Amaravati Farmers: అమరావతి రైతుల తిరుపతి సభపై ఉత్కంఠ... అనుమతిపై స్పందించని పోలీసులు... హైకోర్టును ఆశ్రయిస్తామంటున్న రైతులు
అమరావతి రైతులు ఈ నెల 17న తిరుపతిలో నిర్వహించే సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో రైతులు హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు.
అమరావతి రైతుల మహాపాదయాత్రకు అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యలు, పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుపడుతూనే ఉన్నారు. తాజాగా అమరావతి రైతులు తిరుపతిలో నిర్వహించే సభకు పోలీసుల అనుమతి ఇవ్వలేదు. దీనిపై హైకోర్టుకు వెళ్తామని అమరావతి జేఏసీ కన్వీనర్ శివారెడ్డి అంటున్నారు. ఈనెల 17న తిరుపతిలో నిర్వహించే సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని అమరావతి జేఏసీ కన్వీనర్ శివారెడ్డి తెలిపారు. రైతుల సభకు అనుమతి ఇవ్వాలని కోరితే పోలీసులు స్పందించలేదన్నారు. పైగా ఆంక్షలకు సంబంధించి వివరణ ఇవ్వాలని పోలీసులు ప్రత్యుత్తరం పంపినట్లు ఆయన పేర్కొన్నారు. పాదయాత్రలో పాల్గొన్న వారిపై 42 కేసులు నమోదు అయ్యాయని, దీనిపై వివరణ ఇవ్వాలని ప్రశ్నించినట్లు శివారెడ్డి వెల్లడించారు. రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే రాజకీయ బలంతో కేసులు పెట్టారని తాము ఎలాంటి నిబంధనలు ఉల్లఘించలేదని శివారెడ్డి అన్నారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోతే హైకోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుంటామని స్పష్టం చేశారు.
36వ రోజుకు చేరుకున్న మహాపాదయాత్ర
అమరావతి రైతులు చేస్తోన్న మహా పాదయాత్రకు నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. రైతులు తమ వెంట తీసుకెళ్తోన్న వెంకటేశ్వరస్వామి రథానికి ప్రతీ గ్రామంలో ప్రజలు పూజలు చేసి, హారతులు పడుతున్నారు. రైతులపై పూలవర్షం కురిపిస్తూ సంఘీభావం తెలియజేస్తున్నారు. ఏకైక అమరావతిని కొనసాగించాలని రాజధాని రైతులు చేస్తున్న మహాపాదయాత్ర 36వ రోజుకు చేరుకుంది. రైతుల మహాపాదయాత్రలో భాగంగా సోమవారం రైతులు నెల్లూరు జిల్లాలోని వెంగమాంబపురం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. వెంగమాంబపురం నుంచి మాటమడుగు, బంగారుపల్లి మీదుగా రైతుల పాదయాత్ర కొనసాగిస్తున్నారు. బంగారుపల్లిలో మధ్యాహ్న భోజనం చేశారు. రాత్రికి పాదయాత్ర వెంకటగిరికి చేరనుంది. వెంకటగిరి చేరుకోవడంతో ఈ రోజు పాదయాత్ర ముగియనుంది. రైతుల పాదయాత్రకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నా మొక్కవోని దీక్షతో అమరావతి ప్రాంత రైతులు ముందుకు సాగుతున్నారు. మహాపాదయాత్రకు ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుందని వెల్లడించారు. అమరావతి ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా వెనక్కి తగ్గేది లేదని రైతులు అంటున్నారు.
Also Read: లోక్‌సభలో వైఎస్ఆర్‌సీపీ వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ.. మిథున్ రెడ్డి , రఘురామకృష్ణరాజు పరస్పర సవాళ్లు !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి