SLBC Rescue operation: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో అతికష్టమ్మీద టీబీఎం వద్దకు చేరుకున్న NDRF టీమ్స్, కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్
SLBC Tunnel Collapse Rescue operation | ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. లోపల మట్టి, బురద, నీరు పేరుకుపోయాయని, వాటిని తోడితే గానీ లోపల చిక్కుకున్న వారిని కాపాడటం కష్టం.

SLBC Tunnel Collapse | నాగర్ కర్నూలు: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) సొరంగ మార్గంలో శనివారం ప్రమాదం జరిగింది. దాదాపు 42 మంది కార్మికులు సురక్షితంగా బయటపడగా, మరో 8 మంది టన్నెల్ లోపల చిక్కుకుపోవడంతో ఆందోళన నెలకొంది. వారిని కాపాడేందుకు ఆదివారం నాడు టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్స్ ఇదివరకే లోకో ట్రైన్‌లో 11 కి.మీ వరకు వెళ్లాయి. అక్కడి నుంచి వెళ్లేందుకు అవకాశం లేదు. దాదాపు 3 అడుగుల స్థాయిలో నీరు నిలిచి ఉండటంతో 11 కిలోమీటర్ల వద్ద నుంచి 14 కిలోమీటర్ల వరకు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్లారు. ఫైనల్‌గా టన్నెల్ బోరింగ్ మిషన్ (TBM) వద్దకు ఎన్టీఆర్‌ఎఫ్ టీమ్స్ చేరుకున్నాయి.
టీబీఎం వద్దకు ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్స్
టన్నెల్ బోరింగ్ మిషన్ వద్ద రెండు వైపులా బురద, మట్టితో నిండిపోయింది. టన్నెల్ పైకప్పు కూలిన ప్రమాదంలో బోరింగ్ మిషన్ వెనుక భాగం తిన్నట్లు తెలుస్తోంది. మరోవైపు టన్నెల్ బోరింగ్ మిషన్ 80, 100 మీటర్ల మేర వెనుకకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎంతో కష్టపడి టీబీఎం ముందు వైపునకు ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్స్ చేరుకున్నాయి. అయితే 14వ కిలోమీటర్ వద్ద టన్నెల్ లోపల పేరుకుపోయిన బురద, మట్టి, నీటిని తోడితేనే లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు వీలుంటుంది. వాటిని ఎలా తోడాలనే దానిపై రెస్క్యూ టీమ్ శ్రమిస్తోంది.
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్‌లో శనివారం ప్రమాదం జరిగింది. టన్నెల్ లో కార్మికులు తవ్వకాలు చేస్తున్న సమయంలో 14వ కిలోమీటరు వద్ద పైకప్పు దాదాపు 3 మీటర్ల మేర ఒక్కసారిగా కుప్పకూలింది. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట లోని SLBC ఇన్‌లెట్ సొరంగంలో ఈ ఘటన జరిగింది. దాంతో లోపల ఉన్న 50 మందిలో 42 మంది కొంతదూరం పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడి నుంచి లోకో ట్రైన్‌లో బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ టన్నెల్ బోరింగ్ మిషన్ కు అవతల వైపున ఉన్న మరో 8 మంది మాత్రం లోపలే చిక్కుకుపోయారు.
నీటి లీకేజీలు కొనసాగుతున్నాయి, మరోవైపు మట్టి కూడా ఉబికి రావడంతో పైకప్పు కాంక్రీట్ సెగ్మెంట్స్ కుప్పకూలాయని లోపల పనిచేసిన సిబ్బంది తెలిపారు. పని ప్రదేశంలో దాదాపు 10 సీసీ బ్లాకులు ఒక్కసారిగా కూలిపోవడంతో చాలా ప్రాంతం మేర మీటర్ల మేర నీరు, మట్టి, బురద కూరుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. లోపల చిక్కుకుపోయిన 8 మందిలో రాబిన్‌సన్ కంపెనీ, జయప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్ కి చెందిన ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు సిబ్బంది ఉన్నారు.
ప్రమాదంలో చిక్కుకున్న ఆ ఎనిమిది మంది వివరాలను మీడియాకు అందించారు.
1- మనోజ్ కుమార్ (PE) ఉత్తర ప్రదేశ్ ప్రాజెక్ట్ ఇంజినీర్
2- శ్రీనివాస్ (PE) ఉత్తర ప్రదేశ్ ప్రాజెక్ట్ ఇంజినీర్
3- సందీప్ సాహు (కార్మికుడు)జార్ఖండ్
4- జటాక్స్ (కార్మికుడు)జార్ఖండ్
5- సంతోష్ సాహు (కార్మికుడు)జార్ఖండ్
6- అనూజ్ సాహు (కార్మికుడు)జార్ఖండ్
7- సన్నీ సింగ్ (కార్మికుడు)జమ్మూ కాశ్మీర్
8- గురుప్రీత్ సింగ్ (కార్మికుడు)పంజాబ్
Also Read: SLBC Tunnel Accident: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

