Love Marriage: పోలీసుల అదుపులో విజయవాడ ప్రేమ జంట, రక్షణ కల్పించాలని వేడుకున్న నవ దంపతులు
Vijayawada Love Affair | విజయవాడకు చెందిన యువతి ఇంట్లో నుంచి వెళ్లిపోయి, తాను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే యువతి తల్లిదండ్రులు కుమార్తె మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
Newly married couple in custody of Tiruchanur police | తిరుపతి: ఓ ప్రేమ వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరింది. దశాబ్దం పైగా ప్రేమించుకున్న అనంతరం పెళ్లితో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కానీ అమ్మాయి తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని కొత్త జంట పోలీసులను కోరుతోంది. విజయవాడ కు చెందిన ప్రేమ జంట (నవ దంపతులు) తిరుచానూరు పోలీసుల అదుపులో ఉన్నారు.
అసలేం జరిగిందంటే..
విజయవాడకు చెందిన శివ (33), అలేఖ్య(26) గత 11 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తల్లిదండ్రులు వీరి ప్రేమను అంగీకరించలేదు. దాంతో పెళ్లి చేసుకోవాలని శివ, అలేఖ్య ఇంటి నుంచి పారిపోయారు. ఈ క్రమంలో ఆగస్టు 15న వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. అదే సమయంలో తమ కుమార్తె అలేఖ్య కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు విజయవాడ భవాని పురం పి.ఎస్ లో ఫిర్యాదు చేశారు.
యువతి అలేఖ్య మాట్లాడుతూ.. తనకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూశారు. ఆ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా, తనను ప్రేమించిన వ్యక్తి కోసం ఇంటి కోసం వెళ్లిపోయినట్లు తెలిపింది. తను, శివ 11 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు తెలిపింది. వేరే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆగస్టు 15న ఇంటి నుంచి ఇద్దరూ వెళ్లిపోయి ఓ గుడిలో పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించారు. నా తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీసులు మమ్మల్ని అదుపులోకి తీసుకున్నారు.
నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు..
తనను ఎవరూ కిడ్నాప్ చేసి తీసుకెళ్లలేదని అలేఖ్య స్పష్టం చేసింది. ఈ ప్రేమ జంట ఓ వీడియో విడుదల చేసింది. తనను ఎవరూ ఒత్తిడి చేయలేదని, ఇష్టపూర్వకంగా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు అలేఖ్య తెలిపింది. చాలా ఏళ్ల నుంచి శివ, తాను ప్రేమించుకున్నట్లు చెప్పింది. ఇద్దరం మేజర్లు కావడంతో ఇష్టంతోనే పెళ్ళి చేసుకున్నాం, కానీ తన తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదని పేర్కొంది. తన తల్లి దండ్రులు నుంచి ఇద్దరికీ ప్రాణహాని ఉందని, తిరుచానూరు పోలీసులు రక్షణ కల్పించాలని కోరింది.
ఒకవేళ తన తల్లిదండ్రులు విజయవాడ నుంచి ఇక్కడికి వస్తే.. రక్షణ కల్పించి వారితో పంపించాలని అలేఖ్య కోరింది. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, లెటర్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పింది. పోలీసుల రక్షణ లేకుండా తల్లిదండ్రులతో పంపించకూడదని, తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన చెందుతున్నారు. తన తల్లిదండ్రులు, బంధువుల మాటలు విని.. తమను ఏమైనా చేస్తారేమోనని ఆవేదన వ్యక్తం చేసింది.
సునీల్ కుమార్, తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ మాట్లాడుతూ.. విజయవాడ భవానీ పురం పోలీస్ స్టేషన్ లో అలేఖ్య మిస్సింగ్ అని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. భవానీపురం పోలీసుల ఇక్కడికి వచ్చి కేసు వివరాలు అందిస్తే వాళ్లకు ప్రేమ జంటను అప్పగిస్తామని స్పష్టం చేశారు. పోలీసుల రక్షణ లేకుండా, నేరుగా తన తల్లిదండ్రుల వెంట వెళ్లేందుకు అలేఖ్య సిద్ధంగా లేదు. ఆమె భర్త సైతం తన అత్తామామల నుంచి తమకు ప్రాణహాని ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని కోరాడు.