
Anni Manchi Sakunamule teaser: ఆహా ఎంత బాగుంది, ఆకట్టుకుంటున్న ‘అన్నీ మంచిశకునములే’ టీజర్!
సంతోష్ శోభన్, మాళవికా నాయర్ హీరో హీరోయిన్లుగా నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘అన్నీ మంచిశకునములే’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల అయ్యింది.

‘సీతారామం’ నిర్మాతల నుంచి మరో చక్కటి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గత సంవత్సరం ‘సీతారామం’ సినిమాతో కనీవినీ ఎరుగని రీతిలో విజయాన్ని అందుకున్న వైజయంతి మూవీస్ సంస్థ, ప్రస్తుతం మరో చక్కటి ఫ్యామిలీ డ్రామాను నిర్మిస్తోంది. ‘అన్నీ మంచి శకునములే’ పేరుతో రూపొందిన ఈ సినిమా, మే 18న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల అయ్యింది. ఈ టీజర్ చూసిన వారంతా సింప్లీ సూపర్బ్ అంటున్నారు.
View this post on Instagram
టీజర్ రిలీజ్ చేసిన ‘సీతారామం’ హీరో
యంగ్ హీరో సంతోష్ శోభన్ వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. రీసెంట్ గా ‘కళ్యాణం కమనీయం’, ‘శ్రీదేవి శోభన్‌బాబు’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, ఈ రెండు సినిమాలు ఆడియెన్స్ ను పెద్దగా అలరించలేకపోయాయి. అయినా, హిట్, ఫట్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా ‘అన్నీ మంచి శకునములే’. ‘సీతారామం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను నిర్మించిన వైజయంతి మూవీస్ కు చెందిన స్వప్న సినిమా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆమె పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘సీతారామం’ హీరో దుల్కర్ సల్మాన్ ఈ టీజర్‌ను రిలీజ్ చేశారు.
ఆద్యంతం కనువిందు చేసిన టీజర్
ఇక ‘అన్నీ మంచి శకునములే’ సినిమా టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. చూస్తున్నంత సేపు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తోంది. ఈ టీజర్ పరిశీలిస్తే, వైజయంతి మూవీస్ నుంచి మరో చక్కటి సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. కుటుంబ కథ, చక్కటి కామెడీతో చూస్తూనే ఉండాలి అనిపించేలా ఉంది. టీజర్ ఆద్యంతం నిండుగా కనిపిస్తూ ఆకట్టుకుంది. తన సినిమాల్లో ఎమోషన్ ను పండించడంలో ముందుంటుంది నందినిరెడ్డి. తన గత సినిమాల్లో మాదిరిగానే ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మండే ఎండలో చల్లటి పైరగాలిలా..
ఈ సినిమాలో సంతోష్ శోభన్ సరసన మాళవికా నాయర్ చక్కగా సూటైనట్లు కనిపిస్తోంది. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకారు జానకి, వాసుకి, వెన్నెల కిషోర్, రమ్య సుబ్రమణియన్, అంజు ఆల్వా నాయక్, అశ్విన్ కుమార్ సహా పలువురు నటీనటులు ఇందులో నటించారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. లక్ష్మీ భూపాల మాటలు అందించారు. సన్నీ కూరపాటి, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. జునైద్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ వేసవిలో ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఎర్రటి ఎండ వేళ ఈ సినిమా ప్రేక్షకులకు చల్లటి పైరగాలి అందించేలా ఉండబోతోంది.
Read Also: చావు అంచుల్లోకి వెళ్లి వచ్చా, గుండె పోటుపై సుస్మితా సేన్ ఎమోషనల్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

