Kids: శీతాకాలంలో పిల్లలకు చెవి ఇన్ఫెక్షన్లు - నొప్పి అని చెబితే నిర్లక్ష్యం వద్దు
చలికాలం వచ్చిందంటే జలుబు దగ్గుతో పాటూ చెవి ఇన్ఫెక్షన్లు కూడా దాడి చేస్తాయి.
పిల్లల్లో చెవి ఇన్ఫెక్షన్లు త్వరగా వస్తాయి. కానీ వీటిని అంత సీరియస్‌గా తీసుకోరు తల్లిదండ్రులు. ఇలా తేలికగా తీసుకోవడం వల్ల పిల్లల కర్ణభేరి ప్రభావితమై, వినికిడి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చలికాలంలో గొంతునొప్పి, జ్వరం, దగ్గు, జలుబు ఎటాక్ చేస్తాయి. వీటి వల్ల చెవి వెనుక అంటే కర్ణభేరి వెనకాల ద్రవం పేరుకుపోయే అవకాశం ఉంది. దీని వల్ల చెవి లోపల ఉబ్బిపోతుంది. అలాగే నొప్పి కూడా వస్తుంది. పిల్లలు నొప్పి అని చెప్పినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులకు చూపించాలి.
కేవలం జ్వరంతో పాటూ కూడా చెవినొప్పి రావచ్చు. అప్పుడు కూడా ఇన్ఫెక్షన్ వచ్చిందేమో వైద్యులకు చూపించాలి. కర్ణభేరికి ఏమైనా అయితే వారికి భవిష్యత్తుపై చాలా ప్రభావం పడుతుంది. వైద్యులు ఓటోస్కోప్ సాయంతో కర్ణభేరిని పరిశీలిస్తారు. చెవి ఇన్ఫెక్షన్ ఉందో లేదో చూస్తారు. అలాగే చెవిలోకి గాలి పంపడం ద్వారా కర్ణభేరి వెనకాల ద్రవం పేరుకుందో లేదో చెక్ చేస్తారు. ఇన్ఫెక్షన్ సోకితే ప్రాథమిక దశలోనే గుర్తించాలి. బ్యాక్టిరియాల వల్లే ఇన్ఫెక్షన్ సోకుతుంది. కాబట్టి యాంటీ బయోటిక్స్‌తో ఇన్ఫెక్షన్ నయమైపోతుంది. కర్ణభేరికి కూడా ఇన్ఫెక్షన్ సోకే వరకు ఆలస్యం చేయకూడదు. కాబట్టి జలుబు, జ్వరం వచ్చే వాటి మేరకు మాత్రమే వైద్యులకు చూపించడం కాదు, చెవిని కూడా చెక్ చేయమని అడగడం మంచిది.
ఇవి పెట్టొద్దు...
పిల్లలు చెవినొప్పి అన్నప్పుడు చల్లటి పదార్థాలు, పుల్లటి ఆహారం తినిపించకూడదు. వాటివల్ల సమస్య ఇంకా పెరుగుతుంది. జలుబు, గొంతునొప్పి వచ్చినప్పుడు చెవి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. పుల్లటి, చల్లటి పదార్థాలు తినిపించడం వల్ల జలుబు, గొంతు సమస్యలు పెరుగుతాయి కాబట్టి చెవికి కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే స్నానం చేసేటప్పుడు చెవిలోకి నీళ్లు పోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అధిక శబ్ధాలున్నచోట కూడా పిల్లలు ఉంచకూడదు.
చెవిలో గులిమి గట్టిగా మారి రాయిలా పేరుకుపోవడం వల్ల కూడా చెవిపోటు వస్తుంది. అలాంటి సమయంలో ఇయర్ డ్రాప్స్ ఇస్తారు. అవి నొప్పిని తగ్గించి గట్టిగా మారిన గులిమిని మెత్తగా చేసి, చెవి ముందుకు వచ్చేలా చేస్తుంది. అప్పుడు దాన్ని తొలగిస్తారు వైద్యులు. ఇలాంటి సమయంలో చెవి మూసుకుపోయినట్టు అయి సరిగా వినిపించదు.
Also read: ప్రొటీన్ పొడి తీసుకుంటున్నారా? ఎక్కువ కాలం వాడితే ఈ సమస్యలు వచ్చే అవకాశం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.