AP NGO's: ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ... ఉద్యోగులు తలచుకుంచే ప్రభుత్వాన్ని కూల్చవచ్చు... వైరల్ అవుతున్న ఏపీఎన్జీవో అధ్యక్షుడి వీడియో
ప్రభుత్వ తీరుపై ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఉద్యోగులు తలచుకుంటే ప్రభుత్వాలు కూల్చవచ్చు... నిలబెట్టవచ్చని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ఉద్యోగుల అంతర్గత సమావేశంలో ప్రభుత్వ తీరుపై ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసులు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 'నేను విన్నాను...నేను ఉన్నాను... అని చెప్పిన మాయ మాటలు విని 151 సీట్లు ఇచ్చాము. ఆరిపోయే ముందు దీపం బాగా వెలుగుతుంది. అటువంటిదే ఈ మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌ల ఫలితాలు. ఉద్యోగుల పరిస్థితి ఏంటో చంద్రబాబుకు బాగా తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగికి 5 ఓట్లు ఉంటాయి. 13 x 5 ఓట్లు లెక్కన సుమారు 60 లక్షల మంది.. వీరంతా కలిస్తే ప్రభుత్వాన్ని కూల్చవచ్చు.... నిలబెట్టవచ్చు.. ఈ శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే. రైతుల ఉద్యమానికై సాక్షాత్తు ప్రధాన మంత్రి తప్పైపోయిందని చంపలేసుకున్నారు. భావితరాల కోసం ఉద్యమం ఎలా ఉండాలి అనేది చెప్పేందుకే తప్పా మీ మొచ్చేతి నీళ్లు తాగే పరిస్థితి రాదు. ఉద్యమం ద్వారానే హక్కులను సాధించుకుంటాం. మీ దయాదాక్షణ్యాల మీద కాదు. ఉద్యోగులు చచ్చిపోతున్నా కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. 1వ తేదీన జీతం తీసుకోవడం అనేది ఉద్యోగుల హక్కు, పాలవాళ్లు దగ్గర, కూరగాయల వాళ్లు దగ్గర ప్రభుత్వ ఉద్యోగులు లోకువైపోయారు.' అని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు.
Also Read: భార్యకు జాకెట్ కుట్టిచ్చిన భర్త.. తర్వాత లోనికి వెళ్లి ఉరేసుకున్న భార్య.. ఏం జరిగిందంటే..
ఓటీఎస్ పై మహిళా ఎంపీడీవో ఆడియో వైరల్..
వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) పేరుతో భూమిపై హక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ పత్రాలు ఇస్తోన్న... ఉద్యోగులకు టార్గెట్ పెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇది స్వచ్ఛందమంటూ ప్రజలకు చెబుతున్నా.. ఉద్యోగులు మాత్రం టార్గెట్ ప్రకారం పనిచేయాల్సిందేనంటున్నారు. ఈ క్రమంలో ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఆ మధ్య ఒక పంచాయతీ సెక్రటరీ కూడా ఓటీఎస్ చేయించుకోకపోతే ప్రభుత్వ పథకాలు ఆపేయండి అంటూ మెసేజ్ ఇచ్చి సస్పెండ్ అయ్యారు. తాజాగా నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల ఎంపీడీవో సుస్మితారెడ్డి కూడా ఇలాగే ఓటీఎస్ పై ఇచ్చిన ఓ ఆడియో వైరల్ గా మారింది. ఓటీఎస్ కట్టనివారిని నయానో, భయానో నచ్చజెప్పి అందరూ టార్గెట్ పూర్తి చేయాలంటూ ఆమె ఇచ్చిన ఆడియో మెసేజ్ అధికారుల గ్రూప్ నుంచి బయటకొచ్చింది. స్కీమ్ లు ఆపేయాలని, సర్టిఫికెట్లు ఇవ్వొద్దని ఆమె ఆ ఆడియోలో చెప్పారు. సోషల్ మీడియాలో ఈ ఆడియో వైరల్ గా మారింది.
Also Read: విశాఖ ఆర్కే బీచ్ లో ముందుకొచ్చిన సముద్రం... 200 మీటర్ల మేర కోతకు గురైన బీచ్... పర్యాటకులకు నో ఎంట్రీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి