Sandhya Theater: సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
Hyderabad News: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ అండగా నిలిచింది. సంస్థ నిర్మాత నవీన్ ఆస్పత్రికి వెళ్లి బాలున్ని పరామర్శించి రూ.50 లక్షల చెక్కు అందజేశారు.
Mythri Movie Makers Helped Victim Family In Sandhya Theater Incident: సంధ్య థియేటర్ తొక్కిసలాట (Sandhya Theater Stampede) ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి 'పుష్ప 2' చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) అండగా నిలిచింది. ఈ మేరకు రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మాత నవీన్.. రూ.50 లక్షల చెక్కును ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి తండ్రి భాస్కర్‌కు అందజేశారు. బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కాగా, ఈ నెల 4వ తేదీన పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధిత కుటుంబానికి ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. బాలుడు శ్రీతేజ్ పేరిట ఓ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా సాయం అందించి బాలుని భవిష్యత్‌కు అండగా నిలవాలని భావిస్తున్నట్లు సమాచారం.
కాగా, గత 2 రోజులుగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్‌పై సీఎం వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. శనివారం అసెంబ్లీలో బన్నీపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బన్నీ పోలీసులు చెప్పినా పట్టించుకోలేదని.. రోడ్ షో చేశారని అన్నారు. దీనిపై స్పందించిన అల్లు అర్జున్.. సీఎం వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు సైతం ఆ రోజు ఘటనకు సంబంధించిన వీడియోలను రిలీజ్ చేశారు. ఘటన జరిగిన సమయంలో థియేటర్ నుంచి వెళ్లిపోవాలని తాము సూచించినా బన్నీ.. పూర్తిగా సినిమా చూసిన తర్వాతే వెళ్తానని చెప్పినట్లు వెల్లడించారు. మరోవైపు, ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం అల్లు అర్జున్ ఇంటిపై విద్యార్థి సంఘాల నేతలు దాడి చేశారు.
దాడి నిందితులకు బెయిల్
బన్నీ ఇంటిని ముట్టడించిన ఓయూ జేఏసీ నేతలు అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంటి గోడలు ఎక్కి టమాటాలు, రాళ్లతో దాడి చేశారు. ఆవరణలోని పువ్వుల కుండీలు ధ్వంసం చేశారు. రేవతి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఇంటి వద్ద భారీగా మోహరించారు. ఆందోళనకారులను వనస్థలిపురంలోని న్యాయమూర్తి నివాసంలో జూబ్లీహిల్స్ పోలీసులు హాజరు పరిచారు. ఆరుగురు నిందితులకు ఒక్కొక్కరు రూ.10 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి వారికి బెయిల్ మంజూరు చేశారు.
గాంధీ భవన్‌కు బన్నీ మామ
మరోవైపు, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి సోమవారం గాంధీ భవన్‌కు వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీని కలిశారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీడబ్ల్యూసీ సభ్యుడు కొప్పులరాజు, మున్షీ ఉన్నారనే సమాచారంతో ఆయన గాంధీభవన్‌కు వెళ్లారు. పీసీసీ అధ్యక్షుడు మీడియా సమావేశంలో ఉన్నందున మున్షీని కలిసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న మహేశ్ కుమార్ గౌడ్.. చంద్రశేఖర్ రెడ్డికి ఫోన్ చేశారు. 'బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి నాకు మంచి స్నేహితుడు. నేను మీడియా సమావేశంలో ఉన్నందున ఆయన్ను కలవలేకపోయాను. దీపాదాస్ మున్షీని ఆయన కలిశారు. ఆయనకు ఫోన్ చేసి మాట్లాడాను. ఒకట్రెండు రోజుల్లో కూర్చుని మాట్లాడదాం అని చెప్పాను.' అని పేర్కొన్నారు.