Revanth Reddy: యాదగిరిగుట్టలో బంగారు విమాన గోపురం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, పూర్తి విశేషాలివే
Telangana News | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి ఆలయంలో స్వామివారి బంగారు విమాన గోపురాన్ని ఆవిష్కరించారు. ఆలయంలో మహా కుంభాభిషేక మహా సంప్రోక్షణం నిర్వహించారు.

Maha Kumbhabhisheka Samprokshana at Yadagirigutta: యాదాద్రి: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో బంగారు గోపురాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయంలో దివ్య విమాన స్వర్ణ గోపురానికి మహా కుంభాభిషేక మహా సంప్రోక్షణం నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆలయ విమానం గోపురం స్వర్ణతాపడం చేశారు. దేశంలోనే ఎత్తయిన స్వర్ణగోపురంగా యాదాద్రి ఆలయ గోపురం రికార్డు సృష్టించింది.. బంగారు తొడుగులతో స్వామివారి ప్రతిమ దేదీప్యమానంగా వెలుగుతూ ఆలయానికి వచ్చే భక్తులకు కనువిందు చేస్తోంది.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మాజీ సీఎం కేసీఆర్ పునర్ నిర్మించారు. ఆలయాన్ని రీడిజైన్ చేయించి డెవలప్ చేశారు. తాజాగా హుండీ కానుకలు, దాతలు ఇచ్చి కానుకలతో 68.84 కిలోల బంగారంతో ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేయించారు. 125 కిలోల స్వచ్ఛమైన బంగారంతో తాపడం చేశారు. ఇందుకోసం దాదాపు రూ.80 కోట్ల మేర ఖర్చు అయినట్లు యాదాద్రి ఆలయ అధికారులు తెలిపారు. నరసింహావతారాలతో పాటు లక్ష్మీ, కేశవ నారాయణ, గరుడమూర్తుల ఆకారాలు ఆధ్యాత్మిక శోభతో భక్తులకు కనువిందు చేస్తున్నాయి.
యాదగిరిగుట్ట ఆలయంలో జరిగిన దివ్య విమాన స్వర్ణ గోపుర మహా కుంభాభిషేక వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. మహా పూర్ణాహుతిలో సీఎం దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అంతుకుముందు ఆలయ అధికారులు రేవంత్ రెడ్డి దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేదపండితులు వారిని ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు ఇచ్చారు. ఐదు రోజులుగా మహా సంప్రోక్షణ, స్వర్ణ విమానావిష్కరణ, మహా కుంభాభిషేకాలను వేద పండితులు, ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

