Shivoham: నేను మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు..చిదానందరూపాన్ని శివుడిని!
Mahashivratri Special Songs: ఆది శంకరాచార్యులు రచించిన నిర్వాణ షట్కం శివుడి శ్లోకాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినది. దీని అర్థం తెలుసుకుంటే చాలు అంతా శివోహం అని మీకు అర్థమైపోతుంది

Nirvana shatakam in Telugu : నిర్వాణ అంటే 'నిరాకారం' అని అర్థం...నిర్వాణ షట్కం దీన్నే వివరిస్తోంది..
మనో బుధ్యహంకార చిత్తాని నాహం
నచ శ్రోత్రం నజిహ్వా నచ ఘ్రాణనేత్రె |
న చ వ్యోమ భూమి ర్న తేజో న వాయుః
చిదానంద రూపః శివోహం శివోహం ||
నేను మనసుని కాదు, బుద్ధిని కాదు, అహంకారాన్ని కాదు, చిత్కాన్ని కాదు. నేను పంచేంద్రియాలైన చెవి, ముక్కు, కన్ను, నాలుక, చర్మాన్ని కూడా కాదు. పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు , ఆకాశం కూడా కానేకాదు. నేను చిదానంద రూపాన్ని..శివుడిని.
Also Read: అఘోరాలు పూజించే శివుడి రూపం ఇలా ఉంటుంది.. మీరు పూజించే రూపానికి పూర్తి భిన్నంగా!
నచ ప్రాణ సంజ్ఞో న వైపంచ వాయుః
న వా సప్తధాతు ర్నవా పంచ కోశాః |
నవాక్పాణి పాదౌ న చోపస్థ పాయూ
చిదానంద రూపః శివోహం శివోహం ||
నేను ప్రాణాన్ని నేను కాదు. పంచవాయువులైన ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలు కాదు, సప్త ధాతువులైన రక్త, మాంస, మేధో, ఆస్థి, మజ్జా, రస, శుక్రములను కాదు. పంచకోశాలైన అన్నమయ,ప్రాణమయ,మనోమయ, విజ్ఞ్యానమయ, ఆనందమయాన్ని కానేకాదు. కర్మేంద్రియాలైన వాక్కు,పాణి,పాద,పాయు,ఉపస్థను కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని.
న మే ద్వేషరాగౌ న మే లోభమోహో
మదో నైవ మే నైవ మాత్సర్యభావః |
న ధర్మో న చార్ధో న కామో న మోక్షః
చిదానంద రూపః శివోహం శివోహం ||
నాలో రాగద్వేషాలు లేవు, లోభమోహాలు లేవు. నాలో మదమాత్సర్యాలు లేవు. ధర్మార్ధకామమోక్షాలు నేనుకాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని.
న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
నమన్త్రో నతీర్ధం నవేదా నయజ్ఞః |
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానంద రూపః శివోహం శివోహం ||
నాకు పాపపుణ్యాలు లేవు. నాకు సుఖదుఃఖాలు లేవు. మంత్రాలు, తీర్థాలు, వేదాలు, యజ్ఞాలు నేను కాదు. అనుభవించేవాడిని నేను కాదు. అనుభవింపదగిన వస్తువు నేను కాదు. అనుభవం నేను కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని.
నమే మృత్యు ర్న శంకా నమే జాతిభేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మ |
న బంధు ర్న మిత్రం గురుర్నైవ శిష్యః
చిదానంద రూపః శివోహం శివోహం ||
నాకు జననమరణాలు లేవు. నాలో జాతి భేధాలు లేవు. నాకు తల్లిదండ్రులు లేరు. నాకు బంధుమిత్రులు లేరు. నాకు గురుశిష్యులు లేరు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని.
Also Read: అయ్యవారిపై అమ్మవారికి ఎన్ని సందేహాలో, భోళా శంకరుడిని పార్వతి అడిగిన ప్రశ్నలివే
అహం నిర్వికల్పో నిరాకార రూపో
విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్ |
న చ సంగతం నైవ ముక్తిర్ న మేయ:
చిదానంద రూపః శివోహం శివోహం ||
నేను నిర్వికల్పుడను, ఆకారం లేనివాడను, సర్వేంద్రియాలను వికసింపజేస్తున్నాను. అన్నింటిలో సమానంగా ఉన్నాను, నాకు మోక్షం లేదు, బంధము లేదు, నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని.
Also Read: విందు భోజనానికి పిలవరు.. విషాహారానికి అగ్రస్థానం ఇస్తారు- ఎట్టాగయ్యా శివా!






















