Harish Rao: కాంగ్రెస్ వైఫల్యంతో నీటి సంక్షోభం దిశగా తెలంగాణ: మాజీ మంత్రి హరీశ్ రావు
కాంగ్రెస్ వైఫల్యంతో నీటి సంక్షోభం దిశగా తెలంగాణ: మాజీ మంత్రి హరీశ్ రావు

Groundwater in Telangana | హైదరాబాద్: తెలంగాణలో ఏడాది పాలనలో కాంగ్రెస్ వైఫల్యంతో నీటి సంక్షోభం దిశగా రాష్ట్రం వెళ్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా భూగర్భజలాల గణనీయంగా తగ్గడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. తెలంగాణను భూగర్భజల సంరక్షణలో ఆదర్శంగా నిలిపిన గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ నీటి ప్రణాళికలు కాంగ్రెస్ పాలనలో పూర్తిగా వైఫల్యానికి గురవుతున్నాయని విమర్శించారు.
బీఆర్ఎస్ పాలనలో భూగర్భజలాలు
‘తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)నాయకత్వంలో 2014 నుంచి 2023 వరకు భూగర్భజలాలు 56 శాతం పెరిగాయి. మిషన్ కాకతీయ (Mission Kakatiya) ద్వారా 27,000కు పైగా చెరువులను పునరుద్ధరించాం. దాంతో ఏకంగా 15 లక్షల ఎకరాలకు సాగునీరు అందింది. మరోవైపు 8.93 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. రైతులకు సాగు కోసం భూగర్భజలాల నిల్వ స్థిరంగా ఉండి, తాగునీటి భద్రత సైతం పెరిగింది. అన్నదాతలకు పంటల సాగుకు సౌకర్యాలు అదే స్థాయిలో పెరిగాయి. కానీ, కేవలం 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో బీఆర్ఎస్ తెచ్చిన ఈ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భజలాల గణనీయంగా తగ్గడం నిజంగా ఆందోళనకరం. కాంగ్రెస్ ప్రభుత్వ (Telangana Govt) వైఫల్యంతో రెండు మీటర్లకు పైగా భూగర్భజలాలు పడిపోయాయి. యాదాద్రి భువనగిరిలో 2.71 మీటర్ల భారీ తగ్గుదల నమోదైంది. మరోవైపు రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఇతర జిల్లాల్లోనూ భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భజలాల తగ్గుతున్నాయి. 120 కిలోమీటర్ల పొడవున గోదావరి (Godavari River) పూర్తిగా నీరులేకుండా ఎండిపోతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నిర్వహణ వైఫల్యం వల్ల గోదావరిలో నీటి ప్రవాహం తగ్గిపోయింది. మేడిగడ్డ సహా ప్రాజెక్టు నీటి భద్రతను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని’ హరీష్ రావు ఆరోపించారు.
14 నెలల పాలనతో సంక్షోభం
రాష్ట్ర ప్రజలకు తాగునీటిని అందించిన మిషన్ భగీరథ (Mission Bhagiratha) రేవంత్ రెడ్డి పాలనతో పూర్తిగా కుంటుపడింది. తెలంగాణ ప్రజలు మళ్లీ బోర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తింది. తాగునీటి కోసం ఎక్కువ మోటార్లు నడపాల్సి రావడం వల్ల కరెంట్ బిల్లులు పెరిగి ప్రజల జేబుకు చిల్లు పడి వారిపై ఆర్థిక భారం పెరుగుతోందన్నారు. కాంగ్రెస్ 14 నెలల పాలన తెలంగాణను నీటి సంక్షోభం వైపు నెట్టిందని, బలమైన నీటిపారుదల వ్యవస్థను తన నిర్లక్ష్యంతో కాంగ్రెస్ పతనం చేస్తోందన్నారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి నీటి పరిరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. లేకపోతే రాబోయే నెలల్లో రాష్ట్రం మొత్తం మరింత తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కోవాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Also Read: Narendra Modi Caste: నరేంద్ర మోదీ క్యాస్ట్ ఏంటీ? రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవమెంత?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

