Disha Patani: 'కంగువా' హీరోయిన్ దిశా పటాని తండ్రిని బురిడీ కొట్టించిన కేటుగాళ్లు - 25 లక్షలు పోవడంతో పోలీస్ కేస్ పెట్టిన జగదీష్
Disha Patani Father Police Case: బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని తండ్రి జగదీష్ పటాని తాజాగా కేటుగాళ్ల చేతిలో మోసోపోయారు. దాంతో ఆయన పోలీసుల్ని ఆశ్రయించారు. ఇప్పుడీ కేస్ వైరల్ అవుతోంది.
బాలీవుడ్ బ్యూటీ, 'కంగువా'తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోయిన్ దిశా పటాని (Disha Patani) తండ్రి, రిటైర్డ్ పోలీస్ అధికారి జగదీష్ పటాని కొంత మంది కేటుగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయారు అన్న వార్త తాజాగా బయటకొచ్చింది. ప్రభుత్వ కమిషన్‌లో ఉన్నత పదవిని ఇప్పిస్తామని హామీ ఇచ్చి, ఐదుగురు వ్యక్తులు అతన్ని మోసం చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేటుగాళ్లు ఆయన దగ్గర నుంచి రూ. 25 లక్షలు తీసుకుని, ఆయనకు టోపీ పెట్టినట్టు సమాచారం అందుతోంది. ఈ మోసంపై దిశా తండ్రి జగదీష్ పటాని శుక్రవారం సాయంత్రం బరేలీ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీంతో పోలీసులు ఇప్పుడు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ప్రభుత్వ కమిషన్‌లో పోస్ట్ ఆశ చూపించి...
జగదీష్ నుంచి రూ. 25 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు!
ఈ చీటింగ్ విషయంపై కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ డికె శర్మ మాట్లాడుతూ "శివేంద్ర ప్రతాప్ సింగ్, దివాకర్ గార్గ్, ఆచార్య జైప్రకాష్, ప్రీతి గార్గ్, మరో గుర్తు తెలియని వ్యక్తిపై చీటింగ్, క్రిమినల్, బెదిరింపు, దోపిడీ కేసులు నమోదు చేశాం. నిందితులను పట్టుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. ఈ కేసులో కఠిన చర్యలు తీసుకుంటాం" అని తెలిపారు. దిశా పటాని తండ్రి జగదీష్ పటాని తన కుటుంబంతో బరేలీలోని సివిల్ లైన్స్‌లో నివసిస్తున్నారు. జగదీష్ పటాని రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. నిందితుడు శివేంద్ర ప్రతాప్ సింగ్ తనకు వ్యక్తిగతంగా తెలుసు అని ఆయన ఫిర్యాదులో రాసినట్టు తెలుస్తోంది. దివాకర్ గార్గ్, ఆచార్య జై ప్రకాష్‌లకు తనను పరిచయం చేసింది శివేంద్రే అని జగదీష్ కంప్లయింట్ లో పేర్కొన్నారు.
నిందితులలో ఒకరైన హిమాన్షును 'ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ'గా పరిచయం చేశారని, తనకు రాజకీయ నాయకులతో బలమైన సంబంధాలు ఉన్నాయని నిందితుడు పేర్కొన్నాడని ఫిర్యాదులో జగదీష్ వెల్లడించారు. ప్రభుత్వ కమిషన్‌లో ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ లేదా ఓ ముఖ్యమైన పదవిని ఇప్పిస్తామని జగదీష్ పటానికి మాటిచ్చారట. తెలిసిన వాడే పరిచయం చేశాడు కాబట్టి, దిశా తండ్రి వారిని ఈజీగా నమ్మారట. తర్వాత ఐదుగురు వ్యక్తులు కలిసి అతన్ని నమ్మించి, జాబ్ ఇప్పిస్తామనే సాకుతో రూ.25 లక్షలు తీసుకున్నారని తెలుస్తోంది. అందులో రూ.5 లక్షలు నగదు, రూ.20 లక్షలు మూడు వేర్వేరు బ్యాంకు ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేశారట.
గత మూడు నెలలుగా ఈ విషయంలో ఎలాంటి ప్రోగ్రెస్ లేకపోవడంతో జగదీష్ పటాని వారిని ప్రశ్నించారట. దీంతో నిందితులు వడ్డీతో సహా తిరిగి ఇస్తామని హామీ ఇవ్వడంతో కొన్నాళ్ళు వెయిట్ చేశారట. అయితే జగదీష్ తన డబ్బు ఇవ్వమని మరోసారి అడగడంతో వారు అతనిని బెదిరించడం మొదలు పెట్టారట. తీరా ఇంత జరిగాక జగదీష్ పటాని తనను తప్పుదోవ పట్టించారని, మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారట. కాగా మరోవైపు దిశా పటాని వరుసగా పాన్ ఇండియా సినిమాలతో పలకరిస్తోంది. కొన్నాళ్ళ క్రితం 'కల్కి'లో రెబల్ స్టార్ ప్రభాస్ తో రొమాన్స్ చేసిన ఆమె, తాజాగా సూర్య హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ 'కంగువా'లో గ్లామరస్ రోల్ చేసి ఆకట్టుకుంది.
Also Read: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?