Adilabad News: ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
Abp Desam Effect | నిరుపేద విద్యార్థులు, వృద్ధులు చలికి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారని ఏబీపీ దేశం ఇచ్చి కథనానికి స్పందన లభించింది. భీమ్ ఆర్మీ యూత్ వారికి స్వెటర్లు, దుప్పట్లు పంచారు.
Adilabad News: ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరిగిపోవడం వల్ల వృద్ధులు చిన్నారులు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఏబీపీ దేశం "చలికి వణికిపోతున్న బడి పిల్లలు.. ఎండలోనే పాఠాలు" అనే కథనాన్ని ప్రసారం చేసింది.
ఇటీవల స్పందించిన కలెక్టర్
మొదట ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించారు. ఉదయం పూట విద్యార్థులు తొందరగా లేవలేక బడికి ఆలస్యంగా వెళ్లడంతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా సైతం పాఠశాలల సమయాన్ని ఉదయం 9:15 నుంచి 9:40 కి మార్చారు. అదేవిధంగా బొడ్డిగూడ గ్రామంలోని నిరుపేదలైన కోలాం ఆదివాసి విద్యార్థులకు స్వెటర్లు, వృద్ధులకు సరైన దుప్పట్లు లేకపోవడంతో అదిలాబాద్ జిల్లాకు చెందిన భీమ్ ఆర్మీ యూత్ సభ్యులు abp కథనంతో స్పందించి బొడ్డిగూడ పాఠశాలలోని నిరుపేద విద్యార్థులకు స్వెటర్లు, నిస్సహాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు, వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. దీంతో బొడ్డిగూడ పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు ‘ఏబీపీ దేశం’కు కృతజ్ఞతలు తెలిపారు. అటూ దుప్పట్లు స్వెటర్లు పంపిణీ చేసిన భీమ్ ఆర్మీ యూత్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
భీమ్ ఆర్మీ యూత్ పెద్ద మనసు
తమ గోడను వినిపించినందుకు స్పందించిన భీమ్ ఆర్మీ యూత్.. నిస్సహాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు స్వెటర్లు, దుప్పట్లను పంపిణీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక మారుమూల ప్రాంతాల్లో గుట్టల్లో కొండల్లో నివసించేవారు ఇంకా చాలామంది ఉన్నారని వారికి సైతం మరికొందరు దాతలు ముందుకు వచ్చి దుప్పట్లు స్వీట్టర్లను పంపిణీ చేసే దిశగా ముందుకు రావాలని, నిరుపేదలకొసం మీ సేవలను ఇలాగే కొనసాగిస్తూ ముందుకు నడవాలనీ, ఇలాంటి సేవలను నిరుపేదలకు అందరూ అందిస్తూ ప్రజాసేవలో ముందుండాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ యూత్ ఖానాపూర్ నియోజక వర్గ అధ్యక్షులు పరత్వాగ్ సందీప్, ఇంద్రవెల్లి మండల అధ్యక్షులు సూర్యవంశీ ఉత్తం, యూత్ సభ్యులు కాంబ్లే అతిష్, సూర్యవంశీ రోహిత్, కాంబ్లే రాజేందర్, సింగారే కిరణ్, వాగ్మారే విశాల్ మరియు బొడ్డిగూడ గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత