Chamkila Movie Review: ‘చమ్కీల’ మూవీ రివ్యూ - డబుల్ మీనింగ్ పాటలు పాడే ఆ సింగర్స్‌ను ఎందుకు చంపారు? మూవీ ఎలా ఉంది?
Chamkila Movie Review: పంజాబీ సింగర్ అమర్ సింగ్ చమ్కీల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమానే ‘చమ్కీల’. 28 ఏళ్లకే అసలు చమ్కీల హత్య ఎందుకు జరిగింది అనేదానిపై ఈ బయోపిక్ తెరకెక్కింది.
ఇంతియాజ్ అలీ
దిల్జీత్ దోసంజ్, పరిణీతి చోప్రా
Netflix
Chamkila Movie Review In Telugu: బాలీవుడ్ అనేది హిట్ల కోసం ఎక్కువగా కమర్షియల్ సినిమాలకంటే బయోపిక్స్, రీమేక్స్‌పైనే ఆధారపడుతుంది అన్నది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఈతరంలో ఎక్కువగా ఎవరికీ తెలియకుండా మిగిలిపోయిన ఎంతోమంది బయోపిక్స్‌ను తెరకెక్కించి.. వారి గురించి ప్రేక్షకులకు తెలిసేలా చేశారు బాలీవుడ్ మేకర్స్. ఇక ఆ లిస్ట్‌లోకి యాడ్ అయ్యింది తాజాగా విడుదలయిన ‘చమ్కీల’. దర్శకుడు ఇంతియాజ్ అలీ మామూలు కథనే గుండెకు హత్తుకునేలా తెరకెక్కించగలడు. అలాంటిది ఇలాంటి ఒక కాంట్రవర్షియల్ బయోపిక్‌తో అసలు చమ్కీల అంటే ఎవరో అందరికీ తెలిసేలా చేశాడు.
కథ..
1960లో ధని రామ్‌గా ఒక సిక్ దళిత కుటుంబంలో పుట్టిన వ్యక్తి.. 1980ల్లోకి వచ్చేసరికి అమర్ సింగ్ చమ్కీలా ఎలా మారాడు అనేది ‘చమ్కీల’ కథ. 1980ల్లోనే ఒక సింగర్‌గా చమ్కీలకు ఆ రేంజ్‌లో పాపులారిటీ రావడానికి కారణం.. తన డబుల్ మీనింగ్ పాటలే. ప్రేమపై మాత్రమే కాదు, లస్ట్‌పై కూడా పాటలు రాసి, వాటిని పాడుతూ అప్పట్లో సంచలనం సృష్టించాడు చమ్కీల. ప్రతీ ఊరిలో ఈవెంట్స్ ఏర్పాటు చేస్తూ.. ఇలాంటి పాటలు పాడుకుంటూ ఒక రేంజ్‌లో ఫేమస్ అయ్యారు. ఈ ప్రయాణంలో తన భార్య అమర్జోత్ కూడా ఆయనకు తోడు అయ్యారు. చమ్కీల డబుల్ మీనింగ్ పాటలు పాడుతున్నప్పుడు అమర్జోత్ కూడా ఆయనతో గొంతు కలిపారు. ఇక అమర్ సింగ్ చమ్కీలకు 28 ఏళ్లు ఉన్నప్పుడే.. అంటే 1988 మార్చి 8న మెహ్షంపూర్‌లో ఆయనను హత్య చేశారు. అసలు ఆయన హత్యకు దారితీసిన పరిణామాలు ఏంటి అనేది ‘చమ్కీల’ సినిమా కథ. ఈ మరణం వెనుక అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి. అసలు ఎందుకలా జరిగింది అని ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు ఇంతియాజ్ అలీ.
విశ్లేషణ..
మామూలుగా ఒక బయోపిక్‌కు ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించడం చాలా కష్టం. కానీ బాలీవుడ్ ఇన్నేళ్లుగా ఈ విషయంలో సక్సెస్ అవుతూనే వచ్చింది. ‘చమ్కీల’తో మరోసారి అదే ప్రూవ్ అయ్యింది. ఒక కమర్షియల్ సినిమాలా కాకుండా కాస్త డాక్యుమెంటరీ అనే ఫీల్ వచ్చేలాగా ‘చమ్కీల’ను తెరకెక్కించాడు దర్శకుడు ఇంతియాజ్ అలీ. అక్కడక్కడా అమర్ సింగ్ చమ్కీల జీవితంలో జరిగిన నిజమైన ఫుటేజ్‌ను చూపించడం వల్ల ఇదొక డాక్యుమెంటరీ అనే ఫీల్ వస్తుంది. మామూలుగా సింగర్ బయోపిక్ అంటే ఎలా ఉండాలో.. ‘చమ్కీల’ అచ్చం అలాగే ఉంటుంది. ఎక్కువగా పాటలతో మూవీ అంతా నిండిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ మ్యూజిక్ అంటే ఎక్కువగా ఇష్టపడి, ఎంజాయ్ చేసేవారికి ఇది పెద్ద సమస్యగా అనిపించకపోవచ్చు.
Also Read: ‘డెత్ విస్పరర్’ ఓటీటీ మూవీ రివ్యూ: పిల్లలను వెంటాడే ఆకారం, ఈ థాయ్ హర్రర్ మూవీ ఎలా ఉంది? కథేంటి?
అమర్ సింగ్ చమ్కీల జీవిత కథతో కబీర్ సింగ్ చౌదరీ ఇదివరకే ‘మెహ్షంపూర్’ అనే డాక్యుమెంటరీని తెరకెక్కించారు. ఇప్పుడు ఇంతియాజ్ అలీ.. తన స్టైల్‌లో చమ్కీల కథను ప్రేక్షకులకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఒక సింగర్‌కు మాత్రమే కాదు.. ప్రతీ ఆర్టిస్ట్‌కు తన ఆర్ట్ పట్ల ఎంత ప్రేమ ఉంటుందో అనే విషయాన్ని గుండెకు హత్తుకునే చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
ఆ ముగ్గురి కోసం..
‘చమ్కీల’లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరోహీరోయిన్లుగా నటించిన దిల్జీత్ దోసంజ్, పరిణీతి చోప్రా గురించి. దిల్జీత్ దోసంత్ ఒరిజినల్‌గానే పంజాబీ సింగర్ కాబట్టి ఈ పాత్ర కోసం తను పెద్దగా కష్టపడలేదు అనిపించింది. కానీ పరిణీతి చోప్రా విషయానికొస్తే.. తన కెరీర్ మొత్తంలో ఇలాంటి ఒక పాత్ర తను మళ్లీ చేయలేదేమో అన్న రేంజ్‌లో ఉంది. హీరోకు సమానంగా ప్రాధాన్యత ఉన్న పాత్ర రావడం ఒక ఎత్తు అయితే.. దానిని అంతే డెడికేషన్‌తో చేయడం మరో ఎత్తు. చమ్కీలగా దిల్జీత్ ఎంత కష్టపడ్డాడో.. అమర్జోత్‌గా పరిణీతి కూడా అంతే కృష్టి చేసిందని అర్థమవుతోంది. ఇక ‘చమ్కీల’కు ప్రాణంగా నిలిచిన మరో వ్యక్తి ఏఆర్ రెహమాన్. ఒక సింగర్ బయోపిక్ అంటే మ్యూజిక్ ఎలా ఉండాలి, పాటలు ఎలా ఉండాలి అనే విషయాన్ని రెహమాన్‌ను చూసి నేర్చుకోవాలి అనిపిస్తుంది. ప్రస్తుతం ‘చమ్కీల’.. హిందీతోపాటు తెలుగులో కూడా అందుబాటులో ఉంది. కానీ పంజాబీ పాటలను ఇతర భాషల్లో మార్చడానికి ప్రయత్నిస్తే వాటి ఫ్లేవర్ పోతుందని భావించిన మేకర్స్.. పాటలను మాత్రం డబ్ చేయలేదు. అందుకే ఇతర భాషల్లో చూసేవారు పాటలకు అంత కనెక్ట్ కాకపోవచ్చు.
Also Read: మైదాన్ రివ్యూ: ఫుట్‌బాల్ కోచ్ రహీమ్ బయోపిక్ - అజయ్ దేవగణ్ సినిమా ఎలా ఉందంటే?