Manyam District: మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులకు తీవ్ర అస్వస్థత - ఆగ్రహంతో ఎంఈవో, హెచ్‌ఎంల నిర్బంధం
మన్యం జిల్లా మక్కువ మండలం కోన గ్రామ మండల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

కోన పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత
- ఎంఈవో, హెచ్‌ఎంలను నిర్బంధించిన పిల్లల తల్లిదండ్రులు
- ఉమ్మడి విజయనగరం జిల్లాలో వరుస ఘటనలు
విజయనగరం జిల్లా కొత్తవలస బీసీ వసతిగృహంలో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైన మరుసటి రోజే.. పార్వతీపురం మన్యం జిల్లాలో అదే తరహా ఘటన చోటుచేసుకుంది. మన్యం జిల్లా మక్కువ మండలం కోన గ్రామ మండల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పిల్లల తల్లిదండ్రులు ఎంఈవో, హెచ్‌ఎంలను నిర్బంధించారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో వారిని విడిచిపెట్టారు.
కోన ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం 144 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం వీరిలో 22 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఆరుగురు విద్యార్థులు వాంతులు, కడుపునొప్పితో బాధ పడ్డారు. విషయం తెలుసుకున్న మన్యం కలెక్టర్ నిశాంత్ కుమార్ తక్షణం స్పందించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బగాది జగన్నాథరావు, జిల్లా విద్యాశాఖ అధికారి పి.బ్రహ్మాజీరావు, తహశీల్దార్ లను హుటాహుటిన పాఠశాలకు వెళ్లాలని ఆదేశించారు. సమీప పీహెచ్‌సీల నుంచి వైద్యసిబ్బందిని, అంబులెన్స్‌లను పంపించారు. జిల్లా కలెక్టర్ స్వయంగా వైద్యులతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. విద్యార్థులు క్షేమంగా ఉన్నారని, ఎటువంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు.
కొత్తవలసలో ఇదే తరహా ఘటన..
విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రం బీసీ బాలికల వసతిగృహంలో మంగళవారం ఇదే తరహాలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం ఫలహారంగా పులిహోర తిని పాఠశాలకు బయల్దేరిన విద్యార్థులు మార్గమధ్యంలో వాంతులు, కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారు. దీంతో ఎనిమిది మంది విద్యార్థులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందజేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

