Sriram Sagar project gates open: పూర్తిగా నిండిన శ్రీరాం సాగర్ ప్రాజెక్టు, 16 గేట్లు ఎత్తిన అధికారులు
నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆగస్టులో కురిసిన వర్షాలతో హైదరాబాద్ సహా తెలంగాణలోని జిల్లాలన్నీ వణికిపోయాయి. వాగులు, వంకలు పొంగాయి. చెరువు కట్టలు తెగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు వరదలో కొట్టుకుపోయారు. ఈ బీభత్సం మరువకముందే.. మళ్లీ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మళ్లీ జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ జిల్లాలో వాగులు వకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు కూడా నిండిపోయాయి. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద పోటెత్తింది. ప్రస్తుతం శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు 75వేల 100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. వరద అంతకంతకూ పెరుగుతుండటంతో.. ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. 16 గేట్లు ఎత్తి 64వేల 38 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో మొత్తం 90 టీఎంసీల నీటిని నిల్వ ఉంచవచ్చు. అయితే పెద్దఎత్తున వరద వస్తుండటంతో ప్రాజెక్టు ఫుల్ అయ్యింది. దీంతో గేట్లు ఎత్తక తప్పలేదు. ఇక, జిల్లాలోని మరో జలాశయమైన రామడుగు ప్రాజెక్టులో కూడా వరద పెరుగుతోంది. 12వేల 285 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో... రామడుగు ప్రాజెక్టులో నీటిమట్ట 1278.3 అడుగులకు చేరింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టు అన్నింటిది ఇదే పరిస్థితి. ఏ జలశాయం చూసినా.. జలకళతో కళకళలాడుతోంది. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 29వేల 800 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో నిజాంసాగర్ ప్రాజెక్టులో నాలుగు గేట్లు ఎత్తారు అధికారులు. నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 17 టీఎంసీలకు చేరింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు జనజీవనం కూడా అస్థవ్యక్తంగా మారింది. పలు మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కామారెడ్డి జిల్లాలోని గాంధారిలో 14.4 సెంటీమీటర్లు, కామారెడ్డిలో 9.9, నాగిరెడ్డిపల్లిలో 9.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో జుక్కల్-బస్వాపూర్ మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో రోడ్డు కొట్టుకుపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వాగులు-వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో.. పలు ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కొన్ని చోట్ల రహదారులపై కూడా వరద ప్రవహరిస్తోంది. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరో కొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. అలర్ట్‌గా ఉండాలని హెచ్చరించింది. జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉంది. అనుకోని సంఘటనలు జరిగితే... వెంటనే సహాయకచర్యలు చేపట్టేందుకు వీలుగా ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉంది.