IPL 2024: దేశమంతా కొత్త వైరస్, పండగ చేసుకుంటున్న జియోసినిమా
IPL 2024: ఈసారి ప్రేక్షకుల ఉత్సాహాన్ని చూస్తుంటే, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా జియో సినిమా వసూళ్లు గతేడాది రికార్డును బద్ధలు కొడతాయని అంచనా.
Tata IPL 2024 Sponsors: భారత్ సహా చాలా దేశాలను ఇప్పుడు కొత్త వైరస్ చుట్టుముట్టింది. కోట్లాది మంది ఈ వైరస్‌తో వెర్రెత్తిపోతున్నారు. ఆ వైరస్ పేరు 'ఐపీఎల్ 2024'. ప్రపంచంలోని అతి ఖరీదైన క్రీడాపోటీల్లో ఒకటి ఇది. ఐపీఎల్ కొత్త సీజన్‌లో 10 క్రికెట్ జట్లు క్రీడా మైదానంలో యుద్ధానికి దిగుతుంటే; మైదానం నుంచి టీవీ స్క్రీన్ల వరకు చాలా కంపెనీలు ప్రకటనల పోటీలో ఉన్నాయి. పిట్ట, పిట్ట కొట్టుకుంటే పిల్లి లాభపడ్డట్లు, IPL లైవ్ స్ట్రీమింగ్ భాగస్వామి అయిన జియో సినిమా (Jiocinema) ఈ పోటీ నుంచి బాగా లాభపడుతోంది.
టాటా IPL టైటిల్ పార్టనర్
2024 ఐపీఎల్ సీజన్‌కు భారీ సంఖ్యలో స్పాన్సర్‌లు లభించినట్లు జియో సినిమా వెల్లడించింది. వందలాది కంపెనీలు ప్రకటనలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయట. జియో సినిమా ప్రకటన ప్రకారం, కొత్త IPL సీజన్‌లో (Tata IPL 2024) 18 మంది స్పాన్సర్‌లు, 250కు పైగా ప్రకటనల కంపెనీలు ఉన్నాయి. ఈ సీజన్‌కు టాటా గ్రూప్ టైటిల్ భాగస్వామిగా ఉంది.
మరో ఆసక్తికర కథనం: పిల్లల పథకం అమృత్‌బాల్ గురించి ఎందుకు తెలుసుకోవాలి, ఏంటి ప్రత్యేకత?
రికార్డ్ స్థాయి ఆదాయం అంచనా
గత ఐపీఎల్ సీజన్‌లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా జియో సినిమా రికార్డ్ స్థాయి ఆదాయాన్ని ఆర్జించింది. గత సంవత్సరం కూడా స్పాన్సర్‌లు, ప్రకటనల కంపెనీల నుంచి భారీ స్పందన లభించింది. ఈసారి ప్రేక్షకుల ఉత్సాహాన్ని చూస్తుంటే, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా జియో సినిమా వసూళ్లు గతేడాది రికార్డును బద్ధలు కొడతాయని అంచనా.
IPL 2024 స్పాన్సర్‌లు
జియో సినిమా ప్రకటన ప్రకారం.. స్పాన్సర్‌లు & ప్రకటనల కంపెనీల జాబితాలో ఆటోమొబైల్, మొబైల్ హ్యాండ్‌సెట్, బ్యాంకింగ్, ఆన్‌లైన్ బ్రోకింగ్ & ట్రేడింగ్, క్రెడిట్ కార్డ్ చెల్లింపులు సహా వివిధ రంగాల కంపెనీలు ఉన్నాయి. ఈ సీజన్‌లో జియో సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌లో డ్రీమ్ 11 కో-ప్రజెంటింగ్ పార్ట్‌నర్‌గా మారింది. టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పేజాప్, ఎస్‌బీఐ, క్రెడిట్, ఏఎమ్‌ఎఫ్‌ఐ, అప్‌స్టాక్స్, థమ్స్ అప్, బ్రిటానియా, పెప్సీ, పార్లే, గూగుల్ పిక్సెల్, హెయిర్, జిందాల్ స్టీల్, వొడాఫోన్, దాల్మియా సిమెంట్స్, కమలా పసంద్, రాపిడో కంపెనీలు అసోసియేట్ స్పాన్సర్‌లుగా ఉన్నాయి.
కంపెనీల మధ్య పోటీ ఇందుకే..
స్మార్ట్‌ఫోన్‌లు చేతిలో ఉండడం, ఇంటర్నెట్ సులభంగా లభించడంతో డిజిటల్ స్ట్రీమింగ్ పరిధి చాలా విస్త్రతంగా మారింది. సాంప్రదాయ టీవీతో పోలిస్తే డిజిటల్ మాధ్యమం ద్వారా IPL చూసే వారి సంఖ్య చాలా రెట్లు పెరిగింది. వీళ్లలో అధిక భాగం యువతే. ఐపీఎల్ వీక్షకుల సంఖ్య రికార్డ్ ఏటికేడు కొత్త రికార్డ్ నెలకొల్పుతోంది. కోట్లాది వ్యూయర్స్‌ను, ముఖ్యంగా యువతను దృష్టిలో ఉంచుకుని, డిజిటల్ బ్రాడ్‌కాస్టింగ్‌లో ప్రకటనలు ఇచ్చేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి.
మరో ఆసక్తికర కథనం: పోటీపోటీగా దిగొచ్చిన పసిడి, రజతం - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి