National Party News: ప్రగతి భవన్‌లో అతిథులకు అల్పాహార విందు, ‘జాగ్వార్’కు స్వయంగా టిఫిన్ వడ్డించిన కేటీఆర్
అల్పాహార విందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పదుల సంఖ్యలో నేతలు, అతిథులు సామూహికంగా అల్పాహారం స్వీకరించారు.
టీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు నేడు (అక్టోబరు 5) జాతీయ పార్టీని ప్రకటించబోతున్న సందర్భంగా ముఖ్య అతిథులతో ప్రగతి భవన్ సందడిగా మారింది. ఉదయమే వచ్చిన అతిథులకు కేసీఆర్ అల్పాహార విందు ఇచ్చారు. కర్ణాటక నుంచి అక్కడి ప్రతిపక్ష పార్టీ జనతాదళ్ (సెక్యులర్) ముఖ్యనేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి, ఆయన తనయుడు నిఖిల్ గౌడతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, తదితర ప్రజా ప్రతినిధుల బృందం బుధవారం ఉదయం ప్రగతి భవన్‌కు వచ్చింది.
ఇటు తమిళ నాడు నుంచి ‘విదుతాలై చిరుతైగల్ కట్చె’ (విసికె) పార్టీ అధినేత ‘చిదంబరం పార్లమెంట్ సభ్యుడు’, ప్రముఖ దళిత నేత తిరుమావళవన్, వారితో పాటు వచ్చిన ప్రతినిధుల బృందం బుధవారం ఉదయం ప్రగతి భవన్ కు చేరుకుంది. వీరు మంగళవారం రాత్రే బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోగా, మంత్రి కేటీఆర్ స్వయంగా స్వాగతం పలికారు. బుధవారం ఉదయం ప్రగతి భవన్ వచ్చిన కుమారస్వామి బృందాన్ని, తిరుమావళవన్ బృందాన్ని సీఎం కేసీఆర్, కేటీఆర్ లు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన అల్పాహార విందులో పాల్గొని వారికి ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితర ప్రజాప్రతినిధులు ఉన్నారు.
కేటీఆర్ వడ్డన
అల్పాహార విందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పదుల సంఖ్యలో నేతలు, అతిథులు సామూహికంగా అల్పాహారం స్వీకరించారు. అతిథులకు మంత్రి కేటీఆర్ కూడా స్వయంగా అల్పాహారం వడ్డించారు. కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి కుమారుడు, సినీ హీరో నిఖిల్ గౌడకు (జాగ్వార్ సినిమా హీరో) మంత్రి కేటీఆర్ స్వయంగా ఇడ్లీ వడ్డించారు. వడ్డన పూర్తయ్యాక కేటీఆర్, హరీశ్ రావు, పాడి కౌశిక్ రెడ్డి సహా పలువురు టీఆర్ఎస్ నేతలు వెనుక నిలబడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ అల్పాహారం అనంతరం సీఎం కేసీఆర్ తో పాటు అతిథులు ప్రత్యేక కాన్వాయ్‌లో తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు.
మీడియాకు నో ఎంట్రీ
అల్పాహార విందు ముగిశాక, నేడు మధ్యాహ్నం బంజారాహిల్స్ లోని తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం ఉంటుంది. ఈ టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశానికి మీడియాను అనుమతించడం లేదు. మధ్యాహ్నం ప్రెస్ మీట్ ఉంటే చెప్తామని తెలంగాణ భవన్ తేల్చి చెప్పారు. అప్పటికే లోపల ఉన్న మీడియా ప్రతినిధులను కార్యాలయం నుంచి పోలీస్ లు, టీఆర్ఎస్ నేతలు బయటికి పంపేశారు. అయితే, సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే మీడియాను బయటికి పంపామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. దీంతో మీడియా ప్రతినిధులు తెలంగాణ భవన్ బయట రోడ్డు పైనే ఉండిపోయారు.
ఈ టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ నేతలు హాజరవుతున్నారు. దాదాపు 283 మందితో కేసీఆర్ సమావేశం అవుతారని తెలుస్తోంది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి పూరించబోయే సమరశంఖం గురించి సీఎం కేసీఆర్ నేతలకు వివరించనున్నారు.