KCR Latest News: రెండు జాతీయ పార్టీలను ఒకేసారి మడతెట్టేలా కేసీఆర్ స్కెచ్- ఈసారి చంద్రుడి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా!
KCR Latest News: తెలంగాణలో బలపడేందుకు సెంటిమెంట్ అస్త్రాన్ని కేసీఆర్ బయటకు తీశారు. మళ్లీ చంద్రబాబును మధ్యలో పెట్టి రెండు జాతీయ పార్టీలను కొట్టాలని చూస్తున్నారు.

KCR Comments On Chandra Babu: రాజకీయాల్లో నేతల ప్రతీ మాటకు ఓ లెక్క ఉంటుంది. కొద్ది మంది తమ మాటల ద్వారా ప్రజల్ని తమ వైపు తిప్పుకుంటారు. మరి కొద్ది మంది నేతలు తమ మాటల ద్వారా ప్రత్యర్థి నేతలను, పార్టీలను ఢిపెన్స్‌లోకి నెడతారు. మరి కొద్ది మంది నేతలు మాట జారి వివాదస్పదమై సెల్ఫ్ డిఫెన్స్‌లోకి జారుకుంటారు. అలాంటి వ్యాఖ్యలతో పార్టీకి, ప్రజలకు ఓ సంకేతాన్ని పంపుతారు ఇంకొందరు. ఇదంతా ఎందుకంటే రాజకీయ నేతలకు ప్రధాన ఆయుధం వారి మాటలే. బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చాంశనీయమయ్యాయి.
ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు అని కేసీఆర్ వాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కాకతాళీయంగా చేసినవి కాదన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. చాలా ఆచితూచి ప్రయోగించిన పాత అస్త్రంగా కేసీఆర్ రాజకీయాలన్ని దగ్గరి నుంచి చూస్తోన్న విశ్లేషకులు చెబుతున్నారు.
పాత గాయాలను చూపుతోన్న కేసీఆర్.
విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ చంద్రబాబు పాలన నాటి రోజులను గుర్తు చేశారు. కరెంటు కోతలు, కరెంటు ఛార్జీల పెంపు, ఉద్యమం నాటి పరిస్థితులను చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తాను తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకోవాల్సి వచ్చింది, కనీసం తన పార్టీకి కార్యాలయం దొరకనీయకుండా చంద్రబాబు చేశారని గుర్తు చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జల దృశ్యంలో తన ఇంటినే కార్యాలయంగా ఇస్తే దాన్ని చంద్రబాబు కూల్చివేశారని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల ద్వారా తెలంగాణ ప్రాంతానికి చంద్రబాబు ప్రధాన శత్రువు అని చెప్పే ప్రయత్నం చేశారు కేసీఆర్. చంద్రబాబు అడుగుపెడితే అవే పరిస్థితులు పునరావృతం అవుతాయని హెచ్చరికను పార్టీ శ్రేణులకు, ప్రజలకు పంపే ప్రయత్నం చేశారు.
2014, 2019లో చంద్రబాబే బీఆర్ఎస్ టార్గెట్...
తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి శాసన సభ ఎన్నికల్లోను కేసీఆర్ ప్రధాన ప్రచారాస్త్రం చంద్రబాబే. తెలంగాణను అడ్డుకున్న వ్యక్తిగా చంద్రబాబును ఆ ఎన్నికల్లో కేసీఆర్ చిత్రీకరించారు. తెలంగాణను అడ్డుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించిన చంద్రబాబు తిరిగి తెలంగాణ రాజకీయాల్లోకి ఎలా రానిద్దామంటూ ప్రతీ సభలో కేసీఆర్ ప్రజలను ప్రశ్నించారు. ఈ ప్రచారం ప్రజల్లోనీ తీవ్ర చర్చ రెకెత్తించింది. కేసీఆర్ ఎత్తుగడ ఫలించింది. ఆ ఎన్నికల్లో గులాబీ పార్టీ మెజార్టీ స్థానాలు గెల్చుకోని అధికారంలోకి వచ్చింది.
2018లో కూడా చంద్రబాబును టార్గెట్ చేస్తూ ప్రచారం చేశారు. ఆయన టార్గెట్‌గానే కేసీఆర్ ప్రతి సభలో విమర్శలు చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని తెలంగాణపై పెత్తనం చేయడానికి వస్తున్నారని తీవ్ర స్థాయిలో సెంటిమెంట్ రగిల్చారు. అప్పుడు కూడా చంద్రాస్త్రంతోనే కేసీఆర్ పవర్‌లోకి వచ్చారు.
2025లోనూ పాత అస్త్రానికి పదును పెడుతున్న కేసీఆర్.
అధికారం కోల్పోయి ఏడాదిన్నర అవుతున్న టైంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం వేదికగా కేసీఆర్ చంద్రబాబు అస్త్రాన్ని బయటకు తీశారు. తిరిగి ఎన్డీఏ పేరుతో చంద్రబాబు తెలంగాణలో రాజకీయాలు చేయనున్నారని ఇది తెలంగాణ ప్రాంతానికి నష్టం చేస్తోందని చెప్పేందుకు కేసీఆర్ విమర్శలు చేశారు. ఓవైపు చంద్రబాబు ఏపీ సీఎంగా ఉంటూ, తెలంగాణలో రాజకీయాల్లో కూడా అడుగుపెడితే తెలంగాణాకు అన్యాయం, ఏపీకి లాభం జరుగుతుందన్న లాజిక్‌ను వాడే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్.
ఎన్డీఏలో చక్రం తిప్పే పరిస్థితుల్లో ఉన్న చంద్రబాబు, తెలంగాణలోకి రానిస్తే కేంద్రం నుంచి వచ్చేవి రాకుండా అడ్డుపడే అవకాశం ఉంటుందని, గోదావరి, కృష్ణా జలాలను తరలించుకునే అవకాశం ఉందని అందుకే కేసీఆర్ ఈ వాఖ్యలు చేసినట్లు గులాబీ ముఖ్య నేతలు చెబుతున్నారు. చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి ఇక్కడ సీఎంగా ఉండటంతో చంద్రబాబుకు అడ్డు లేకుండా పోతుందని అందుకే కేసీఆర్ ముందు చూపుతో చేసిన వ్యాఖ్యలగా బీఆర్ఎస్ నేతలు విశ్లేషిస్తున్నారు.
రానున్న రోజుల్లో ఇదే ప్రచారాస్త్రం కానుందా..?
ఎన్డీఏ పేరుతో తెలంగాణలోకి చంద్రబాబు రాకుండా చేసే ప్రచారం కేసీఆర్ చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రచారంతో తెలంగాణ ప్రజల్లో మరోసారి సెంటిమెంట్ రేకేత్తించవచ్చన్నది ఆయన వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2014, 2018లో మెజార్టీ స్థానాలు బీఆర్‌ఎస్ గెలవడానికి కారణం తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేయడమే అన్న విశ్లేషణలు ఉన్నాయి. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు తెలంగాణలో తిరిగితే అది కేసీఆర్‌కు ప్లస్ అవుతుందని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఇదే జరిగితే మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అది కేసీఆర్‌కు సెంటిమెంట్ అస్త్రంగా మారనుందని అంటున్నారు. ఇదే వ్యూహంతో కేసీఆర్ చాలా ఆలోచించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు.
Also Read: బీఆర్ఎస్ బహిరంగసభ మరింత ఆలస్యం - ఏప్రిల్ 27వ తేదీ ఖరారు !
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

