Smartphones: వార్నీ, ఇండియన్ స్మార్ట్‌ఫోన్‌లు ఆ రేంజ్‌కు ఎదిగాయా?- టాప్-2 ర్యాంక్ వాటిదే
Commerce Ministry: ఫైనాన్షియల్ ఇయర్ 2018-19లోని $1.6 బిలియన్ డాలర్ల విలువ నుంచి, 2024 నవంబర్ నాటికి 13.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Top Exports From India: మన దేశంలో కోట్లాది మంది దగ్గర స్మార్ట్ ఫోన్‌లు ఉన్నాయి. జనాభాపరంగా అతి పెద్ద దేశం కావడంతో, ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్లలోనూ మనకు అగ్రతాంబూలం దక్కుతోంది. ఆపిల్ సహా ప్రముఖ బ్రాండ్లు వాటి ఉత్పత్తులను మన దేశంలో అమ్మడమే కాదు, ఇక్కడే తయారీ యూనిట్లను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఆ విధంగా, ప్రపంచ స్మార్ట్ ఫోన్ తయారీ కేంద్రం (Global smartphone manufacturing hub)గా భారత్ క్రమంగా అవతరిస్తోంది, మన పొరుగు దేశం చైనా ఆధిపత్యానికి గండి కొడుతోంది.
మన దేశంలో స్మార్ట్‌ఫోన్లను తయారు చేయడంలోనే (Smartphone assembling) కాదు, స్మార్ట్‌ఫోన్ల ఎగుమతుల (Smartphone Exports) విషయంలోనూ భారత్ ఒక్కో మెట్టు ఎక్కుతోంది. ఇప్పుడు, భారతదేశం నుంచి అత్యధికంగా ఎగుమతి అవుతున్న ఉత్పత్తుల్లో రెండో స్థానంలోకి స్మార్ట్ ఫోన్‌లు చేరాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ (Commerce Ministry) గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. అంతేకాదు, భారత్ నుంచి ఎగుమతి అవుతున్న స్మార్ట్ ఫోన్లలో మూడింట రెండు వంతుల వాటా ఆపిల్ ఐఫోన్లవే (Apple iPhones Exports Form India).
డీజిల్ ఇంధన ఎగుమతులది తొలి స్థానం
అంతర్జాతీయ వాణిజ్య వర్గీకరణ కోసం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉపయోగించే 'హార్మోనైజ్డ్ సిస్టమ్' కోడ్ (HS Code) డేటా ప్రకారం, స్మార్ట్‌ఫోన్‌లు భారతదేశంలో రెండో అతి పెద్ద ఎగుమతి వర్గం. ఆటోమోటివ్ డీజిల్ ఇంధనం ఎగుమతి మొదటి స్థానంలో ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ మధ్యకాలంలో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 13.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా చూపుతోంది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది 8.9 బిలియన్ డాలర్లుగా ఉంది, ఏడాది కాలంలో ఈ విలువ 50 శాతానికి పైగా పెరిగింది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో, భారతదేశం నుంచి జరిగిన ఎగుమతుల్లో స్మార్ట్‌ఫోన్‌లు నాలుగో స్థానంలో ఉన్నాయి. ఏడాది తిరక్కుండానే అవి రెండో స్థానానికి ఎదిగాయి.
PLI పథకం దన్నుతో దూసుకుపోతున్న ఆపిల్
భారతదేశం నుంచి జరుగుతున్న స్మార్ట్‌ఫోన్ ఎగుమతులలో ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ (iPhone) ప్రధాన పాత్ర పోషిస్తోంది. భారత ప్రభుత్వ PLI స్కీమ్ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం)ను ఆపిల్ చక్కగా ఉపయోగించుకుంటోంది.
వాస్తవం ఏంటంటే, 2018-19 ఆర్థిక సంవత్సరంలో, మన దేశంలో నుంచి కేవలం 1.6 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే ఎగుమతి అయ్యాయి. HS కోడ్ విభాగంలో దేశం నుంచి ఎగుమతి అయిన ఉత్పత్తులలో ఇవి 23వ స్థానంలో నిలిచాయి. దీనికి రెండు సంవత్సరాల తరువాత, భారత ప్రభుత్వం PLI పథకాన్ని లాంచ్ చేసింది. అక్కడి నుంచి స్మార్ట్ ఫోన్ రంగం దశ మారింది. ఆపిల్‌తో ఒప్పందం చేసుకుని ఐఫోన్‌లను అసెంబుల్ చేస్తున్న ఫాక్స్‌కాన్, పెగాట్రాన్, విస్ట్రాన్ వంటి గ్లోబల్ కంపెనీలు మన దేశంలోకి ప్రవేశించడానికి మార్గం సుగమం అయింది. ఈ కంపెనీలన్నీ భారత్‌లో ప్లాంట్‌లు ఏర్పాటు చేసి ఐఫోన్లను తయారు చేస్తున్నాయి. సామ్‌సంగ్ (Samsung) కూడా మన దేశం నుంచి తన స్మార్ట్‌ఫోన్‌ల ఎగుమతులను పెంచింది.
మరో ఆసక్తికర కథనం: ఆస్తి తనఖా పెట్టి లోన్ తీసుకుంటున్నారా? - ఈ విషయాలు తెలీకపోతే నష్టపోతారు!





















