Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
AP Pensions: భర్త చనిపోయిన మరుసటి నెలలోనే భార్యకు వితంతు పెన్షన్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అధికారులు వారికి పెన్షన్ అందించేలా చర్యలు చేపట్టారు.
AP Government Granted Pension To Widows: పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే ఆ మరుసటి నెలలోనే భార్యకు వితంతు పింఛన్ మంజూరు చేయాలన్న సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆదేశాలతో అధికారులు వారికి పెన్షన్లు మంజూరు చేశారు. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ నెల 15 మధ్య వితంతువులుగా మారిన 5,402 మందికి స్పౌజ్ కేటగిరీలో పెన్షన్ మంజూరు చేశారు. ఈ నెల 31న వీరికి రూ.4 వేల చొప్పున ప్రభుత్వం పింఛన్ అందించనుంది. వీరితో పాటు గత 3 నెలలుగా పింఛన్ తీసుకోలేని 50 వేల మందికి కూడా సర్కారు పెన్షన్ అందించనుంది. కాగా, నవంబరులో శ్రీకాకుళం జిల్లాలో పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు వితంతు పెన్షన్లపై కీలక ఆదేశాలిచ్చారు. అయితే, గతంలో పింఛన్ తీసుకునే భర్త చనిపోతే భార్యకు పెన్షన్ అందించేవారు. అప్లై చేసుకున్న ఆరేడు నెలలకు పెన్షన్ మంజూరయ్యేది. అలా కాకుండా ఆ తర్వాతి నెలలోనే వారికి పెన్షన్ అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఒకరోజు ముందుగానే..
కాగా, ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్లు పంపిణీ చేస్తుండగా.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారులకు పింఛన్ అందిస్తారు. ఈసారి ఒకటో తేదీన సెలవు రోజు కావడంతో ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ 31వ తేదీనే పెన్షన్ అందించనున్నారు. ఏదైనా సాంకేతిక కారణాలతో పెన్షన్ అందుకోలేకపోయిన వారికి ఆ మరుసటి రోజు పింఛన్ అందిస్తారు.
ఆ పెన్షన్లు ఏరివేత
మరోవైపు, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలామంది అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారంటూ ఆరోపణలు వచ్చిన క్రమంలో కూటమి ప్రభుత్వం అనర్హులకు పెన్షన్ల ఏరివేత కార్యక్రమం చేపట్టింది. అసలైన లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్లు అందిస్తామని ఇటీవల సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా జనవరి 3 నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అర్హత లేకపోయినా పింఛన్ తీసుకుంటున్న వారిపై ఫోకస్ పెట్టింది. సర్వే చేసి అనర్హులను ఏరివేయనుంది.
Also Read: Srikakulam News: వంశధార నిర్వాసితుల చూపు కూటమి ప్రభుత్వం వైపు- న్యాయం చేయాలని అభ్యర్థన
190 కొత్త 108 వాహనాలు..
రాష్ట్రంలో 190 కొత్త 108 వాహనాల కొనుగోలుకు ఏపీ ప్రభుత్వం (AP Government) నిర్ణయం తీసుకుంది. శనివారం వైద్యారోగ్యశాఖపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) నిర్వహించిన సమీక్షలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఇకపై 104, 108 సేవలకు సింగిల్ సర్వీస్ ప్రొవైడర్ ఉండనుంది. 108 అంబులెన్స్ సిబ్బంది, డ్రైవర్లకు ఇకపై అదనంగా రూ.4 వేలు ఇవ్వనున్నారు. అందుబాటులోకి కొత్తగా 58 మహాప్రస్థానం వాహనాలు రానున్నాయి. ప్రతి మండలంలోనూ జనఔషధి స్టోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రివెంటివ్ హెల్త్ కేర్‌కు ప్రాధాన్యం ఇచ్చేలా వైద్య శాఖ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం నిర్ధేశించారు. వైద్య శాఖలో పెండింగ్ సమస్యలు, తీసుకురానున్న సంస్కరణలపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి సత్యకుమార్‌తో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.