Weather Latest Update: బలహీనపడ్డ ద్రోణి, త్వరలో మరో భారీవర్ష సూచన, నేడు తెలుగు రాష్ట్రాల్లో వానలు సాధారణమే!
ఈనెల 12న మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.
‘‘నిన్న 21° N అక్షాంశం వెంబడి ఉన్న షీయర్ జోన్ (ద్రోణి) ఈరోజు బలహీనపడింది. ఈరోజు కింది స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపునకి వీస్తున్నాయి’’ అని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఈనెల 12న మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు.
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 08 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 28 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 92 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
21° ఉత్తర అక్షాంశం వెంబడి ఉన్న షీయర్ జోన్ (ద్రోణి) ఈరోజు బలహీనపడిందని.. ఈరోజు కింది స్థాయిలోని గాలులు పశ్చిమ, నైరుతి దిశల నుండి ఏపీలోని లోవర్ ట్రోపోస్పిరిక్ లో గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం
ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాల చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటరువేగముతో వీయవచ్చు. దక్షిణ కోస్తాలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలో మీటరు వేగముతో వీయవచ్చు.