్ర దినోత్సవం 76వ సారి జరుపుకుంటున్నామా? 77వ సారి సెలబ్రేట్ చేసుకుంటున్నామా? ఈ విషయంలో మీకు కూడా డౌట్ ఉందా? ఈ ఏడాది మనం ఎన్నో రిపబ్లిక్ డే చేసుకుంటున్నాము? ఇంతకీ మీకు రిపబ్లిక్ డే చేసుకోవడం వెనుక కథ తెలుసా? గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యత ఏంటి? ఈ ఏడాది థీమ్.. వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
76? లేదా 77?
భారతదేశం తన రాజ్యాంగాన్ని అధికారికంగా జనవరి 26వ తేది 1950లో ఆమోదించింది. ఈ లెక్కను పరిగణలోకి తీసుకుంటే.. ఇండియా 2025లో 76వ రిపబ్లిక్ డేను సెలబ్రేట్ చేసుకోనుంది. ఈ ఏడాది జనవరి 26 ఆదివారం వచ్చింది. ఈ నేపథ్యంలో వేడుకలకు దేశమంతా ముస్తాబవుతుంది. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. 2026లో మనం 77వ గణతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోనున్నాము.
గణతంత్ర దినోత్సవం 2025 థీమ్
ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా గణతంత్ర దినోత్సవానికి ఓ థీమ్ తీసుకొచ్చారు. స్వర్ణమ్ భారత్ - విరాసత్ ఔర్ వికాస్. అంటే బంగారు భారతదేశం - వారసత్వం, అభివృద్ధిని ఇది సూచిస్తుంది. భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి, పురోగతికి ఇది ప్రతీకగా నిలుస్తుంది.
గణతంత్ర దినోత్సవం చరిత్ర ఇదే
రిపబ్లిక్ డేను ఎందుకు చేసుకుంటామో.. దాని వెనుక ఉన్న కథ ఏంటో ఎక్కువమందికి తెలీదు. అయితే గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో ఇప్పుడు చూద్దాం. ఇండియాకు ఆగష్టు 15వ తేదీన 1947లో స్వాతంత్ర్యం వచ్చింది. కానీ జనవరి 26, 1950 వరకు సొంత రాజ్యాంగాన్ని కలిగి లేదు. ఈ నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ సభ ద్వారా రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇది భారత ప్రభుత్వ చట్టాన్ని భర్తీ చేసింది. కమిటీ నవంబర్ 4, 1948లో రాజ్యాంగ సభలో రాజ్యాంగం తుది ముసాయిదాను ప్రవేశపెట్టింది. కొన్ని నెలల తర్వాత జనవరి 26, 1950వ తేదీన ఆమోదం లభించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఇండియాలో రిపబ్లిక్ డేను జరుపుతున్నారు.
రిపబ్లిక్ డే ప్రాముఖ్యత ఇదే
గణతంత్ర దినోత్సవం రాజ్యాంగ విలువలను హైలైట్ చేస్తుంది. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై ఫోకస్ చేస్తుంది. ప్రజల్లో ఐక్యతను హైలైట్ చేస్తుంది.
భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన వేడుకగా కూడా గణతంత్ర దినోత్సవాన్ని చెపొచ్చు. భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించడం.. భారతదేశ బలాన్ని ప్రపంచానికి చూపించడమే దీని ముఖ్య లక్ష్యం. రిపబ్లిక్ డేని సాధించడంలో సహాయపడిన ప్రతి స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తించి.. వారికి నివాళులు అర్పిస్తూ అందరూ వారిని గౌరవించాలి.
Also Read : స్టూడెంట్స్ రిపబ్లిక్ డే స్పీచ్.. భయం లేకుండా ఇలా చెప్పేయండి






















