AP Deputy CM Pawan kalyan in Kerala | కొచ్చి సమీపంలో అగస్త్యమహర్షి గుడిలో పవన్ కళ్యాణ్ | ABP Desam
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన దక్షిణ భారత దేవాలయాల సందర్శన యాత్రను ప్రారంభించారు. తన కుమారుడు అకీరానందన్ తో కలిసి ముందుగా కేరళలోని కొచ్చిన్ కు చేరుకున్న పవన్ కళ్యాణ్…అక్కడ అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించుకున్నారు. అకీరాతో కలిసి అగస్త్య మహర్షి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అగస్త్య మహర్షి ఆలయ చారిత్రక, పురాణ ప్రాశస్త్యాన్ని అర్చకులు పవన్ కళ్యాణ్ కు వివరించారు. పవన్ అకీరాతో పాటు టీటీడీ బోర్డు మెంబర్, పవన్ స్నేహితుడు ఆనంద్ సాయి కూడా ఉన్నారు. దక్షిణాది ధార్మిక యాత్ర కోసం మాలను ధరించిన పవన్ కళ్యాణ్...నాలుగు రోజుల పాటు కేరళ, తమిళనాడులోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోనున్నారు.ప్రత్యేక పూజలు అనంతరం అగస్త్య ఆశ్రమంలో ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే మూలికలు, మొక్కల గురించి ఆశ్రమ వైద్యులు విష్ణు యోగి, మణి యోగి పవన్ కళ్యాణ్ కు వివరించారు. అగస్త్య మహార్షి పురాణాల్లో, వేదాల్లో చెప్పినట్లుగా కీలకమైన మర్మ చికిత్సకు మూలికలు ఎలా ఉపయోగపడతాయి అన్నది కూడా ఉపముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. కలరిపయట్టు యుద్ధకళ గొప్పదనం గురించి, ఆశ్రమం ఆవరణలోనే ఉన్న శివలింగం ప్రాసస్త్యాన్ని కూడా పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. లింగ శక్తి, శ్రీ శక్తి గురించి వివరించే పటాలను, చిత్రాలను చూశారు.





















