Chiranjeevi: నేను ఈ జన్మంతా రాజకీయాలకు దూరమే... నా బదులు పవన్ ఉన్నాడు - చిరంజీవి మెగా పొలిటికల్ స్టేట్మెంట్
Chiranjeevi On Politics: చిరంజీవి రాజకీయాల గురించి మరోసారి మాట్లాడారు. జన్మంతా రాజకీయాలకు దూరమేనని తన బదులు పవన్ ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇంతకీ చిరు ఏమన్నారు? ఎందుకు అన్నారు? అంటే...

ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటూ... సినిమాలకు అతి దగ్గరగా ఉంటూ... అక్కున చేర్చుకుంటూ... ఆ కళామతల్లితో ఉంటాను - బ్రహ్మానందంతో పాటు ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) స్పష్టంగా చెప్పిన మాటలివి. ఎందుకు ఆయన ఈ విధంగా చెప్పారు? రాజకీయాల గురించి ఆయన ఎందుకు ఇలా చెప్పవలసి వచ్చింది? అంటే...
రాజకీయాల్లోకి వెళతాననే సందేహాలు వద్దు!
దేశంలో అగ్ర నేతలతో చిరంజీవి ఇటీవల కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి సంబరాలలో ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి చిరంజీవి పాల్గొన్నారు. అంతే కాదు... ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి రెండు మూడు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో చిరు రాజకీయ ప్రయాణం గురించి చర్చ మరొకసారి తెరపైకి వచ్చింది.
చిరంజీవికి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాజ్యసభ సభ్యత్వాన్ని ఆఫర్ చేసిందనే పుకార్లు షికార్లు చేశాయి. మరొక వైపు కాంగ్రెస్ పార్టీలోనే ఆయన కొనసాగుతున్నారని, తన ప్రాథమిక సభ్యత్వానికి ఆయన ఇంకా రాజీనామా చేయలేదని, అందువల్ల ఆయనను కాంగ్రెస్ సభ్యుడిగా చూడాలని ప్రచారం సైతం మొదలైంది. ఇటీవల జరిగిన లైలా ప్రీ రిలీజ్ వేడుకలో ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందిందని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో చిరు మళ్ళి రాజకీయాలలోకి రావాలని భావిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. దాంతో ఇక ఈ జన్మలో తాను రాజకీయాలలోకి వచ్చేది లేదని చిరంజీవి స్పష్టంగా చెప్పేశారు.
రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు!
''చాలా మందికి డౌట్లు వస్తున్నాయి... ఏంటి అటు వెళ్తాడా? అని! పెద్ద పెద్ద వాళ్లు అందరికీ దగ్గర అవుతున్నాననీ, నన్ను వాళ్ళందరూ దగ్గర చేసుకుంటున్నారని ఏవేవో అనుకుంటున్నారు. సేవలు అందించడం కోసం తప్ప మరో ఉద్దేశం లేదు. నేను రాజకీయంగా వెళ్లడం అనేది లేదు. ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దు. రాజకీయంగా ముందుకు వెళ్లడానికి, నేను అనుకున్న లక్ష్యాలు సాధించడానికి, నేను అనుకున్న సేవ చేయడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు'' అని చిరంజీవి తెలిపారు.
Also Read: నాగ చైతన్యతో 'తెనాలి రామకృష్ణ' రీమేక్... 'తండేల్' సక్సెస్ మీట్‌లో కన్ఫర్మ్ చేసిన దర్శకుడు
కొత్త దర్శకులతో పని చేయాలని ఉంది!
తనకు కొత్త దర్శకులతో పని చేయాలని ఉందనే ఆకాంక్షను 'బ్రహ్మ ఆనందం' వేడుకలో చిరంజీవి బయట పెట్టారు. రాజకీయాలలో ఉన్నప్పుడు తాను ఒత్తిడికి గురయ్యానని, నవ్వడం అనేది మానేశానని తన భార్య అంటే తనలో హాస్య గ్రంథులు పోయాయేమోనని సందేహం కలిగిందన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోయే సినిమాలో వింటేజ్ చిరంజీవిని చూస్తారని ఆయన చెప్పుకొచ్చారు. నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ త్వరగా పూర్తి చేస్తే నాతో ఏమైనా సినిమా చేసే ఆలోచన అతడిలో కలుగుతుందేమోనని సరదాగా చిరు వ్యాఖ్యానించారు.
Also Read: బాలీవుడ్ దర్శకుడితో రామ్ చరణ్ భారీ మైథలాజికల్ ఫిల్మ్... సుక్కుతో సినిమా కంటే ముందు?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

