Corona Virus: ఈ లక్షణాలు కరోనా వైరస్‌వే, చాలా మందికి వీటిపై అవగాహన లేదు
కరోనా వైరస్ ఇంకా మనల్ని వదల్లేదు. కేసులు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి.
కరోనా వైరస్ రెండేళ్ల పాటూ ప్రపంచాన్ని స్తంభించేలా చేసింది. ఇప్పుడిప్పుడే ఆ సంకెళ్ల నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోంది ప్రపంచం. అయినా కూడా ఇంకా కరోనా కేసులు బయటపడుతూనే ఉన్నాయి. కాలం గడుస్తున్న కొద్దీ వైరస్ మ్యుటేషన్ చెందుతూ కొత్త సబ్ వేరియంట్లుతో ఇంకా విరుచుకుపడుతూనే ఉంది. సబ్ వేరియంట్లు కూడా అనేక కొత్త లక్షణాలను ప్రదర్శిస్తూనే ఉన్నాయి. కోవిడ్ లక్షణాలు అంటే జ్వరం, దగ్గు, వాసన, రుచి లేకపోవడం, దగ్గు అని మాత్రమే అనుకుంటారు చాలామంది. కానీ కొన్ని కొత్త లక్షణాలు కూడా ఎప్పటికప్పుడు చేరుతున్నాయి. గొంతునొప్పి, ముక్కు దిబ్బడ, తలనొప్పి, ముక్కు కారడం కూడా కరోనా వైరస్ లక్షణాలుగా గుర్తించారు. ఈ లక్షణాలను సాధారణ ఫ్లూ లేదా జలుబుగా భావిస్తారు చాలా మంది. కానీ ఇవి కూడా కరోనా వచ్చినప్పుడు బయటపడేవే. ఇప్పుడు మరికొన్ని లక్షణాలు కూడా కొత్తగా కరోనా వైరస్ జాబితాలో చేరాయి. ఇవి కనిపించినా కూడా కోవిడ్ వచ్చిందేమో అనుమానించాల్సిందే.
1. చర్మం మీద ఎర్రటి దద్దుర్లు, చర్మం కమిలినట్టు ఎర్రగా మారడం జరుగుతుంటుంది. దీన్ని అలెర్జీగా కొట్టిపడేస్తారు. బ్రిటన్లో నిర్వహించిన ఒక అధ్యయనంలో ప్రతి అయిదుగురు కరోనా రోగుల్లో ఒకరికి దద్దుర్లు వచ్చినట్టు తేలింది. వీరిలో మరే ఇతర లక్షణాలు పెద్దగా బయటపడలేదు. కాలి వేళ్లపై ఎర్రని దద్దుర్లు వచ్చి అవి పుండ్లుగా మారిన సందర్భాలు కూడా గుర్తించారు.
2. గోళ్లలో కూడా కోవిడ్ లక్షణాలు బయటపడతాయి. మన శరీరానికి కరోనా వంటి వైరస్ లు సోకినప్పుడు శరీరం ఒత్తిడికి గురవుతుంది. వివిధ సంకేతాల ద్వారా ఆ ఒత్తిడిని బయటికి వ్యక్తీకరిస్తుంది. అలాగే చేతి వేలి గోళ్లపై కూడా ఆ ఒత్తిడి తాలూకు ప్రభావం పడుతుంది. గోళ్లు నున్నగా ఒకేలా ఉండకుండా మధ్యలో గీతల్లాగా వస్తాయి. చాలా తక్కువ మంది కోవిడ్ రోగుల్లో ఈ గోళ్ల లక్షణాలు బయటపడతాయి.
3. చాలా మంది ఈ లక్షణాన్ని గుర్తించలేరు.. అదే జుట్టు రాలడం. కోవిడ్ సోకినప్పుడు లేదా కొన్ని రోజులు గడిచాక జుట్టు రాలడం మొదలవుతుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య చాలా అధికంగా ఉంటుంది. దాదాపు 48 శాతం మందిలో ఈ లక్షణం కనిపించినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
4. చెవిలో అసాధారణంగా శబ్ధాలు వినిపించడం కూడా కోవిడ్ లక్షణమే. సరిగా వినిపించపోవడం, రింగుమనే శబ్ధాలు వినిపించడం, గుయ్ మనే శబ్ధాలు రావడం ఇవి కొన్ని నెలల పాటూ వేధించడం కోవిడ్ లక్షణాలుగానే చెబుతున్నారు అధ్యయనకర్తలు. ఈ సమస్యలను టినిటస్ అంటారు. కరోనా తగ్గాక కూడా చెవి సమస్యలు బాధపడుతున్న వారు అధికంగానే ఉన్నారు.
Also read: వేల తేనెటీగల కష్టమే మనం తాగే స్పూను తేనె, నేడు తేనెటీగల దినోత్సవం