Ind u19 vs Pak u19 highlights: ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. 90 పరుగులతో ఘన విజయం
భారత్ U19 జట్టు ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్ U19 ని 90 రన్స్ తేడాతో ఓడించింది. పాక్ జట్టు కేవలం 150 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియా ఘన విజయం సాధించింది.

India beats pakistan U19 Asia Cup 2025 | దుబాయ్: పాకిస్తాన్‌ను 90 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. పురుషుల అండర్-19 ఆసియా కప్ మ్యాచ్ దుబాయ్‌లో జరిగింది. ఇందులో ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 240 పరుగులు చేసింది. టార్గెట్ ఛేదించడానికి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ మొత్తం జట్టు 150 పరుగులకు ఆలౌట్ అయింది. 90 పరుగుల తేడాతో భారీ విజయంతో భారత్ దాదాపు సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. బౌలింగ్‌లో భారత్ తరఫున దీపేష్ దేవేంద్రన్ 3 వికెట్లు తీసి సత్తా చాటాడు.
ఆరోన్ జార్జ్ మెరుపులు
టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలన్న పాకిస్తాన్ నిర్ణయం ఆ జట్టుకే ప్రతికూలంగా మారింది. ఆరోన్ జార్జ్ 85 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ సహాయంతో భారత జట్టు 240 పరుగుల మోస్తరు స్కోరు నమోదు చేసింది. ఇండియా పూర్తి 50 ఓవర్లు ఆడలేకపోయింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 5 పరుగులు మాత్రమే చేయగా, కెప్టెన్ ఆయుష్ మాత్రే కూడా 38 పరుగులకు పెవిలియన్ చేరాడు. భారత్ సాధారణ స్కోరు చేసిందని, పాక్ ఈజీగా ఛేజ్ చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ బౌలింగ్ లోనూ భారత్ అదరగొట్టడంతో దాయాది పాక్‌కు అండర్ 19 దశలోనూ మరో ఓటమి తప్పలేదు.
పాక్ బ్యాటింగ్‌ను దెబ్బతీసిన దీపేశ్ దేవేంద్రన్
241 పరుగుల టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టుకు ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. బౌలర్ దీపేశ్ దేవేంద్రన్ పాకిస్తాన్ జట్టు టాప్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. పాకిస్తాన్ జట్టు 30 పరుగులు చేరుకోవడంలోపే 4 కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. పాకిస్తాన్ కెప్టెన్ ఫర్హాన్ యూసుఫ్ కొంతసేపు క్రీజులో నిలదొక్కుకున్నప్పటికీ, 23 పరుగులు చేసి ఔటయ్యాడు. హుజైఫా అషాన్ కలిసి కెప్టె్న్ ఫర్హాన్ యూసుఫ్ 47 పరుగులు జోడించాడు. అషాన్ 70 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడినా మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించకపోవడంతో తన జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. పాకిస్తాన్ జట్టు చివరి 4 వికెట్లను కేవలం 21 పరుగుల తేడాతో కోల్పోయింది.
బౌలింగ్‌లో దీపేశ్, కనిష్క్ అద్భుత ప్రదర్శన
భారత్ తరఫున దీపేశ్ దేవేంద్రన్ ఏడు ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. కనిష్క్ చౌహాన్ కూడా 3 వికెట్లు తీశాడు. చౌహన్ 10 ఓవర్లలో కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కిషన్ కుమార్ సింగ్ 2 వికెట్లు తీయగా, ఖిలన్ పటేల్, వైభవ్ సూర్యవంశీ తలో వికెట్ పడగొట్టారు.
సెమీస్‌లో భారత్ స్థానం దాదాపు ఖాయం
పురుషుల అండర్-19 ఆసియా కప్‌లో గ్రూప్-ఏ లో భారత్ ఆడిన రెండు మ్యాచుల్లో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఇండియా యూఏఈని 234 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఆ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 95 బంతుల్లోనే 171 పరుగులు చేయడం తెలిసిందే. గ్రూప్-ఏ లో పాకిస్తాన్ మరో విజయం సాధించినా లేదా మరేదైనా జట్టు 4 పాయింట్లకు చేరుకున్నా కూడా, భారత్ సాధించిన మెరుగైన నెట్ రన్ రేట్ (+3.240) ను దాటడ ఆ జట్లకు అంత తేలిక కాదు. కనుక భారత్ సెమీఫైనల్‌లో బెర్త్ దాదాపు ఖాయమైనట్లే. అండర్-19 ఆసియా కప్ లీగ్ దశలో భారత్ చివరి మ్యాచ్ మంగళవారం (డిసెంబర్ 16) నాడు మలేషియాతో జరగనుంది.





















