Daaku Mahaaraj Review - డాకు మహారాజ్ రివ్యూ: బాక్సాఫీస్ కింగ్ అయ్యే ఛాన్స్ ఉందా? బాలకృష్ణ సినిమా ఎలా ఉందంటే?
Daaku Mahaaraj Review In Telugu: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వం వహించిన డాకు మహారాజ్ థియేటర్లలో విడుదల అయింది.

బాబీ కొల్లి
బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, రవి కిషన్ తదితరులు
Balakrishna's Daaku Mahaaraj Movie Review In Telugu: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ సంక్రాంతికి వచ్చినప్పుడు ఎక్కువ శాతం మంచి విజయాలు అందుకున్నారు. మరి, ఈ సంక్రాంతి సంగతి ఏంటి? బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సినిమా 'డాకు మహారాజ్'. ఈ రోజు (జనవరి 12న) థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? కథ, కథనాలు, మాటలు ఎలా ఉన్నాయ్? బాలకృష్ణ, బాబీ డియోల్ రోల్స్ ఎలా ఉన్నాయి? వంటివి చూస్తే...
కథ (Daaku Maharaaj Story): మదనపల్లెలో ఓ చిన్నారి ప్రమాదంలో ఉందని ఫోన్ రావడంతో నానాజీ (బాలకృష్ణ) వస్తాడు. మూడు సార్లు ఆమెను ప్రమాదాల నుంచి కాపాడతాడు. మూడోసారి చిన్నారిని చంపడానికి వచ్చిన వ్యక్తి ఒకరు బల్వంత్ సింగ్ ఠాకూర్ (బాబీ డియోల్)కి ఫోన్ చేస్తాడు. 'డాకు మహారాజ్'ను చూశానని చెబుతాడు. అతడిని చంపేసి వస్తానని చెబుతాడు.
చంబల్ లోయలో ప్రజల నీటి కొరత తీర్చడానికి, అక్కడ డ్యామ్ కట్టడానికి వెళ్ళిన సివిల్ ఇంజనీర్ సీతారాం (బాలకృష్ణ), 'డాకు మహారాజ్'గా ఎలా మారాడు? అక్కడ ఠాకూర్ (బాబీ డియోల్) ఫ్యామిలీకి శత్రువుగా ఎందుకు మారాడు? అసలు ఠాకూర్ ఫ్యామిలీ ఏం చేస్తుంది? 'డాకు మహారాజ్' ప్రయాణంలో కలెక్టర్ నందిని (శ్రద్ధా శ్రీనాథ్), సీతారాం భార్య కావేరి (ప్రగ్యా జైస్వాల్) పాత్రలు ఏమిటి? ఆ చిన్నారి ఎవరి కుమార్తె? డాకు కోసం వెతుకుతూ మదనపల్లి వచ్చిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ స్టీఫెన్ రాజ్ (షైన్ టామ్ చాకో) ఏం తెలుసుకున్నాడు? డాకు మహారాజ్, బల్వంత్ సింగ్ మధ్య పోరాటంలో విజయం ఎవరిది? ఆ యుద్ధం వల్ల ఎవరెవరి ప్రాణాలు పోయాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Daaku Maharaaj Review Telugu): లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్లు చేయడం బాలకృష్ణకు కొత్త కాదు. వీరోచిత పోరాటాలు చేసే కథానాయకుడు ఐడెంటిటీ దాచి ఎవరో ఒకరికి ఇచ్చిన మాట కోసం సింపుల్ లైఫ్ లీడ్ చేసే కథలు ప్రేక్షకులకూ కొత్త కాదు. కథగా చూస్తే 'డాకు మహారాజ్'లో సర్‌ప్రైజ్ చేసే అంశాలు తక్కువ. కానీ, ఈ సినిమా ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేలా ఉంది. అందుకు కారణం... దర్శకుడు బాబీ టేకింగ్, తమన్ రీ రికార్డింగ్ అండ్ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కణ్ణన్ కెమెరా వర్క్.
హీరోయిజం ఎలివేట్ చేసే కమర్షియల్ సినిమాకు కావాల్సిన హంగులు ఉన్న రొటీన్ కథతో తీసిన సినిమా. ఆ కథను మర్చిపోయి కేవలం స్క్రీన్ మీద వచ్చే విజువల్స్ మాస్ ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా సినిమాను తీశారు. కంప్లీట్ కమర్షియల్ ఫార్మటులో కథ, కథనం, సన్నివేశాలు రూపొందించారు. అభిమానులు మెచ్చేలా, విజిల్స్ వేసేలా యాక్షన్ సీక్వెన్సులు డిజైన్ చేశారు. రొటీన్ కథ కాకుండా కొత్త కథ, క్యారెక్టర్ తీసుకుని ఆ స్థాయి విజువల్స్‌తో సినిమా చేస్తే సినిమా ఎక్కడికో వెళ్లిపోయేది. ఫస్టాఫ్‌లో యాక్షన్ బ్లాక్స్ హై ఇచ్చాయి. అయితే, సెకండాఫ్‌లో కథపై ఎక్కువ కాన్సంట్రేట్ చేసి ఎమోషనల్ డ్రామా వైపు తీసుకు వెళ్లారు. దాంతో ఇంటర్వెల్ తర్వాత లెంగ్త్ ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది.
బాలకృష్ణ నుంచి అభిమానులు ఆశించే హీరోయిజం, యాక్షన్ సీన్స్ ఇవ్వడంతో పాటు ఆయనతో భారీ డైలాగులు చెప్పించకుండా సెటిల్డ్ రోల్ చేయించి సక్సెస్ కొట్టారు బాబీ. విజయ్ కార్తీక్ కణ్ణన్ కలర్ గ్రేడింగ్, ఆ ఫ్రేమింగ్ బావుంది. సినిమాకు బిగ్గెస్ట్ అసెట్ అయ్యింది. తమన్ పాటల కంటే నేపథ్య సంగీతం బావుంది. బాలకృష్ణ హీరోయిజం ఎలివేట్ కావడంలో సూపర్ సక్సెస్ అయ్యింది. నిర్మాణంలో నాగవంశీ, సాయి సౌజన్య రాజీ పడలేదు. బాగా ఖర్చు పెట్టారు.
బాలకృష్ణకు ఇటువంటి క్యారెక్టర్లు చేయడం కొట్టిన పిండి. ఇంతకు ముందు చేశారు కూడా! అయితే ఆ సినిమాలకు, 'డాకు మహారాజ్'కు తేడా ఏమిటంటే... బాలకృష్ణ లుక్స్! ఆయన్ను హ్యాండ్సమ్‌గా చూపించారు. మూడు లుక్స్‌లో వేరియేషన్‌తో పాటు కథానుగుణంగా ఆయా సన్నివేశాలకు తగ్గట్టు సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశారు. బాలకృష్ణ సినిమాల్లో వినిపించే పంచ్ డైలాగ్స్ లేవు కానీ హీరోయిజం మాత్రం బాగా ఎలివేట్ చేశారు.
బాబీ డియోల్ కిల్లర్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. ఒక్క చూపుతో విలనిజం చూపించిన సన్నివేశాలు ఉన్నాయి. ప్రగ్యా జైస్వాల్ రోల్ రెగ్యులర్ అండ్ రొటీన్. శ్రద్ధా శ్రీనాథ్ ట్విస్టులతో కూడిన, కథలో కీలకమైన క్యారెక్టర్ చేశారు. పోలీస్ ఆఫీసర్ స్టీఫెన్ రాజ్ పాత్రలో షైన్ టామ్ చాకో కాసేపు కనిపించారు. చాందిని చౌదరి రోల్ చిన్నది. ఆ 'దబిడి దిబిడి' పాటకు, కొన్ని గ్లామరస్ సీన్లకు ఊర్వశి రౌతేలా పరిమితం అయ్యారు. రవి కిషన్, సచిన్ ఖేడేకర్, సందీప్ రాజ్, మకరంద్ దేశ్ పాండే, రవి కాలే, దివి వడ్త్య తదితరులు తమ పాత్రలకు తగ్గట్లు నటించారు.
కమర్షియల్ సినిమాల్లో నట సింహం బాలకృష్ణ సినిమాలది సపరేట్ జానర్. లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్లు, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, మాస్ సాంగ్స్ ఆయన సినిమాల్లో కామన్. ఆ కథలతో సరిగ్గా తీస్తే హిట్ రావడం గ్యారంటీ అని చెప్పడానికి ఉదాహరణలు కొన్ని ఉన్నాయి. అయితే, కమర్షియల్ కథను తీసుకుని విజువల్ పరంగా కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారు దర్శకుడు బాబీ కొల్లి. మ్యూజిక్, కెమెరా డిపార్ట్మెంట్స్ సహకారంతో యాక్షన్ ప్యాక్డ్ ఫిల్మ్ తీశారు. కమర్షియల్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే ప్రేక్షకులు, బాలకృష్ణ అభిమానులు హ్యాపీగా థియేటర్లకు వెళ్లొచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

