Modi Vizag Tour: విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
Modi tour In Vizag: ప్రధానమంత్రి మోదీ బుధవారం వైజాగ్‌లో పర్యటించి రైల్వే జోన్, గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. ఈ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కూడా పాల్గొంటారు.
Modi Tour In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం మోదీ పర్యటించనున్నారు. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. భారీగా భద్రతా బలగాలు మోహరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పోలీసులను బందోబస్తు కోసం రప్పించారు. ఒక రోజు పర్యటనలో ప్రధానమంత్రి మోదీ రెండు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఒకటి రైల్వే జోన్ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారు. రెండోది గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తారు. ఈ రెండు ప్రాజెక్టులతో ఉత్తరాంధ్ర దశ మారుతుందని మంత్రులు, కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు.
ముందే చేరుకోనున్న చంద్రబాబు, పవన్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ మరోసారి ఒకే వేదికపై కనిపించనున్నారు. విశాఖపట్నలోని ఆంధ్రాయూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో జరిగే భారీగ బహిరంగ సభలో ముగ్గురు పాల్గోనున్నారు. అంతకు ముందు భారీ రోడ్ షో కూడా చేపట్టనున్నారు. ముగ్గురు వీవీఐపీలు సభలో పాల్గొంటున్నందున ఈ సభా ప్రాంగణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి ఎన్‌ఎస్‌జీ తీసుకుంది. సభ జరగే ప్రాంతానికి దాదాపు రెండు కిలోమీటర్ల మేర పోలీసులు పహారా కాస్తున్నారు. వీఐపీ వాహనాలు తప్ప వేరే వాహనాలను అనుమతివ్వడం లేదు. ఆంధ్రాయూనివర్శిటీలో కూడా ఆంక్షలు విధించారు. సభ జరిగే పరిస ప్రాంతాల్‌లో నో డ్రోన్ ఫ్లై జోన్‌గా ప్రకటించారు.
ముగ్గురు నేతల షెడ్యూల్ ఇదే
మధ్యాహ్నం 1 గంటకే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైజాగ్ చేరుకుంటారు. ప్రధానమంత్రి మాత్రం సాయంత్రం 4.15 నిమిషాలకు చేరుకుంటారు. ఆయనకు ఐఎన్‌ఎస్ డేగాలో సీఎం, డిప్యూటీ సీఎం స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి సభా ప్రాంగణం వరకు ముగ్గురు నేతల రోడ్‌షో ఉంటుంది. ఈ రోడ్ షో సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమవుతుంది. దాదాపు 45 నిమిషాలపాటు రోడ్‌షో ఉంటుంది. అనంతరం ముగ్గురు నేతలు బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్ర 7.30కి సభ ముగుస్తుంది.
రెండు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన
ఈ టూర్‌లో మోదీ కీలకమైన 2 పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. రాష్ట్రానికి ఎప్పటి నుంచో కలగా ఉన్న విశాఖ రైల్వే జోన్. ఈ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. విభజన సమయంలో ప్రత్యేక జోన్ అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న దీని శంకుస్థాపన బుధవారం సాక్షాత్కారం కానుంది. గత ప్రభుత్వ హయంలో భూమి కేటాయించలేదన్న కారణంతో కార్యరూపం దాల్చలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భూమి కేటాయించడంతో శంకుస్థాపనకు దారి దొరికింది.
విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయి: అచ్చెన్న
ప్రధానమంత్రి శంకుస్థాపన చేసే రెండో ప్రాజెక్టు గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్రాజెక్టు. ఇది ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యంగా ఉత్తరాంధ్రకు గేమ్ ఛేంజర్ కాబోతోందని మంత్రి అచ్చెన్న అభిప్రాయపడ్డారు. మోదీ పర్యటన ఏర్పాట్లను ప్రత్యక్షంగా చూసిన ఆయన కొన్ని సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు దూర దృష్టితో తీసుకున్న నిర్ణయాలు ఏపీని ఆర్థికంగా గట్టెక్కిస్తున్నాయి అన్నారు. మొన్నటి వరకు ఐసీయూలో ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సొంతగా ఆక్సిజన్ పీల్చుకునే స్థితికి వచ్చిందన్నారు. ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల రూపంలో కేంద్రం ఉధారత చూపిస్తోందన్నారు. టీడీపీ ఎన్డీలో భాగమైనందునే ఇవన్నీ సాధ్యమవుతున్నాయని అన్నారు. ఇప్పుడు శంకుస్థాపన జరుపుకొనే ప్రాజెక్టు కూడా అలాంటిదేనన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి విడతలో అరవై వేల కోట్ల పెట్టబడులు రాబోతున్నాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కారణందా విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గబోతున్నాయని తెలిపారు.
ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాల వల్ల తగ్గే అవకాశం ఉందన్నారు. గత పాలకుల హయాంలో చేపట్టిన అడ్డగోల విధానాలతో విద్యుత్ ఉత్పత్తి, సరఫరాపై పెను భారం పడిందన్నారు. మొన్నటి ఛార్జీల పెంపు పాపం వారిదేనన్నారు. ఇకపై ఇలాంటి ఇబ్బంది ఉండదని అభిప్రాయపడ్డారు. మోదీ ప్రారంభించబోయే గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్రాజెక్టు ఎన్టీపీసీ, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.
లక్షకుపైగా ఉద్యోగాలు
గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్రాజెక్టు పూర్తి అంచనాలు 1.87 లక్షల కోట్లు ముందుగా మొదటి విడతలో 60,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నారు. రోజుకు 1100 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో చేపట్టే ఈ ప్రాజెక్టు 2027 మే నెలకు పూర్తి కానుంది. ఈ ప్రాజెక్టుతో విద్యుత్ ఛార్జీలు తగ్గడమే కాకుండా దాదాపు లక్షకుపైగా ఉద్యోగాలు రానున్నాయి.
స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన
ప్రదాన మంత్రి మోదీ పర్యటన ఏర్పాట్లను బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురందేశ్వరి కూడా పరిశీలించారు. అక్కడే మీడియా మాట్లాడిన ఆమె... విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం మంచి ప్యాకేజీ ప్రకటించబోతున్నట్టు వెల్లడించారు. కీలకమైన ప్రాజెక్టుల శంకుస్థాపనకు తొలిసారి విశాఖ వస్తున్న మోదీకి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమైనట్టు పేర్కొన్నారు.