Fertility: గర్భం ధరించలేకపోతున్నారా? ఒత్తిడి కారణమేమో చూసుకోండి
ఒత్తిడి వల్ల శారీరక, మానసిక రోగాలున్నో దాడి చేస్తాయి. వాటిలో పిల్లలు కలగకపోవడం కూడా ఒకటి.
ఒత్తిడి... కనిపించని శత్రువు. ఇది ఎన్నో రోగాలకు కారణం. ఇప్పుడు ఆడవారిలో గర్భం రాకుండా అడ్డుకుంటోందని కూడా బయటపడింది. అధిక ఒత్తిడికి గురయ్యే మహిళలు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నా, పునరుత్పత్తి వ్యవస్థలో ఎలాంటి లోపాలు లేకున్నా కూడా గర్భం ధరించలేరని ఒక కొత్త అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనం తాలూకు పరిశోధనా ఫలితాలు ‘ఎండోక్రైన్ సొసైటీ జర్నల్, ఎండోక్రినాలజీ ’లో ప్రచురించారు. మొదట ఎలుకలపై ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. అందులో ఆడ ఎలుక అండాశయ నిల్వలపై ఒత్తిడిని పెంచారు. అధిక ఒత్తిడికి గురిచేసే అరుపులు వాటికి వినిపించారు. అలా దాదాపు మూడు వారాల పాటూ కొనసాగించారు. అవి వాటి సెక్స్ హార్మోన్లపై ప్రభావం చూపించింది. ఆడ ఎలుకల్లో అండాశయ నిల్వలు తగ్గి పోయాయి, తద్వారా సంతానోత్పత్తి కూడా తగ్గిపోయింది. దీన్ని బట్టి అధిక ఒత్తిడి సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తాయని తేలింది.
ఆ స్థాయిలు తగ్గి...
అరుపులు విన్న ఎలుకల్లో ఈస్ట్రోజెన్, యాంటీ ముల్లెరియన్ హార్మోన్ల స్థాయిలు తగ్గినట్టు గుర్తించారు. ఈస్ట్రోజెన్ అనేది చాలా కొన్ని హార్మోన్ల సమూహం. ఇది పెరుగుదల, పునరుత్పత్తి వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక యాంటీ ముల్లేరియన్ హార్మోన్ పునరుత్పత్తి అవయవాలను ఏర్పరడచంలో సహాయపడే అండాశయాలచే తయారైన హార్మోన్. ఈ రెండు హార్మోన్లు తగ్గిపోతే గర్భం ధరించడం కష్టం అవుతుంది.
ఈ పరిశోధనల ఆధారంగా మహిళల్లో కూడా ఒత్తిడి అధికమైతే వారు గర్భం ధరించే అవకాశాలు తగ్గిపోతాయని చెబుతున్నారు పరిశోధకులు. దీర్ఘకాలిక ఒత్తిడి అండాశయంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందుకే గర్భం ధరించాలనుకునే మహిళలు కచ్చితంగా ఒత్తిడిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అండాశయ నిల్వలు తగ్గితే అంటే అండాల సంఖ్య తగ్గితే అది పునరుత్పత్తిపై చాలా ప్రభావం చూపిస్తుంది.
తల్లి కావాలని భావిస్తున్న మహిళలు మూడు నెలల ముందు నుంచే మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. అనవసర గొడవలకు దిగద్దు. పెద్ద అరుపులతో వాదులాడుకుంటున్న వారి దగ్గర ఉండొద్దు. వారి అరుపులు కూడా మీలో టెన్షన్ పెంచుతాయి. తెలియకుండా ఒత్తిడికి గురవుతారు. అలాగే ఇంట్లో గొడవయ్యే పరిస్థితులు ఉంటే ఆ పరిస్థితి నుంచి దూరంగా వెళ్లిపోండి. ఒక గదిలోకి వెళ్లి ఒంటరిగా ఫోనులో పాటలు వినడమో, పుస్తకాలు చదవడమో చేసుకోండి. మీరు ఎంతగా ఒత్తిడిని తగ్గించుకుంటే అంత త్వరగా తల్లి కాగలుగుతారు.
Also read: వానలో ఈ గొడుగేసుకుంటే తడిసిపోతాం, ధర మాత్రం రూ.లక్షపైనే
Also read: ఈ ఆహారపదార్థాలలో పెయిన్ కిల్లర్స్ లక్షణాలు అధికం, నొప్పిని తగ్గిస్తాయి