Harish Rao on KTR Arrest: కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం కన్ఫామ్, ఫార్ములా ఈ రేసు కేసుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
అడుగడుగునా కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు, అవినీతిపై ప్రశ్నిస్తున్నారన్న కారణంగానే కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
Formula E Race Case in Hyderabad | హైదరాబాద్: రైతు బంధుపై కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు రూ.15 వేలు కాకుండా రూ.12 వేలు ఇస్తున్నారని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) మండిపడ్డారు. హైకోర్టు కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ మంగళవారం కొట్టివేసిన అనంతరం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్ లోని నందినగర్ కేసీఆర్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి (Recanth Reddy) అక్రమ కేసులు పెట్టినా వదిలిపెట్టేది లేదు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు, కుట్రలు, అక్రమ కేసులతో మేం తగ్గుతామని రేవంత్ అనుకుంటున్నారు. మీ అక్రమ కేసులకు భయపడేది లేదు. హైకోర్టు కేవలం ఏసీబీని కేసు విచారణ కొనసాగించాలని చెప్పింది. అంతేగానీ ఫార్ములా ఈ రేసు కేసులో అవినీతి అనే అంశమే లేదు.
కేటీఆర్ విచారణకు వస్తున్నా కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది
రేవంత్ రెడ్డి ఏడాది తరువాత కేటీఆర్ మీద కేసు పెట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని కేటీఆర్ అడుగడుగునా ప్రశ్నించడంతో కుట్రపూరితంగా ఆయన మీద కేసు పెట్టారు. తప్పు చేయలేదు కనుక విచారణకు ఏసీబీ ఆఫీసుకు వెళ్లారు. కానీ లాయర్లను అడ్డుకుని హక్కులు ఉల్లంఘించడంతో కేటీఆర్ తిరిగి వచ్చేశారు. ఫార్ములా ఈ కారు రేసును తమ రాష్ట్రాలకు రాలేదని, తెలంగాణ గ్రేట్ అని అంతా కొనియాడారు. న్యాయవాదులతో సంప్రదించి సుప్రీంకోర్టుకు వెళ్లడంపై నిర్ణయం తీసుకుంటాం. ప్రజలపక్షాన నిరంతరం పోరాటం చేస్తాం. అధైర్యపడే ప్రసక్తే లేదు. కేసు విచారణకు కేటీఆర్ సహకరిస్తున్నా, దుష్ప్రచారం చేయాలని రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులు చూస్తున్నారు.
న్యాయస్థానాలపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. కానీ రేవంత్ రెడ్డిపై నమ్మకం లేదు. కేసు ఓడిపోయారని, హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నట్లు కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఇకనైనా మానుకోవాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పినట్లుగా ఇది తుఫేల్ కేసు. ఫార్ములా ఈ రేసుతో తెలంగాణ బ్రాండ్ ఇమేజీ వచ్చింది. ఇందులో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగలేదు. ఈరోజు అరెస్ట్ చేస్తారో, రేపు అరెస్ట్ చేస్తారో. ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు అరెస్టయ్యాం. కేసీఆర్ అరెస్టయ్యి వరంగల్ జైలుకు వెళ్లారు. చివరికి ఫలితంగా రాష్ట్రం సాధించుకున్నాం.
కచ్చితంగా కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారు..
రేవంత్ రెడ్డి ఏదో రోజు కేటీఆర్‌ను అక్రమ అరెస్ట్ చేస్తారని మాకు తెలుసు. రాహుల్ గాంధీ ఈడీ ఆఫీసుకు అడ్వకేట్ లేకుండా వెళ్లారా? ముఖ్యనేతలం సమావేశమై పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తాం. అంతేగానీ కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను మాత్రం ప్రశ్నించడం ఆపం. రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ప్రత్యేకంగా రాకపోతే గ్రీన్ కో కు ప్రయోజనం ఎలా చేకూర్చినట్లు. గ్రీన్ కో సొంత డబ్బులు పెట్టి ఫార్ములా ఈ రేసు నిర్వహించింది. ఇందులో రేవంత్ రెడ్డికి వచ్చిన నొప్పి ఏంటి. ఏసీబీ నోటీసులు వస్తే కేటీఆర్ నిజాయితీగా విచారణకు వెళ్లారు. ఈ 9న మరోసారి విచారణకు హాజరవుతారు. బీఆర్ఎస్ శ్రేణులు దీనిపై భయపడే ప్రసక్తే లేదు. నోట్ల కట్టలతో ఓటుకు నోట్లు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ప్రభుత్వం పేరు పెంచే పనిచేసిన కేటీఆర్‌పై ఆరోపణలు రాజకీయ కుట్రలో భాగమే. ఎన్ని కేసులు పెట్టినా తాము వెనక్కి తగ్గేది లేదని, ప్రజా ప్రయోజనాల పోరాటం కొనసాగిస్తామని’ హరీష్ రావు స్పష్టం చేశారు.