Shivani Rajashekhar: క్రేజీ ఛాన్స్ కొట్టేసిన శివానీ రాజశేఖర్ - మాధవన్ 'GDN' మూవీలో కీలక రోల్?
R Madhavan GDN: ఆర్ మాధవన్ ప్రధాన పాత్రలో వస్తోన్న లేటెస్ట్ మూవీ 'GDN'. ఈ మూవీలో కీలక రోల్ కోసం ప్రముఖ నటి శివానీ రాజశేఖర్‌ను మేకర్స్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

Shivani Rajashekhar Is Part Of Madhavan's GDN Movie: స్టార్ హీరో ఆర్.మాధవన్ (R Madhavan) లేటెస్ట్ మూవీ 'GDN'. ప్రముఖ శాస్త్రవేత్త, ఇంజినీర్ గోపాల స్వామి దొరై స్వామి నాయుడు జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కీలక రోల్ కోసం శివానీ రాజశేఖర్
తాజా బజ్ ప్రకారం ఈ మూవీలో కీలక రోల్ కోసం సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివానీ రాజశేఖర్‌ను (Shivani Rajashekhar) మూవీ టీం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. జూన్ నుంచి ఆమె షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. శివానీ మునపటి చిత్రాలను చూసిన దర్శక నిర్మాతలు ఈ పాత్ర కోసం ఆమె అయితేనే న్యాయం చేస్తారని భావిస్తున్నారట. ఈ మూవీ ఆమె రోల్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని.. ఆమె కెరీర్‌లోనే GDN ఓ అద్భుత చిత్రంగా నిలుస్తుందని అంటున్నారు.
శివానీ తెలుగులో ఎవడైతే నాకేంటి, సత్యమేవజయతే, కల్కి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత 2018లో '2 స్టేట్స్' సినిమాలో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమయ్యారు. తెలుగు, తమిళం భాషల్లోనూ నటించి మెప్పించారు. అద్భుతం, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, అన్బరివు, నెంజుక్కు నీతి, శేఖర్, కోటబొమ్మాళి పీఎస్, విద్య వాసుల అహం సినిమాల్లో నటించారు.
Also Read: పవన్ కల్యాణ్ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? - డిప్యూటీ సీఎంకు మరోసారి ప్రకాష్ రాజ్ కౌంటర్
ఎవరీ గోపాల స్వామి దొరై స్వామి నాయుడు?
పెద్దగా చదువుకోకపోయినా ఆటోమొబైల్, అగ్రికల్చర్, టెక్స్ టైల్, ఫోటోగ్రఫీ వంటి సెక్టార్స్‌లో గోపాల స్వామి దొరై స్వామి నాయుడు (GDN) అద్భుత ఆవిష్కరణలు చేశారు. మన దేశంలో ఎలక్ట్రిక్ మోటార్ కనిపెట్టింది ఈయనే. తొలుత పారిశ్రామిక పరికరాలను కనిపెట్టి తన ప్రతిభను చూపారు. ఆ తర్వాత తన ఆవిష్కరణలను ఇతర రంగాలకు విస్తరింపచేశారు. హోటల్‌లో సర్వర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత మెకానిక్‌గా మారి ఎంతో శ్రమించి పలు ఆవిష్కరణలు చేశారు. సొంతంగా ప్రయోగాలు చేస్తూ 11 గంటల్లోనే ఇల్లు కట్టిన రికార్డు ఆయన సొంతం. ఈయన్ను 'ఎడిసన్ ఆఫ్ ఇండియా, మిరాకిల్ మేన్, వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూరు' వంటి బిరుదులు సొంతం చేసుకున్నారు.
ఈయన జీవిత చరిత్రను బయోపిక్‌గా తీయనుండగా.. ఆర్.మాధవన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీకి కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియమణి, జయరాం, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
రెండో బయోపిక్
సఖి, చెలి వంటి సినిమాల ద్వారా మాధవన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నా మళ్లీ సినిమాల్లో బిజీగా మారారు. నాగచైతన్య హీరోగా వచ్చిన 'సవ్యసాచి' మూవీలో విలన్‌గానూ నటించి ఆకట్టుకున్నారు. ఇటీవలే ఆయన ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' మూవీలో నటించి మెప్పించారు. ఈ సినిమాకు ఆయనకు జాతీయ అవార్డు సైతం వచ్చింది. ఇప్పుడు ఇది రెండో బయోపిక్. ఈ సినిమాలో మిరాకిల్ మేన్‌గా మాధవన్ మెప్పిస్తారని సినీ ప్రియులు అంటున్నారు. ఆయన తాజా మూవీ 'టెస్ట్' ఏప్రిల్ 4న నేరుగా ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీలో మాధవన్, నయనతార, సిద్దార్ద్ కీలక పాత్రలు పోషించారు.






















