Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Telagngana High Court dismissed Mohan Babu anticipatory bail petition | జర్నలిస్టుపై దాడి కేసులో తనను అరెస్ట్ చేయకుండా చూడాలని మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
Mohan Babu anticipatory bail petition dismissed by Telangana High Court | హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దరఖాస్తు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ తెలిపారు. జర్నలిస్టు రంజిత్ పై దాడి కేసులో మోహన్ బాబుపై కేసు నమోదు కావడం తెలిసిందే. తాను ప్రస్తుతం భారత్‌లోనే ఉన్నానని మోహన్ బాబు అఫిడవిట్ దాఖలు చేశారు. తన మనవరాలిని చూసేందుకు దుబాయ్ వెళ్లి తిరిగొచ్చిన తాను ప్రస్తుతం తిరుపతిలోనే ఉన్నానని కోర్టుకు స్పష్టం చేశారు.
ఫాం హౌస్ వద్ద జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి
జల్‌పల్లిలోని తన ఫాం హౌస్‌లో న్యూస్ కవరేజీ కోసం వచ్చిన ఓ మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేశారు. నమస్కారం అంటూ దగ్గరికి వచ్చిన మోహన్ బాబు ఒక్కసారిగా జర్నలిస్టు చేతిలో మైకు లాక్కొని తలపై బలంగా కొట్టారు. ఈ ఘటనలో గాయపడిన జర్నలిస్టు రంజిత్ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి సర్జరీ చేయించుకున్నాడు. తాను వయసులో పెద్దవాడినని, కుటుంబ సమస్యలతో సతమతం అవుతున్నాను. ఆ సమయంలో న్యూస్ కవరేజీకి వచ్చి మైక్ ముందు పెట్టడంతో ఆవేశానికి లోనై దాడి చేసినట్లు మోహన్ బాబు తెలిపారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి జర్నలిస్టు రంజిత్‌ను, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. తాను చేసిన తప్పిదానికి క్షమాపణ చెప్పారు. ఎవరిపైనా తనకు వ్యక్తిగతంగా కోపం లేదని, కానీ కొన్ని కారణాలతో ఆ సమయంలో అలా జరిగిపోయిందన్నారు.
జర్నలిస్టుపై దాడితో అప్రమత్తమైన రాచకొండ పోలీసులు మోహన్ బాబుకు నోటీసులు జారీ చేశారు. ఆయన వద్ద ఉన్న రెండు లైసెన్సుడ్ గన్స్ సరెండర్ చేయకపోతే వారంట్ జారీ చేసి అరెస్టు చేస్తామని హెచ్చరించారు. రాచకొండ సీపీ హెచ్చరికలతో అప్రమత్తమైన మంచు మోహన్ బాబు హైదరాబాద్ లో ఓ తుపాకీ సరెండర్ చేశారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి గన్ సరెండర్ చేసి, ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
చంద్రగిరిలో ఓ తుపాకీ, హైదరాబాద్‌లో ఒకటి సరెండర్
ఒక లైసెన్స్ గన్‌ను మోహన్ బాబు చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేశారు. మరో గన్ ను ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సరెండర్ చేయడం తెలిసిందే. తాను చట్ట ప్రకారం నడుచుకునే వ్యక్తినని, బాధ్యతగా ఉంటానని, చట్టాలను అతిక్రమించడం తన నైజం కాదన్నారు. మోహన్ బాబు ఇంట్లో కుటుంబ సమస్యసల కారణంగా ఇరువులు కుమారులు గొడవలు పడుతున్నారు. బౌన్సర్లతో రచ్చ చేసుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ జరిగింది. మోహన్ బాబు కూడా ఆవేశంగా మీడియా ప్రతినిధిపై దాడి చేశారు.
Also Read: Mohanbabu Guns: ఓ భారం దించేసుకున్న మోహన్ బాబు - ఇప్పటికైతే అరెస్టు నుంచి తప్పించుకున్నట్లే !
ఈ క్రమంలో ఆయన గన్ లను సరెండర్ చేయాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించినప్పటికీ ఆయన కోర్టుకు వెళ్లి విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేయడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. దాంతో డిసెంబర్ 24 తేదీ వరకూ విచారణకు హాజరు కాకుండా మోహన్ బాబు స్టే తెచ్చుకున్నారు. ఈ క్రమంలో మోహన్ బాబు తనను అరెస్ట్ చేయకుండా చూడాలని ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ హైకోర్టు మోహన్ బాబు పిటిషన్‌ను కొట్టివేస్తూ షాకిచ్చింది. కోర్టు ఇటీవల ఇచ్చిన గడువు సైతం మంగళవారం పూర్తి కానుంది. కోర్టు ఇచ్చిన గడువు పూర్తి కావడంతో మరోసారి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని చెబుతామని రాచకొండ సీపీ పేర్కొన్నారు. మోమన్ బాబు చర్యల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయన్నారు.