Suryapet News: మంత్రి జగదీష్ రెడ్డి నుంచి ప్రాణహాని, డీసీఎంఎస్ చైర్మన్ జానయ్యను కిడ్నాప్ చేయించారు: కుటుంబం ఆరోపణలు
Suryapet BRS Ticket Issue: సూర్యాపేట డీసీఎంఎస్ చైర్మన్ జానయ్యకు మంత్రి జగదీష్ రెడ్డి నుంచి ప్రాణహని ఉందంటూ ఆయన భార్య, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
Suryapet BRS Ticket Issue:
మంత్రి జగదీష్ రెడ్డిపై కిడ్నాప్ ఆరోపణలు కలకలం రేపాయి. సూర్యాపేట డీసీఎంఎస్ చైర్మన్ జానయ్యకు మంత్రి జగదీష్ రెడ్డి నుంచి ప్రాణహని ఉందంటూ ఆయన భార్య, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తన భర్త ఎమ్మెల్యే టికెట్ అడిగినందుకు మంత్రి జగదీశ్ రెడ్డి ఒక్కరోజులోనే 71 కేసులు నమోదు చేయించి భయాందోళనకు గురి చేస్తున్నారని సూర్యాపేట కౌన్సిలర్ రేణుక హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు.
తమకు ప్రాణహాని ఉందని, మంత్రి జగదీశ్ రెడ్డి బారి నుంచి రక్షణ కల్పించాలని రేణుక హెచ్‌ఆర్సీని ఆశ్రయించారు. తన భర్త ఉమ్మడి నల్లగొండ జిల్లా మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ వట్టే జానయ్య బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించినందుకు మంత్రి జగదీష్ రెడ్డి ఒక్క రోజులోనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో 71 కేసులు నమోదు చేయించారని ఆరోపించారు. తన భర్త సైతం కనిపించడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి నుంచి తనకు, తన భర్తకు ప్రాణహాని ఉందని, తమకు ఎలాగైనా రక్షణ కల్పించాలని కమిషన్‌ను ఆమె రిక్వెస్ట్ చేశారు.
నా బిడ్డను జగదీష్ రెడ్డి మాయం చేసిండు.. జానయ్య తల్లి ఆవేదన
తన కొడుకు లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి జగదీష్ రెడ్డిని ఎన్నికల్లో గెలిపించారని జానయ్య తల్లి అన్నారు. ఓటర్ల కాళ్లు పట్టుకుని ఓట్లు వేపించి జగదీష్ రెడ్డిని గెలిపిస్తే ఈరోజు తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు జాడ లేకుండా చేసింది మంత్రేనని, ఈ విషయం సూర్యాపేట జనాలకు మొత్తం తెలుసునన్నారు. ఎన్నికలకు ముందు సొంత ఖర్చులతో గెలిపించినప్పుడు లేని కేసులు ఇప్పుడు ఎలా పుట్టుకొచ్చాయో చెప్పాలని జగదీష్ రెడ్డిని జానయ్య తల్లి ప్రశ్నించారు. ప్రజా సేవ కోసం బీఆర్ఎస్ కోసం నిల్చున్న తన బిడ్డ జానయ్యపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని, తన కొడుకును చూపించాలని డిమాండ్ చేశారు. కూలి పనులు చేసి కొడుకును ప్రయోజకుడ్ని చేపించానన్నారు. కొడుకు జాడ తెలియకపోవడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది.
తన కుమారుడు, తమ్ముడి జాడ చెప్పాలంటూ జానయ్య సోదరి కన్నీళ్లు..
జానయ్య సోదరి మాట్లాడుతూ.. తాము ఏం తప్పు చేయలేదని, తనకు కూడా అన్యాయం జరిగిందన్నారు. జానయ్య సోదరి అయినందుకు నలుగురు పోలీసులు మా ఇంటికి గోడ దూకి వచ్చి, తన కుమారుడ్ని నాలుగు రోజుల కిందట తీసుకుపోయారని ఆమె ఆరోపించింది. తన కుమారుడు ఏ జైలులో ఉన్నాడు, ఎలా ఉన్నాడో చూపించాలని కోరారు. నా పెద్ద కొడుకును చూపించకపోతే నేను చచ్చిపోతాను.. నీ జెండా మోసిన మాకు అన్యాయం చేశావంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన తమ్ముడ్ని ఇబ్బంది పెట్టవద్దని, తన కొడుకును కూడా విడిచిపెట్టాలని వేడుకున్నారు. పార్టీ జెండా మోసిన తమను ఇలా వేధించడం సరికాదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. బీఆర్ఎస్ టికెట్ అడిగినందుకు తమ కుటుంబంపై జగదీష్ రెడ్డి పగబట్టి ఇలా చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ గెలిస్తే చాలు అనుకున్నామని, కానీ తమ కుటుంబంపై జగదీష్ రెడ్డి కక్షగట్టి వారిని మాయం చేశారన్నారు.
జానయ్య లేకపోతే జగదీష్ రెడ్డి గెలిచేటోడా?: ప్రవీణ్ కుమార్
ఓటమి భయంతో మంత్రి జగదీష్ రెడ్డి బీసీ అయిన జానయ్య యాదవ్ పై దాడి చేయిస్తున్నాడని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. టికెట్ ఆశించాడన్న కారణంగా జానయ్య మీద కుప్పలుతెప్పలుగా కేసులు పెట్టించి జైలుకు పంపే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కిరాయి గూండాలతో జానయ్యను ఖతం చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జానయ్య లేకపోతే జగదీష్ రెడ్డి గత ఎన్నికల్లో గెలిచేవాడా అని ప్రశ్నించారు.