India vs Pakistan: టీమిండియా ప్లేయింగ్ లెవన్ ఇదే..! ఒక మార్పు తప్పదా? ఆ ప్లేయర్ పై వేటుకు ఛాన్స్
IND vs PAK: 2010 నుంచి పాక్ పై అంతర్జాతీయ మ్యాచ్ ల్లో భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. చివరిసారిగా 2023 వన్డే ప్రపంచకప్ లో ఇరు జట్లు ఆడగా, భారత్ ఘన విజయం సాధించింది.

India vs Pakistan Champions Trophy 2025: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో పోరుకు భారత్ సిద్ధమైంది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో గ్రూప్-బి లీగ్ మ్యాచ్ లో ఆదివారం ఈ మ్యాచ్ ఆడుతుంది. ఇప్పటికే బంగ్లాదేశ్ తో జరిగిన తొలి లీగ్ మ్యాచ్ లో ఆరు వికెట్లతో గెలిచిన భారత్.. ఈ మ్యాచ్ లో నెగ్గి, సెమీస్ కు వెళ్లేందుకు ఉత్సాహంగా ఉంది. జట్టులోని ప్రధాన ఆటగాళ్లు అందరూ ఫామ్, మంచి టచ్ లో ఉండటం సానుకూలాంశం. మరోవైపు పాక్ మాత్రం చాలా ఒత్తిడిలో ఉంది.
డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన పాక్.. తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో 60 పరుగులతో ఓడి, టోర్నీ నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రమాదంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్ పాక్ కు చావోరేవో అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ మ్యాచ్ లో సర్వశక్తులు ఒడ్డి మరి బరిలోకి దిగుతోంది. ఇక తొలి మ్యాచ్ లో దాదాపు అన్ని రంగాల్లో రాణించిన భారత్.. కీలకమైన ఈ మ్యాచ్ కు మరో మార్పు చేసే అవకాశముంది. జట్టు లైనప్ ను పరిశీలిద్దాం..
Ready to go again on Super Sunday 🙌#TeamIndia | #ChampionsTrophy | #PAKvIND pic.twitter.com/wzgEvycPWG
— BCCI (@BCCI) February 22, 2025
స్థిరమైన బ్యాటింగ్ ఆర్డర్..
ఓపెనర్లుగా వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ, శుభమాన్ గిల్ బరిలోకి దిగుతారు. విధ్వంసక ఇన్నింగ్స్ లో భారత్ కు మంచి స్టార్ట్ ను రోహిత్ ను అందిస్తుండగా, వరుస సెంచరీలతో గిల్ సత్తా చాటుతున్నాడు. గత రెండు మ్యాచ్ ల్లో సెంచరీలు చేసి గిల్ మంచి దూకుడు మీద ఉన్నాడు. తొలి సారి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్నా, ఆ ఒత్తిడి లేకుండా సాధికారికంగా ఆడాడు. కఠినమైన పిచ్ పై గత మ్యాచ్ లో మెచ్యూర్ గా ఆడి రాణించాడు. బాగా పరుగులు సాధించకున్నా విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్ లోనే ఉన్నారు. మిడిలార్డర్లో కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ మంచి ఫామ్ లో ఉన్నారు. ఆల్ రౌండర్లగా హార్దిక్ పాండ్యా, అక్షర్, రవీంద్ర జడేజా రెండు విభాగాల్లో ఫర్వాలేదనిపిస్తున్నారు.
సత్తా చాటిన పేసర్లు..
గత మ్యాచ్ లో పేసర్లు ఒంటిచేత్తో ప్రత్యర్థిని శాసించారు. వెటరన్ పేసర్ మహ్మద్ షమీ ఐదు, హర్షిత్ రాణా మూడు వికెట్లతో సత్తా చాటారు. ఈ మ్యాచ్ లోనూ ఇలాంటి ప్రదర్శనే టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఇక స్పెషలిస్టు స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ ను మాత్రం పాక్ తో మ్యాచ్ లో మార్చే అవకాశముంది. తను మంచి టచ్ లో కన్పించడం లేదు. అతనికి బదులుగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఆడించే అవకాశముంది. 2010 నుంచి పాక్ పై అంతర్జాతీయ మ్యాచ్ ల్లో భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.
చివరిసారిగా 2023 వన్డే ప్రపంచకప్ లో ఇరు జట్లు ఆడగా, భారత్ ఘన విజయం సాధించింది. ఈ సారి కూడా అలాంటి ప్రదర్శనే చేయాలని అభిమానులు భావిస్తున్నారు. ఈ మ్యాచ్ మ.2.30 గం.ల నుంచి స్టార్ నెట్ వర్క్, జియో 18 2, జియో హాట్ స్టార్ లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
భారత జట్టు ప్లేయింగ్ లెవన్ (అంచనా): రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్, అక్షర్, హార్దిక్, జడేజా, షమీ, హర్షిత్, వరుణ్.
Read Also: WPL 2025 UPW Vs DC Result Update: హారీస్ హ్యాట్రిక్.. యూపీ ఘనవిజయం.. 33 రన్స్ తో ఢిల్లీ చిత్తు




















