Inter Exams: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, '5 నిమిషాలు' ఆలస్యమైనా పరీక్షకు అనుమతి - ఈ నిబంధనలు పాటించాల్సిందే
INTER: ఇంటర్మీడియట్వా ర్షిక పరీక్షలకు ఈసారి ఒక్క నిమిషం ఆలస్యం నిబంధన వర్తించదు. పరీక్ష ప్రారంభమైన తర్వాత 5 నిమిషాలు.. అంటే ఉదయం 9.05 గంటల వరకు విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించనున్నారు.

Telangana Inter Exams 2025: తెలంగాణలో మార్చి 5 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇంటర్ బోర్డు కీలక సూచనలు చేసింది. ఇంటర్ పరీక్షల్లో ఒక్క నిమిషం నిబంధనను సడలించారు. ఈసారి కూడా 'ఒక్క నిమిషం ఆలస్యం' నిబంధన వర్తించదు. దీంతో పరీక్ష ప్రారంభమైన తర్వాత 5 నిమిషాల వరకు విద్యార్థులకు పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. అంటే ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమైతే.. ఉదయం 9.05 గంటల వరకు మాత్రమే విద్యార్థులను అనుమతించనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య సూచించారు. విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకుంటే ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్ష రాసుకోవచ్చన్నారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులు ముందుగా చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నిబంధనల ప్రకారం ఉదయం 8.45 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఓఎంఆర్ పత్రాన్ని విద్యార్థులు పూర్తి చేయాలని, ఎవరికి వారు తమకిచ్చిన పత్రంపై తమ వివరాలే ఉన్నాయా? లేవా? అని సరిచూసుకోవాలన్నారు.
పరీక్షలకు హాజరుకానున్న 9.96 లక్షల విద్యార్థులు..
ఈ సారి ఇంటర్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,96,971 విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో ఫస్టియర్ 4,88,448 మంది; సెకండియర్ 5,08,523 మంది విద్యార్థులు ఉన్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,532 ఎగ్జామ్ సెంటర్లను ఇంటర్ బోర్డు ఏర్పాటుచేసింది. ఇందులో 49 సెల్ఫ్ సెంటర్లు ఉన్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో ఈసారి కూడా అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈసారి పరీక్షలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు కలుపుకొని అబ్బాయిలు 4,97,528 మంది ఉండగా.. 4,99,443 మంది అమ్మాయిలు ఉన్నారు. అంటే 1,915 మంది అధికం. ఏకంగా 27 జిల్లాల్లో బాలికల సంఖ్య అధికంగా ఉండగా... కేవలం ఆరు అర్బన్ జిల్లాల్లో బాలురు అధికంగా ఉన్నారు.
విద్యార్థులకు ముఖ్య సూచనలు..
➥ ఈసారి హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. దాన్ని స్కాన్ చేసి పరీక్షా కేంద్రం లొకేషన్ తెలుసుకోవచ్చు. ఒకరోజు ముందుగానే పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి రావడం మంచిది.
➥ ప్రశ్నపత్రంపై సీరియల్ నంబరు ముద్రించారు. దీంతో ఏ సంఖ్య పేపర్.. ఏ విద్యార్థికి వెళ్తుందో దీనిద్వారా తెలుసుకోవచ్చు. ప్రశ్నపత్రం ఒకవేళ బయటకు వచ్చినా.. అది ఏ పరీక్షా కేంద్రం, ఏ విద్యార్థిదని వెంటనే తెలుసుకోవచ్చు.
➥ ప్రశ్నపత్రంలో ఏమైనా పొరపాట్లు ఉంటే పరీక్ష ప్రారంభమైన తర్వాత సవరించుకోవాలని సమాచారం ఇస్తారు. ఇన్విజిలేటర్లు ఆ విషయాన్ని చెబుతారు. ఆ ప్రకారం విద్యార్థులు సరిచేసుకొని సమాధానాలు రాయాలి.
➥ గతేడాది వరకు పరీక్షకు సాధారణ(అనలాగ్) చేతిగడియారాలను అనుమతించేవారు. అయితే పరీక్షల సమయంలో అధిక సంఖ్యలో విద్యార్థులు ఉంటుండటంతో ఏది అనలాగ్, ఏది స్మార్ట్‌వాచ్ అనేది గుర్తించే పరిస్థితి లేదు. అందుకే ఈసారి ఏ రకమైన చేతిగడియారాలనూ తీసుకెళ్లేందుకు అనుమతి లేదు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు..
పరీక్షల పర్యవేక్షణ కోసం బోర్డు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ని అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రంలోని సీసీ కెమెరాలను ఈ కేంద్రంతో అనుసంధానించారు. ఒక్కో జిల్లాకు ఒక్కో స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. మొత్తం 75 మంది సిబ్బంది పరీక్షా కేంద్రాలను పర్యవేక్షిస్తుంటారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే బోర్డు కార్యాలయంలో ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్ నంబరు 9240205555 సంప్రదించవచ్చు. ఒకవేళ ఏమైనా మానసిక, ఆందోళన, ఒత్తిడి లాంటి సమస్యలకుటోల్ ఫ్రీ నంబరు 14416 కాల్ చేయవచ్చు.
ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ షెడ్యూలు..
పరీక్ష తేదీ | వారం | పేపర్ |
05.03.2025 | బుధవారం | సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1 |
07.03.2025 | శుక్రవారం | ఇంగ్లిష్ పేపర్ పేపర్-1 |
11.03.2025 | మంగళవారం | మాథ్స్ పేపర్ 1ఎ, బోటని పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1 |
13.03.2025 | గురువారం | మ్యాథ్స్ పేపర్ 1బి, జువాలజి పేపర్-1, హిస్టరీ పేపర్-1 |
17.03.2025 | సోమవారం | ఫిజిక్స్ , ఎకనామిక్స్ |
19.03.2025 | బుధవారం | కెమిస్ట్రీ , కామర్స్ |
21.03.2025 | శుక్రవారం | పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్య్ పేపర్-1(బైపీసీ విద్యార్థులకు) |
24.03.2025 | సోమవారం | మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్ -1 |
ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ షెడ్యూలు..
పరీక్ష తేదీ | వారం | పేపర్ |
06.03.2025 | గురువారం | సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2 |
10.03.2025 | సోమవారం | ఇంగ్లిష్ పేపర్-2 |
12.03.2025 | బుధవారం | మాథ్స్ పేపర్ 2ఎ, బోటని పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2 |
15.03.2025 | శనివారం | మ్యాథ్స్ పేపర్ 2బి, జువాలజి పేపర్-2, హిస్టరీ పేపర్-2 |
18.03.2025 | మంగళవారం | ఫిజిక్స్ , ఎకనామిక్స్ |
20.03.2025 | గురువారం | కెమిస్ట్రీ , కామర్స్ |
22.03.2025 | శనివారం | పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్-2 (బైపీసీ విద్యార్థులకు) |
25.03.2025 | మంగళవారం | మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2 |
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

