Amaravati Outer Ring Road: అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మాణంలో కీలక పరిణామం, హైదరాబాద్ ORRను మించేలా మాస్టర్ ప్లాన్
Amaravati ORR | అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ను మించేలా అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణానికి ప్లాన్ చేశారు.

Amaravati Outer Ring Road News | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు (Amaravati ORR) నిర్మాణం దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమరావతి ఓఆర్‌ఆర్ భూసేకరణకు సంబంధించి 5 జిల్లాలకు ఐదుగురు జాయింట్ కలెక్టర్లను అధికారులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. పల్నాడు, గుంటూరు, ఏలూరు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని 23 మండలాల్లో, 121 గ్రామాల మీదుగా అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మాణం జరగనుంది. ఏపీ ప్రభుత్వం 189.9 కిలోమీటర్ల పొడవున ఈ ఓఆర్ఆర్ కు శ్రీకారం చుట్టింది. కాగా, హైదరాబాద్ ఓఆర్ఆర్ పొడవు 158 కిలోమీటర్లు అని తెలిసిందే.
3 ఎలైన్‌మెంట్లను తయారు చేసిన NHAI
ప్రస్తుతం ఉన్న కోల్‌కతా- చెన్నై నేషనల్ హైవే నుంచి అమరావతి ఓఆర్‌ఆర్‌కి దక్షిణం, తూర్పు దిశల మధ్యలో రెండు లింక్ రోడ్లు నిర్మించనున్నారు. ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ 189.9 కి.మీ. ఓఆర్‌ఆర్‌కు ఇటీవల ఆమోదం తెలపగా.. విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణం అక్కర్లేదని స్పష్టం చేసింది. అందుకు ప్రత్యామ్నాయంగా 2 లింక్ రోడ్ల నిర్మాణం చేసుకోవాలని సూచించింది. హైదరాబాద్‌లో గచ్చిబౌలి వైపు నుంచి ఓఆర్‌ఆర్ (Hyderabad Outer Ring Road)కి లింకు చేసినట్లుగా చెన్నై- కోల్‌కతా నేషనల్ హైవేలో విజయవాడ బైపాస్ కోసం కాజ నుంచి తెనాలి సమీపంలోని నందివెలుగు వరకు 17 కిలోమీటర్ల మేర 6 లేన్ల లింక్ రోడ్డు నిర్మించనున్నారు. ఇందుకోసం ఎన్‌హెచ్‌ఏఐ 3 ఎలైన్‌మెంట్లను తయారు చేసి ఏపీ ప్రభుత్వానికి పంపింది. గుంటూరు బైపాస్ మార్గంలో బుడంపాడు నుంచి నారాకోడూరు వద్ద ORR వరకు 4 లేన్ల రహదారిని అభివృద్ధి చేయడానికిగానూ 3 ఎలైన్‌మెంట్లు సైతం సిద్ధం చేశారు.
ఓఆర్‌ఆర్ భూసేకరణకు త్వరలో నోటిఫికేషన్లు
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నుంచి వెళ్లిన అమరావతి ఓఆర్‌ఆర్ ఎలైన్‌మెంట్‌లో స్వల్ప మార్పులుచేర్పులు, లింక్‌రోడ్ల ఎలైన్‌మెంట్‌ల ప్రపోజల్ కు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. అనంతరం ప్రతిపాదిత అలైన్‌మైంట్ వివరాలను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపి తుది ఆమోదం పొందాల్సి ఉంటుంది. అమరావతి ఓఆర్‌ఆర్ భూసేకరణకు సర్వే నంబర్ల వారీగా నోటిఫికేషన్ జారీ కానున్నాయి. మూడు వారాల గడువుతో అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారితో సమావేశమై వారి సమస్య విని.. వాటిని జేసీ, ఎన్‌హెచ్‌ఏఐ స్థాయిలో చర్చించి పరిష్కారం చూపుతారు.
మరోవైపు జాయింట్ మెజర్‌మెంట్ సర్వే చేసి, పెగ్ మార్కింగ్ వేయాలి. అభ్యంతరాలు పరిష్కారమైతే త్రీడీ నోటిఫికేషన్ (3D Notification) జారీ చేస్తారు. దాంతో అందులో పేర్కొన్న సర్వే నంబర్లలో ఉన్న భూములు కేంద్రం అధీనంలోకి వెళ్తుంది. తర్వాత 3జి3 నోటిఫికేషన్ జారీతో పరిహారం ఇచ్చేందుకు అవార్డు జారీ చేయనున్నారు. ఎవరి పేరిట ఎంత భూమి ఉంది, ఏ నిర్మాణాలున్నాయి అనేది అందులో పేర్కొంటారు. చివరగా భూసేకరణ నిధుల కోసం పూర్తి వివరాలు ఎన్‌హెచ్‌ఏఐకి పంపి.. నగదు రాగానే భూ యజమానులకు చెల్లిస్తారు. దాంతో భూములను ఆధీనంలోకి తీసుకొని, ఎన్‌హెచ్‌ఏఐ పేరిట మ్యుటేషన్ చేయనున్నారు. మరోవైపు డీపీఆర్ సిద్ధం చేస్తూ, ఇతరత్రా పనులకు అనుమతులను సంబంధిత ఇంజినీర్లు తీసుకుంటారు.






















