Tesla Car Price In India: భారత్‌లో టెస్లా కార్ ధరెంతో తెలుసా? లో-ఎండ్ మోడల్‌ను కూడా సామాన్యులు కొనలేరు
Tesla Cars In India: భారతదేశానికి టెస్లా రాక గురించిన ఊహాగానాలు ఎక్కువయ్యాయి. టెస్లా కారు భారతదేశంలోకి ప్రవేశిస్తే, దాని ధర ఎంత ఉంటుందన్నది అందరిలో ఆసక్తికరంగా మారింది.

Tesla Car Plant To Be Set Up In India: అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా త్వరలో భారతదేశ మార్కెట్‌లోకి ప్రవేశించనుందనే వార్తలు ఇప్పుడు హెడ్‌లైన్స్‌లో కనిపిస్తున్నాయి. వాస్తవానికి, మన దేశ రోడ్ల మీద టెస్లా కార్లు ఇప్పటికే పరుగులు తీస్తున్నాయి. అవన్నీ దిగుమతి చేసుకున్న కార్లు, మన దేశంలో తయారైనవి కావు. టెస్లా కంపెనీకి భారత్‌లో కార్ల ఉత్పత్తి ఫ్లాంట్ లేదు. టెస్లా కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో, మన దేశంలో టెస్లా ఫ్లాంట్ ఏర్పాటవుతుందన్న (Tesla Plant In India) అంచనాలు పెరిగాయి. బ్రోకరేజ్ సంస్థ CLSA వేసిన అంచనాల ప్రకారం, భారతదేశంలో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ధర కనీసం 35 లక్షల నుంచి 40 లక్షల రూపాయల మధ్య ఉంటుంది. భారత ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 20 శాతం తగ్గించినప్పటికీ, అది ఈ ధరలపై గణనీయమైన ప్రభావాన్ని మాత్రం చూపదు.
చవకైన మోడల్ కూడా రూ.30 లక్షలకు పైనే!
ప్రస్తుతం, అమెరికాలో టెస్లా కార్ చవకైన మోడల్ 3 (Tesla Car Model 3) ధర ఫ్యాక్టరీ స్థాయిలో 35,000 డాలర్లు (సుమారు రూ. 30.4 లక్షలు) CLSA రిపోర్ట్‌లో ఉంది. భారత ప్రభుత్వం, వీటిపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 20 శాతం వరకు తగ్గించినప్పటికీ... రహదారి పన్ను, బీమా వంటి ఇతర ఖర్చుల కారణంగా దాని ఆన్-రోడ్ ధర (Tesla Car On-road price) దాదాపు 40,000 డాలర్లు ఉంటుంది. ఇది, భారత కరెన్సీలో దాదాపు రూ. 35-40 లక్షలకు సమానం.
టెస్లా రాక వల్ల భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌పై ప్రభావం
మన దేశంలో ఇప్పటికే ఉన్న మహీంద్ర, హ్యుందాయ్-ఇ క్రెటా, మారుతి సుజుకీ ఇ-విటారా వంటి ఎలక్ట్రిక్ కార్ల కంటే టెస్లా టవకైన మోడల్ ధర దాదాపు 20 శాతం నుంచి 50 శాతం ఎక్కువ. సామాన్యుల సంగతి పక్కనబెడితే, ఎగువ మధ్య ప్రజలు కూడా అంత ధర పెట్టి టెస్లా కార్లు కొనకపోవచ్చు. దిగువ మధ్య తరగతి వాళ్లు కనీసం టెస్లా షోరూమ్‌లోకి కూడా అడుగు పెట్టరు. కాబట్టి, టెస్లా కార్లు భారతదేశంలోకి ప్రవేశించినప్పటికీ మన EV మార్కెట్‌లో గణనీయమైన మార్పు వచ్చే అవకాశం ఉండదు & ఇప్పటికే పని చేస్తున్న కార్ కంపెనీల అమ్మకాలపై పెద్దగా ప్రభావం చూపదు అన్నది మార్కెట్ నిపుణుల అభిప్రాయం.
టెస్లా కంపెనీ, సమీప భవిష్యత్‌లో దిల్లీ, ముంబైలో తన మోడళ్లను లాంచ్ చేయవచ్చు. దీని కోసం, భారతదేశంలో వివిధ పోస్టుల భర్తీ కోసం ఉద్యోగ ప్రకటన కూడా ఇచ్చింది.
టెస్లా ఎక్స్‌పీరియన్స్ వేరే లెవెల్!
ఇటీవల, సోమ్‌నాథ్ ఛటర్జీ అనే ఔత్సాహికుడు భారతీయ రోడ్లపై టెస్లా కార్‌ను నడిపి, తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అతను చెప్పిన ప్రకారం, సోమ్‌నాథ్ ఛటర్జీ మోడల్ X కార్‌ను నడిపాడు. ఇది టెస్లా సిరీస్‌లో హై-ఎండ్ మోడల్. కాబట్టి దాని ఫీచర్లు కూడా అద్భుతంగా & ఓ రేంజ్‌లో ఉన్నాయట. కార్ ఫంక్షనింగ్ కూడా పూర్తిగా డిఫరెంట్‌గా ఉందని రాశారు. భారత్‌లో ప్రస్తుతం అమ్ముడవుతున్న లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే టెస్లా డ్రైవింగ్ పూర్తిగా వేరే లెవల్‌లో ఉంది, అసలు పోల్చలేము అని సోమ్‌నాథ్ ఛటర్జీ వెల్లడించారు.
మరో ఆసక్తికర కథనం: పసిడి రేటు వింటే ఏడుపొస్తుంది - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ





















