Life And Death Story: చనిపోయాడనుకుంటే చితిపై నుంచి లేచాడు - కొన్ని గంటల్లోనే మళ్లీ మృత్యుఒడికి, లైఫ్ అండ్ డెత్ స్టోరీ
Tragedy Incident: ఓ యువకుడు చనిపోయాడని వైద్యులు నిర్ధారించగా అంత్యక్రియల కోసం తీసుకెళ్తే చితిపై నుంచి లేచాడు. మళ్లీ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
Dead Man Wakes Up Before Cremation In Rajasthan: ఓ యువకుడు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో అంత్యక్రియలకు ఏర్పాటు చేయగా ఆ సమయంలో చితిపై నుంచి లేచి అందరికీ షాక్ ఇచ్చాడు. స్థానికులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ కొన్ని గంటల్లోనే మృత్యుఒడికి చేరుకున్నాడు. వైద్యుల నిర్లక్ష్యంతో ఆ యువకుడి జీవితంలో కొన్ని గంటలపాటు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన రాజస్థాన్‌లో సంచలనం కలిగించింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని (Rajasthan) ఝుంఝును ప్రాంతానికి చెందిన రోహితాష్ కుమార్ (25) బధిరుడు. నా అనుకునే కుటుంబీకులు ఎవరూ లేరు. స్థానికంగా ఓ పునరావాస కేంద్రంలో నివసిస్తున్నాడు. గురువారం అతను అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించిన స్థానికులు అతన్ని బీడీకే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మధ్యాహ్నం 2 గంటలకు అతను చనిపోయినట్లు ప్రకటించారు. అనంతరం మార్చురీకి తరలించి 2 గంటల పాటు అక్కడే ఉంచారు. పోలీసుల పంచనామా అనంతరం అతన్ని అంత్యక్రియల కోసం తరలించారు.
చితిపై నుంచి లేచాడు
చితిపై ఉంచిన కొద్దిసేపటికే రోహితాష్‌లో కదలికలు గుర్తించారు. వెంటనే అంబులెన్సును రప్పించి మళ్లీ బీడీకే ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చేర్పించారు. శుక్రవారం అతన్ని జైపుర్‌లోని ఎస్ఎంఎస్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్.. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు వైద్యులను సస్పెండ్ చేశారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.
చితిపై నుంచి లేచి నీళ్లు అడిగిన బామ్మ
అటు, ఇలాంటి ఘటనే తమిళనాడు తిరుచ్చిలోనూ 2 రోజుల క్రితం చోటు చేసుకుంది. అనారోగ్యంతో మృతి చెందిన ఓ వృద్ధురాలికి దహన సంస్కారాలు నిర్వహించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలోనే చితిపై నుంచి లేచిన బామ్మ నీళ్లు అడిగడంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు. వృద్ధురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుచ్చి జిల్లా మనప్పారై మరుంగాపురి సమీపంలోని కరుమలై సురంగంపట్టి గ్రామానికి చెందిన పంపైయ్యన్ (72), అతని భార్య చిన్నమ్మాల్ (62) దంపతులు. ఏం జరిగిందో తెలియదు కానీ ఈ నెల 16న చిన్నమ్మాల్ పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వృద్ధురాలిని ఇంటికి తీసుకెళ్తుండగా.. మార్గ మధ్యలోనే మృతి చెందింది.
దీంతో బంధువులు అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేశారు. శ్మశానంలో చితిపై వృద్ధురాలి మృతదేహాన్ని ఉంచి మరికాసేపట్లో దహనం చేయబోతారనగా.. ఉన్నట్లుండి ఆమెలో కదలిక వచ్చింది. అకస్మాత్తుగా కళ్లు తెరిచిన వృద్ధురాలు తనపై పడి ఏడుస్తున్న బంధువుల్లో ఒకరి చెయ్యి పట్టుకుని తనకు తాగడానికి నీళ్లు కావాలని అడిగింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే తేరుకుని అంబులెన్సులో ఆమెను ఆస్పత్రికి తరలించారు.