Nara Lokesh: త్వరలో రెడ్‌బుక్ తన పని తాను మొదలుపెడుతుంది - నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు
AP Latest News: మంత్రి నారా లోకేష్ మంగళగిరిలోని ఈద్గాలో జరిగిన బక్రీద్ పండగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రార్థనలో పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు.
Eidgah Masjid Shadi Khana Mangalagiri: రాష్ట్ర మంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా నారా లోకేశ్ తన సొంత నియోజకవర్గానికి వెళ్లారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ మంగళగిరి ఈద్గాలో జరిగిన బక్రీద్ పండగ సందర్భంగా జరిగిన ప్రార్థనలో పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడులు కొనసాగుతున్నాయని, తమ మైనార్టీ నాయకులపై వైసీపీ రౌడీలు గాయపరిచి దాష్టీకానికి గురి చేస్తారని నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ నాయకుడు చంద్రబాబు నాయుడు సమన్వయంతో ఉండమని తమను కంట్రోల్ లో పెట్టారని అందుకోసం తాను, శ్రేణులు నోరు మెదపడం లేదని అన్నారు. రెడ్ బుక్ త్వరలో తన పని తాను చేసుకోబోతుందని నారా లోకేష్ మరోసారి సున్నితంగా హెచ్చరించారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు, మంగళగిరి నియోజకవర్గంలో పేదల కోసం ఇళ్ల నిర్మాణం చేయమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని కలిసి తాను స్వయంగా కోరానని ప్రణాళికా బద్ధంగా మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని నారా లోకేష్ తెలిపారు. తాను ఇంకా బాధ్యతలు స్వీకరించలేదని రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రతి ప్రాజెక్టును పరిశీలించి రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలో అధినేత ఆదేశానుసారం పనిచేస్తానని నారా లోకేష్ తెలిపారు.
100 రోజుల్లో గంజాయి అరికడతాం - మంత్రి లోకేష్
‘‘గంజాయి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలి 100 రోజుల్లో గంజాయి రాష్ట్రంలో అరికట్టాలి’’ అని పోలీసులకు మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. గంజాయి పై తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు హోం మంత్రిని పార్టీ అధ్యక్షుడిని పోలీసు ఉన్నత అధికారులను కలిసి వివరించా అని అన్నారు, తనను గెలిపించిన మంగళగిరి ప్రజలకు సేవ చేసేందుకు కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారు. చెప్పిన ప్రతి కార్యక్రమం చేసేందుకు ప్రణాళిక రచించుకుంటానని తెలిపారు.
‘‘రాష్ట్రంలో వైసీపీ నేతలే టీడీపీ నేతలను దాడులు, హత్యలు చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో చిలువూరులో మైనారిటీ సోదరుడిని క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపింది నిజం కాదా? ముఖ్యమంత్రి చంద్రబాబు శాంతియుతంగా ఓర్పుగా ఉండమన్నారనే విషయం గుర్తుంచుకోని తాము దాడులకు దిగలేద’’ని అన్నారు. అలాంటిది తిరిగి తమపై ఎలా ఆరోపణలు చేస్తారంటూ ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలనే శాంతియుతంగా ఉన్నామని అన్నారు. తాము గెలిచి కేవలం 10 రోజులు మాత్రమే అయిందని 10 సంవత్సరాల పాటు మంగళగిరి ఎమ్మెల్యే ఏం చేశారో చెప్పగలరా అని నిలదీశారు. వైజాగ్ రిషికొండ వ్యవహారంపై ముఖ్యమంత్రి అధికారులకు నివేదిక సమర్పించమని కోరారని అన్నారు. రుషికొండ లాంటివి రాష్ట్రంలో చాలానే జరిగాయి అన్నిటి మీద నివేదిక వచ్చిన అనంతరం ప్రజల ముందు బహిర్గతం చేస్తాం’’ అని లోకేశ్ అన్నారు.