Sri Ramakrishna Teertham Mukkoti | ముక్కోటి తీర్థానికి వెళ్లి రావటం ఓ అనుభూతి | ABP Desm
తిరుమల అంటే చాలా మంది శ్రీవారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అయిపోతుంటారు. కానీ శేషాచలం అడవుల్లో పుణ్యతీర్థాలు అనేకం ఉంటాయి. వాటిలో ఒకటే శ్రీరామకృష్ణ తీర్థం. ఏటా మాఘ మాసంలో పౌర్ణమినాడు నిర్వహించే శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఓ అడ్వెంచరెస్ జర్నీ. తిరుమల కొండల్లో ప్రయాణం..కొండల అంచులు పట్టుకుని రాళ్లలో జాగ్రత్తగా దిగుతూ...చెక్కల వంతెనలపై నడుస్తూ రామకృష్ణతీర్థానికి చేరుకోవాల్సి ఉంటుంది. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రయాణంలో అనేక భక్తులు,స్థానికులు ఓ పెద్ద బృందంగా వెళ్తుంటారు. రామకృష్ణ మహర్షి తపోబలంతో ఏర్పడిన పుణ్యతీర్థమని పురాణాలు ప్రస్తావించే ఈ తీర్థంలో కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణభగవానుల విగ్రహాలకు పాలు, పెరుగు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకాలు నిర్వహిస్తారు. ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. రామకృష్ణ తీర్థానికి వెళ్లే భక్తులకు టీటీడీ పాపవినాశనం డ్యామ్ వద్ద పొంగలి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర పొట్లాలు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేస్తుంది.





















