Supreme Court: ‘పాపం చేసిన వ్యక్తికీ భవిష్యత్తు ఉంటుంది’ దోషికి ఉరిశిక్ష రద్దు చేస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఫిరోజ్ అనే వ్యక్తి నాలుగేళ్ల బాలికపై అత్యాచారం, హత్య చేశాడనే నేరంపై జిల్లా కోర్టు అతనికి మరణ శిక్షను విధించింది. హైకోర్టు కూడా దాన్ని సమర్థించింది.
![Supreme Court: ‘పాపం చేసిన వ్యక్తికీ భవిష్యత్తు ఉంటుంది’ దోషికి ఉరిశిక్ష రద్దు చేస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు Supreme Court decreases Death Sentence On Man who Rapes Murders 4 Year Old Girl Supreme Court: ‘పాపం చేసిన వ్యక్తికీ భవిష్యత్తు ఉంటుంది’ దోషికి ఉరిశిక్ష రద్దు చేస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/01/15125033/1-supreme-court.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నాలుగేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఓ దోషిపై సుప్రీంకోర్టు మానవత్వంతో వ్యవహరించింది. కింది కోర్టు అతనికి విధించిన మరణ శిక్షను తగ్గించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్. రవీంద్ర భట్, బేలా ఎం. త్రివేదిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. నేరస్థులకు విధించే ఉరి శిక్ష ప్రతి సందర్భంలోనూ నిర్ణయాత్మక అంశం కాదని ధర్మాసనం పేర్కొంది.
ఫిరోజ్ అనే వ్యక్తి నాలుగేళ్ల బాలికపై అత్యాచారం, హత్య చేశాడనే నేరంపై జిల్లా కోర్టు అతనికి మరణ శిక్షను విధించింది. ఐపీసీ సెక్షన్ 302 కింద నేరం చేసినందుకు నిందితుడు ఫిరోజ్‌కి మరణ శిక్షతో పాటు 7 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. సెక్షన్ 363 కింద నేరానికి, 10 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా చెల్లించాలని తీర్పు చెప్పింది. సెక్షన్ 366 కింద నేరం చేసినందుకు జీవిత ఖైదు, రూ.2 వేలు జరిమానా చెల్లించాలని ఆదేశాలిచ్చింది. ఐపీసీ సెక్షన్లు 376(2)(i), 376(2)(m) పోక్సో చట్టంలోని సెక్షన్లు 5(i)r/w 6, 5(m) r/w 6 కింద ఆయనపై అభియోగాలు ఉన్నాయి. అయితే, దోషికి విధించిన మరణ శిక్షను అతను హైకోర్టులో అప్పీల్ చేయగా.. అతని అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.
20 ఏళ్లకు తగ్గించిన శిక్ష
‘‘దోషిపై అభియోగాలు మోపిన నేరాలపై దిగువ న్యాయస్థానాలు తీసుకున్న అభిప్రాయాన్ని ధృవీకరిస్తూ, శిక్షార్హమైన ఈ నేరానికి మరణ శిక్షకు బదులు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడం సరైనదని భావిస్తున్నాం. తదనుగుణంగా ఈ మరణ శిక్షను మార్చాలి. నేరం తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటే, అప్పీలుదారు మిగిలిన సహజ జీవితానికి జైలు శిక్ష సరైన శిక్షగా ఉంటుంది. ఈ సందర్భంగా, మేము ఆస్కార్ వైల్డ్ చెప్పిన వాటిని గుర్తు చేస్తున్నాం. ‘‘సాధువు మరియు పాపి మధ్య ఉన్న ఏకైక తేడా ఏంటంటే, ప్రతి సాధువుకు గతం ఉంటుంది.. మరియు ప్రతి పాపికి భవిష్యత్తు ఉంటుంది’’ ఈ న్యాయస్థానం సంవత్సరాలుగా గుర్తించిన న్యాయం ప్రాథమిక సూత్రాలలో ఒక అంశం ఉంది.
నేరస్థుడు జైలు నుండి విడుదలైనప్పుడు జరిగిన నష్టాన్ని సరిచేయడానికి, సామాజికంగా ఉపయోగకరమైన వ్యక్తిగా మారడానికి అతనికి అవకాశం కల్పించడం. మరణ శిక్ష అనేది అపరాధి వంకర మనస్తత్వాన్ని సరిచేయడానికి ఎల్లప్పుడూ నిర్ణయాత్మక అంశం కాకపోవచ్చు. అందువల్ల, ప్రతీకార న్యాయం, పునరుద్ధరణ న్యాయ ప్రమాణాలను సమతుల్యం చేస్తూ, జీవితాంతం జైలు శిక్షకు బదులుగా 20 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించడం సముచితమని మేము భావిస్తున్నాం. 376A, POCSO చట్టం కింద ఇతర నేరాలకు సంబంధించి దిగువ కోర్టులు నమోదు చేసిన నేరారోపణలు, శిక్షలన్నీ ఏకకాలంలో అమలు అవుతాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.’’ అని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)