Covid19 Cases: కొవిడ్ కేసుల పెరుగుదలతో ఏపీ అలర్ట్ - తెలంగాణను భయపెడుతున్న H3N2 కేసులు
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. అటు తెలంగాణలో H3N2 కేసులు పెరుగుతున్నా నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా జరగడం లేదు.
దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పోర్టల్ ప్రకారం రాష్ట్రంలో కొవిడ్ -19 యాక్టివ్ కేసులు 27 మాత్రమే ఉన్నాయి. అయితే మహమ్మారి వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సీనియర్ అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. వాస్తవానికి, గత నెలలో దాదాపు 15 రోజుల పాటు రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు కాలేదు. అయితే ఇతర రాష్ట్రాల్లో కేసుల పెరుగుదలతో, ఆంధ్రప్రదేశ్‌లో కూడా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో కొవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం దేశవ్యాప్తంగా మొత్తం 1,890 కొత్త కేసులు నమోదు కాగా నలుగురు మృతి చెందారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలో కూడా అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.
వేగంగా వ్యాపిస్తోన్న ఒమిక్రాన్ XBB1.6
ఒమిక్రాన్ XBB1.6 వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్ని ఆక్సిజన్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి, వెంటిలేటర్ బెడ్‌ల స్థితిగతుల వివరాలు అందజేయాలని అధికారులు ఆదేశించారు. కేంద్రం ముందస్తు చర్యలకు ఆదేశిస్తే అనుసరించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా అకస్మాత్తుగా పెరుగుతున్న కేసులపై వదంతులను నమ్మవద్దని ఆరోగ్యశాఖ అధికారులు ప్రజలను కోరారు. ర్యాపిడ్ పరీక్షలపై ఆధారపడటం లేదని, కొవిడ్-19 కేసులను అధికారికంగా నిర్ధారించేందుకు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరి అని అధికారులు తెలిపారు.
రాష్ట్ర కొవిడ్-19 నోడల్ అధికారి డాక్టర్ కె.రాంబాబు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి సారించామన్నారు. పొరుగు రాష్ట్రాల్లో గణనీయ సంఖ్యలో కేసులు నమోదవుతున్నందున ఒక్కసారిగా కేసులు పెరిగే అవకాశం ఉందని.. అందుకు అనుగుణంగా కోవిడ్ -19 వార్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొవిడ్ -19 కేసుల చికిత్సలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలా అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని చెప్పారు. కరోనా వైరస్ బారిన పడకుండా తమను తాము రక్షించుకోవడానికి మాస్క్‌లను ఉపయోగించాలని, భౌతిక దూరం పాటించాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
అటు తెలంగాణలో అనుమానిత కేసులు పెరుగుతున్నప్పటికీ H3N2 (స్వైన్ ఫ్లూ సబ్ వేరియంట్) కేసుల నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా జరగడం లేదు. రోజుకు 500 కంటే తక్కువ పరీక్షలు నిర్వహిస్తుండటంతో కొన్ని వారాల్లో H3N2 కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. “ప్రస్తుతం, వైరస్ వేగంగా వ్యాపిస్తోంది, కేసులు గరిష్ట స్థాయికి చేరుకునే వరకు పరిస్థితిని గమనిస్తూనే ఉంటాం. సామాజిక దూరం, మాస్క్‌లు ధరించక పోవడం, చేతుల పరిశుభ్రత లేకపోవడం వల్ల వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి అనుకూలంగా ఉంటుంది. రాబోయే 3-4 వారాల పాటు కేసులు పెరుగుతూనే ఉంటాయి, ఆ తర్వాత కేసుల నమోదులో తగ్గుదల కనిపిస్తుంది” అని ఇన్ఫెక్షన్ కంట్రోల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ బుర్రి రంగారెడ్డి తెలిపారు.
అందుబాటులో లేని H3N2 నిర్ధారణ పరీక్ష
H3N2 నిర్ధారణ పరీక్ష ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో లేదు. దీని కోసం దాదాపు రూ.6,000 ఖర్చు అవుతుంది, ప్రస్తుతం రాష్ట్రంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో హెచ్3ఎన్2 పరీక్షలు జరుగుతుండగా, ఫీవర్ ఆస్పత్రితోపాటు మరో రెండు ఆసుపత్రుల్లో పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. “ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా కొన్ని నమూనాలను ఐపీఎంకి పంపుతారు, అయితే ఇవి 500 కంటే తక్కువ సంఖ్యలో ఉన్నాయి. పరీక్షల సంఖ్యను పెంచడంలో ఉన్న ఏకైక సమస్య ఏమిటంటే ఇది ఖరీదైనది కావడంతో పాటు టెస్టింగ్ కిట్‌ల సరఫరా పరిమితం. కేంద్ర ప్రభుత్వం వీటి సరఫరాను పెంచితే మా వద్ద ఉన్న వనరులతో H3N2 పరీక్షలతో పాటు డెంగ్యూ, చికున్‌గున్యా, కొవిడ్ -19 వంటి ఇతర వ్యాధి కారకాలను పరీక్షించడానికి అవకాశం ఉంటుంది” అని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. విస్తృతమైన పరీక్షలు లేనందున చాలా సందర్భాల్లో జ్వరం, దగ్గు, శ్వాసకోశ బాధతో కూడిన జలుబును H3N2 కేసులుగా పరిగణిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.