Nandamuri Kalyan Ram : నేను రొమాంటిక్ సినిమాలు చేయను - నందమూరి కళ్యాణ్ రామ్
Kalyan Ram Said No To Romantic Movies: తాను రొమాంటిక్ సినిమాలు చేయనని నందమూరి కళ్యాణ్ రామ్ స్పష్టం చేశారు. ఆగస్టు 5న 'బింబిసార' విడుదల కానున్న సందర్భంగా చాలా విషయాలపై ఆయన మాట్లాడారు.
''నేను రొమాంటిక్ సినిమాలు చేయను. దట్స్ వెరీ క్లియర్ (ఆ విషయంలో మరో సందేహానికి తావు లేదని అన్నట్టు!). నా జీవితంలో చాలా చేదు అనుభవం ఉంది. రొమాంటిక్ సినిమాలకు నేను సూట్ అవ్వనని నాకు క్లారిటీ ఉంది'' అని హీరో నందమూరి కళ్యాణ్ రామ్ చెప్పారు. ఆయన నటించిన 'బింబిసార' ఈ శుక్రవారం (ఆగస్టు 5న) విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
'బింబిసార'లో కూడా రొమాంటిక్ సీన్స్ లేవని, రొమాన్స్ ఎక్కువ లేదని నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) తెలిపారు. ఇందులో ఆయన డ్యూయల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. మహారాజు పాత్రకు జోడీగా హీరోయిన్ కేథరిన్ ట్రెసా నటించారు. కళ్యాణ్ రామ్, కేథరిన్ మధ్య 'ఓ తేన పలుకుల...' సాంగ్ ఉంది. ఆల్రెడీ విడుదలైన ఆ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. అది చూసి రొమాన్స్ ఎక్కువ ఉందని అనుకోవద్దని కళ్యాణ్ రామ్ చెప్పారు.
రాజు గెటప్‌లో కళ్యాణ్ రామ్ సెట్ అవుతాడా?
'బింబిసార'లో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఒకరు కేథరిన్ కాగా... మరొకరు 'భీమ్లా నాయక్' ఫేమ్ సంయుక్తా మీనన్. ఇద్దరూ స్టార్ హీరోయిన్స్ కాదు! 'బింబిసార' లాంటి వెయిటేజ్ ఉన్న సోషియో ఫాంటసీ సినిమాకు స్టార్ హీరోయిన్స్ ఉంటే థియేటర్లకు ఎక్కువ మంది ప్రేక్షకులు ఆశిస్తారు? అని ఒకరు ప్రశ్నించగా... తాను అటువంటివి నమ్మనని, ప్రేక్షకులు ఏమీ ఆశించరని కళ్యాణ్ రామ్ చెప్పారు.
''రాజు గెటప్‌లో కళ్యాణ్ రామ్ సెట్ అవుతాడా? మీరు ఎక్స్‌పెక్ట్ చేశారా? నేనూ అంతే! చిన్నా పెద్దా అని నేను నమ్మను. ఈ రోజు పెద్దవాళ్ళు ఒకప్పుడు చిన్నవాళ్ళే కదా! తమ నటనతో, ప్రతిభతో పెద్దవాళ్ళు అయ్యారు. మా క్యారెక్టర్లకు తగ్గట్టు, మా నిర్మాణ వ్యయానికి తగ్గట్టు మేం హీరోయిన్లు ఎంపిక చేసుకున్నాం'' అని కళ్యాణ్ రామ్ వివరించారు.
'బింబిసార' సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు చూశారు. వాళ్ళిద్దరూ సినిమా గురించి గొప్పగా చెప్పారు. కళ్యాణ్ రామ్ కూడా సినిమా ఫలితంపై చాలా నమ్మకంగా ఉన్నారు.
Also Read : కళ్యాణ్ రామ్ 'బింబిసార' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఎన్ని కోట్లకు అమ్మారు?
నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె నిర్మించిన 'బింబిసార' ద్వారా వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి చిరంతన్ భట్ స్వరాలు అందించారు. ఎం.ఎం. కీరవాణి నేపథ్య సంగీతం అందించారు. ఈ చిత్రానికి ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్.
Also Read : అభిమానికి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తున్న అక్కినేని నాగార్జున